స్మశానానికి ముగ్గు..చంద్రబాబుకు సిగ్గు.. ఉండదు

స్మశానానికి ముగ్గు..చంద్రబాబుకు సిగ్గు ఉండదు - Sakshi


- నంద్యాల ప్రచారంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్‌

- భూమాను దొంగ అన్నోళ్లు ఇవాళ దేవుడంటున్నారు


- శిల్పా లోకల్‌.. ఎన్నికల తర్వాత టీడీపీ అభ్యర్థి కనపడరు

- ఫ్యాన్‌ ఇంట్లో ఉంటుంది.. సైకిల్‌ బయట

- వైఎస్సార్‌సీపీకి ఓటేసి టీడీపీకి దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పండి






నంద్యాల:
‘‘మేము నిర్మించిన రోడ్లపై నడుస్తూ మాకు ఓటేయరా? అని చంద్రబాబు అడుగుతున్నారు. మరి మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు వేయించిన రోడ్లపై నువ్వు పాదయాత్ర ఎలా చేశావ్? ఆయన నుంచి ఎన్నో మేళ్లు పొందిన రైతులు, మహిళలు, విద్యార్థులను ఓట్లు ఎలా అడిగావ్‌?’’ అని ముఖ్యమంత్రిని నిలదీశారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. సోమవారం నంద్యాలలోని యాళ్లూరులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఉప ఎన్నికలో చంద్రబాబుకు బుద్ధి చెప్పకుంటే.. వచ్చే రెండేళ్లలో టీడీపీ భరించలేని స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందని రోజా గుర్తుచేశారు. అసెంబ్లీ టైగర్‌, ఆంధ్రా ఫ్యూచర్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బలపరుస్తూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.



‘‘మీరు ఓటు ఎవరికి వేశారో తెలిసిపోతుంది, ప్రభుత్వ పథకాలు తొలగిస్తామని టీడీపీ వాళ్లు ఓటర్లను బెదిరిస్తున్నారు. కానీ, మనం వేసే ఓటు ఎప్పటికీ సీక్రెట్‌గానే ఉంటుంది. ఎన్నికల సంఘం కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. కాబట్టి మీరు భయపడాల్సిన పనిలేదు. ధైర్యంగా.. మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తోన్న చంద్రబాబుకు దిమ్మతిరిగి బొమ్మ కనపడేలా ఓటు వేయండి. స్మశానానికి ముగ్గుండదు.. చంద్రబాబుకు సిగ్గుండదు. గతంలో భూమా నాగిరెడ్డిని దొంగ, విషవృక్షం అని తిట్టిపోసి.. ఇప్పుడు దేవుడని పొగుడుతున్నారు. మైనారిటీలు పక్కన కూర్చునేందుకు అర్హతలేదన్న విధంగా ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వని చంద్రబాబు.. పనికిరాని వాళ్లకు, దద్దమ్మ లోకేశ్‌కు మాత్రం ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. తీరా నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నిలబెట్టిన తర్వాతగానీ ఫరూఖ్‌గారికి పదవి ఇవ్వలేదు. అంటే ఎన్నికలు రాకపోతే ఆ పదవి కూడా ఇవ్వకపోయేవారు. అదే, మహానేత వైఎస్సార్‌.. మైనారిటీలను కుటుంబసభ్యులుగా చూసుకున్నారు. నలుగురికి మంత్రి పదవులు, మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవి, ముస్లిం విద్యార్థినులకు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. ఇప్పుడు జగనన్న.. నలుగురు మైనారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు’’ అని రోజా గుర్తుచేశారు.



‘‘దళితులుగా పుట్టాలని కోరుకుంటారా? అని చంద్రబాబు అన్నాడు. దళితులకు చదువు రాదని, స్నానం చేయరిని ఆదినారాయణరెడ్డి అనే దద్దమ్మ అంటున్నాడు. అంబేద్కర్‌ మొదలు నేటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఇంకా ఎంతోమంది దళిత మేధావులు డాక్టర్లు, ఐఏఎస్‌లుగా పనిచేస్తున్నారు. దళితులను, మైనారిటీలను, రైతులను, మహిళలను, విద్యార్థులను మోసం చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిందే. అలా చెప్పాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిందే’’ అని రోజా అన్నారు.



శిల్పా మోహన్‌రెడ్డి లోకల్‌: ‘‘నంద్యాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి లోకల్‌. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి, పరిష్కరిస్తారు. అదే టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి? ఎన్నికల తర్వాత ఆయన కనీసం కనిపించకుండాపోతారు. అఖిలప్రియకు, బ్రహ్మానందరెడ్డికి నంద్యాలలో కనీసం ఓట్లు కూడా లేవు. ఫ్యాన్‌ ఇంట్లో ఉంటుంది. సైకిల్‌ బయట ఉంటుంది. ఇంటిపార్టీ గుర్తు ఫ్యాన్ కు ఓటేసి జగనన్నను బలపర్చండి’’ అని రోజా అన్నారు.



బోండా.. నీకు దమ్ముంటే..: విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనకు సవాల్‌ విసరడంపై ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ‘బోడాగాడికి చంద్రబాబు పాలనపై అంత నమ్మకముంటే.. యెస్‌.. గుండు కొట్టించుకోవడానికి నేను రెడీ! బోండా నీకు దమ్ముంటే.. డబ్బులిచ్చి కొనుకున్న ఆ 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి. బోడి గుండు ఎవరికి అవుతుందో తెలుస్తుంది’’ అని రోజా బదులిచ్చారు.



ఇంట్లో చెల్లనివాళ్లు ఇక్కడ మాట్లాడటమా?: ‘‘నెల్లూరు జిల్లాకు చెందిన ఒకాయన.. ఐదు సార్లు ఎన్నికల్లో ఓడిపోయాడు. నాయనా.. నువ్వు ఇంట్లో కూర్చో అని ప్రజలు తీర్పు ఇచ్చారు. కానీ ఇవాళ మంత్రి పదవిలో ఉన్నాడు. ఇంట్లో చెల్లనివాళ్లు నంద్యాలకొచ్చి జగన్‌ను ఓడించాలని మాట్లాడుతుండటం విడ్డూరం. ఇక పుంగనూరు అమర్‌నాథ్‌రెడ్డికి మీసం, రాయలసీమ రోషం ఉంటే రాజీనామా చెయ్యాలి. నీతోపాటు  ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి, అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతోన్న మిగతా ముగ్గురు మంత్రులూ రాజీనామా చేసి అప్పుడు మాట్లాడాలి’’ అని రోజా ఫైర్‌ అయ్యారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top