నరేంద్ర మోదీ మాట తప్పారు

నరేంద్ర మోదీ మాట తప్పారు - Sakshi


న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో దేశంలోని రైతుల తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ దిశగా ఆయన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  పైగా కరవు పరిస్థితులతో అల్లాడిపోతున్న తమిళనాడు రైతులు జంతమంతర్‌ వద్ద 41 రోజులపాటు కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు అన్ని రకాలుగా ఆందోళన చేసినా వారి గోడు వినడానికి ఇష్టపడలేదు. కనీసం మాట్లాడేందుకు వారికి అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వారితో మాట్లాడినా వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు.



తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి హామీ మేరకు తమిళనాడు రైతులు ఆదివారం నాడు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించిన విషయం తెల్సిందే. అర్థనగ్నంగా, ముప్పావు నగ్నంగా ఆందోళన చేసిన కేంద్రంగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ పట్టించుకోకపోవడంతో వారు చివరకు తమ మూత్రాన్ని తాము తాగారు. అప్పటికీ కదలిక రాకపోవడంతో తమ అశుద్ధాన్ని తామే తింటామని కూడా హెచ్చరించడంతో ఢిల్లీ వచ్చిన పళనిస్వామి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.



తమిళనాడులో వరుసగా రెండేళ్లు కరవు పరిస్థితులు నెలకొనడంతో పంటలు బాగా దెబ్బతిని రైతులు పూర్తిగా దివాలాతీశారు. చేసిన అప్పులు తీర్చే మార్గంలేక గత ఆరు నెలల కాలంలో 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఐదెకరాలలోపు భూమున్న రైతుల పంటల రుణాలను (రెండువేల కోట్లు) తమిళనాడు ప్రభుత్వం మాఫీ చేసింది. చిన్న, పెద్ద రైతులన్న తేడా లేకుండా రైతులందరి పంట రుణాలను మాఫీ చేయాలని మద్రాస్‌ హైకోర్టు ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంట రూణాలను పూర్తిగా రద్దు చేయడంతోపాటు కనీస మద్దతు ధరను రెండింతలు చేయాలని, రోజు రోజుకు పెరిగిపోతున్న ఎరువుల ధరలను తగ్గించాలని తమిళ రైతుల ప్రధాన డిమాండ్లు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందీ కేంద్ర ప్రభుత్వమే. అయినా స్పందించడం లేదు.





జయలలిత మరణానంతరం వర్గాలుగా, పార్టీలుగా చీలిపోయిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, పదవుల పరిరక్షణలో బిజీబిజీగా ఉన్నది. రైతుల బాగోగులను పట్టించుకునే పరిస్థితిలో లేదు. రైతుల పరిస్థితి ఒక తమిళనాడులోనే దారుణంగా లేదు. ఎక్కువో, తక్కువో దేశమంతా ఉంది. కేంద్రం సకాలంలో స్పందిచకపోతే ఒక తమిళనాడు రైతులే కాదు, అన్ని ప్రాంతాల రైతులు ఐక్యమై ఆందోళన చేసే అవకాశం లేకపోలేదు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top