నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి - Sakshi


* 3 గంటలు వేచి చూసినా నాడి పట్టి చూడని వైద్యులు  

* మృత్యువుతో పోరాడి ఓడిన కేన్సర్ బాధితురాలు


సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన బి.గంగు(62) తరచూ తలనొప్పి వస్తుండటంతో 45 రోజుల క్రితం సికింద్రాబాద్ యశోద  ఆస్పత్రిలో పరీక్ష చేయించుకుంది. వైద్యులు బ్రెయిన్ కేన్సర్‌గా నిర్ధారించారు. గత జూలై 27న ఆమె ఆస్పత్రిలో చేరింది. సోమవారం ఉదయం ఐదు గంటలకు‘రోగి ఆరోగ్య పరిస్థితి విషమించింది.. మా వల్ల కాదు..



గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అంటూ వైద్యులు బంధువులకు సూచించారు. కుమారుడు ఆంజనేయులు అచేతనస్థితిలో ఉన్న తల్లి దుస్థితిని చూసి తల్లడిల్లిపోయాడు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని తల్లిని అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించాడు. ఉదయం 7.30 గంటలకు అత్యవసర విభాగానికి చేరుకున్నాడు. ఇక్కడ కేన్సర్ విభాగం లేదని.. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. ఆలస్యం చేయకుండా అదే అంబులెన్స్‌లో ఉదయం 8.30 గంటలకు ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.



ఓపీ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాతే అడ్మిట్ చేస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. మృత్యువుతో పోరాడుతున్న తల్లిని అంబులెన్స్ డ్రైవర్‌కు అప్పగించి ఆంజనేయులు ఓపీకి చేరుకున్నాడు. వెంటిలేటర్ లేకపోవడంతో డ్రైవర్ నెబులైజర్ పంప్ ద్వారా ఆమెకు కృత్రిమ శ్వాస అందిస్తున్నాడు. ఓపీ వద్ద భారీ క్యూ ఉంది. ఎమర్జెన్సీ అని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. క్యూలో నిలబడి చీటి రాయించుకునే సరికి సమయం 11.10 గంటలైంది. ఆంజనేయులు అంబులెన్స్ వద్దకు చేరుకునేలోపే తల్లి కన్నుమూసింది.



అప్పటికీ ఒక్క వైద్యుడు కూడా అటు వైపు రాలేదు. ఇలా ఒక్క గంగూ మాత్రమే కాదు కేన్సర్‌తో బాధపడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి చేరుకుంటున్న వందల మంది నిరుపేద రోగులది ఇదే దుస్థితి. బోలెడు ఆశతో ఆస్పత్రిలో అడుగు పెట్టిన కేన్సర్ బాధితులు ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం మూలంగా మృతి చెందుతున్నారు. ఇలా వారానికి సగటున ముగ్గురు రోగులు విగత జీవులవుతున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

 

కనిపించని క్యాజువాల్టీ...

ప్రతిష్టాత్మక కేన్సర్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు క్యాజువాల్టీ లేకపోవడం గమనార్హం. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పంపుతూ చేతులు దులుపుకుంటున్నారు. అదేమంటే కేన్సర్ ఎమర్జెన్సీ వైద్యం కాదు కదా! అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుతుండటం కొసమెరుపు.

 

‘కేన్సర్ నొప్పి కంటే వైద్యులు, సిబ్బంది వ్యవహార శైలే మమ్మల్ని ఎక్కువ బాధిస్తోంది. ఇక్కడ పని చేస్తున్న వైద్యులు కనీసం రోగి నాడి పట్టి చూసిన పాపాన పోవడం లేదు’అని ఖమ్మం జిల్లాకు చెందిన కేన్సర్ బాధితుడు నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.‘వైద్యులు రాసిన మందుల చీటి తీసుకుని ఫార్మసీకి వెళ్తే మందులు ఇవ్వడం లేదు. ఆస్పత్రి ఎదురుగా ఉన్న మెడికల్ షాపులో దొరుకుతాయి కొనుక్కో’అంటూ ఫార్మసిస్టులు ఉచిత సలహా ఇస్తున్నారని మియాపూర్‌కు చెందిన కేన్సర్ బాధితురాలు సురేనా ఆరోపించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top