కొడుకే కాదన్నాడు.. ఇప్పుడు టికెట్ కోరాడు!

కొడుకే కాదన్నాడు.. ఇప్పుడు టికెట్ కోరాడు! - Sakshi

ఒకప్పుడు అసలు తన కన్న కొడుకే కాదంటూ కోర్టులలో సైతం గట్టిగా వాదించిన వ్యక్తి, ఇప్పుడు అదే కొడుకు కోసం బీజేపీలో చేరారు. అవును.. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణదత్త తివారీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తన కొడుకు రోహిత్ శేఖర్‌తో కలిసి వెళ్లి అతడికి కూడా పార్టీ సభ్యత్వం ఇప్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలోనే ఇద్దరూ పార్టీలో చేరారు. ఉత్తరాఖండ్ నుంచి బీజేపీ తరఫున అసెంబ్లీ టికెట్ రోహిత్‌కు ఇప్పించాలన్నది తివారీ ఆశ. అంతకుముందు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్ ఇప్పించాలని ప్రయత్నించినా కుదరకపోవడంతో ఇప్పుడు బీజేపీ పంచన చేరారు. 

 

ఎవరీ రోహిత్ 

రోహిత్ శేఖర్.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా గట్టిగా వినిపించేది. ఎన్డీ తివారీ తన కన్న తండ్రి అంటూ న్యాయపోరాటం చేసి విజయం సాధించిన వ్యక్తే ఈ రోహిత్ శేఖర్. ఒకప్పుడు తన కొడుకు కాదని, డీఎన్‌ఏ పరీక్షలకు సైతం ఒప్పుకోని తివారీ ఆ తర్వాత మారిపోయారు. అప్పట్లో కోర్టు విచారణలో.. రోహిత్ శేఖర్‌కు తాను జన్మనివ్వలేదని ఆయన నొక్కి చెప్పారు. ఉజ్వల శర్మ(రోహిత్ తల్లి)తో తనకు ఎలాంటి భౌతిక, శారీరక సంబంధమూ లేదని పేర్కొన్నారు. తనపై నమోదైన పితృత్వపు కేసు వెనుక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉందని ఆరోపించారు. 

 

 

ఇన్ని చేసిన తివారీ.. ఆ తర్వాతి కాలంలో మాత్రం ఆయన దిగివచ్చారు. 2014 మే 4వ తేదీన మీడియా సమావేశం పెట్టి మరీ రోహిత్ తన కన్న కొడుకుని ప్రకటించారు.  ‘నేను అతడి(రోహిత్)ని నా కుమారునిగా అంగీకరిస్తున్నా. అతని డీఎన్‌ఏ నా డీఎన్‌ఏ సరిపోలడంతో రెండేళ్ల క్రితమే ఈ విషయం నిర్ధారణ అయ్యింది. దీనిపై ఇక ఏ వివాదమూ ఉండదని భావిస్తున్నా’ అని అప్పట్లో తివారీ చెప్పారు.

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top