సిద్ధూ.. కొన్నాళ్లు ఆగు!

సిద్ధూ.. కొన్నాళ్లు ఆగు!


ఒకవైపు పంజాబ్ కేబినెట్‌లో మంత్రిగా వ్యవహరిస్తూ, మరోవైపు అత్యధిక టీఆర్పీ రేటింగు వచ్చే కపిల్ శర్మ షోలో కూడా పాల్గొనాలనుకున్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆశల మీద నీళ్లు చల్లారు. తన కుటుంబాన్ని పోషించుకోడానికి టీవీ కార్యక్రమాలు చేస్తానని చెప్పిన ఆయనను.. కొన్నాళ్లు ఆగమని ప్రభుత్వం సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రిగా ఉన్నందున.. సాంస్కృతిక శాఖతో ప్రత్యక్ష సంబంధం ఉండే టీవీ షోలలో పాల్గొనడం అంత మంచిది కాదని ఆయనకు చెప్పారట. ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదులే తేల్చేశారు. మంత్రులు ప్రైవేటు పనులు చేసుకోకూడదని తెలిపారు.



పంజాబ్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఎంతగానో ఆశపడిన సిద్ధూకు చివరికి అంతగా ప్రాధాన్యం లేని శాఖలు రావడంతో ఆయన తీవ్రంగా అసంతృప్తి చెందారు. అందుకే తాను ఈ షోలో పాల్గొనడం కొనసాగిస్తానన్నారు. తాను రాత్రిపూట ఇలా టీవీ షోలు చేసుకుంటాను తప్ప మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ లాగ బస్సుల వ్యాపారం చేయలేనని, డబ్బు సంపాదనకు అవినీతికి పాల్పడలేనని చెప్పారు. తన ఓటర్లకు తాను టీవీ షోలు చేసినా అభ్యంతరం లేదని, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తాను ఏం చేస్తే ఎవరికి నష్టమని సిద్ధూ అడిగారు. టీవీ షోలకు సంబంధించిన 75 శాతం పని ఇప్పటికే వదిలేశానని, ఐపీఎల్‌లో కామెంట్రీ చెప్పడం లేదని, ఇక తన చట్టబద్ధమైన సంపాదనను పూర్తిగా ఆపేయాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top