ఇన్‌స్పెక్టర్‌ స్వాతి గౌడ్‌పై రహస్య విచారణ!

ఇన్‌స్పెక్టర్‌ స్వాతి గౌడ్‌పై రహస్య విచారణ! - Sakshi


- లారీ ఓనర్‌పై బౌన్సర్లతో దాడిచేయించిన వైనం

- సీసీటీవీ ఫుటేజిలో సంచలన దృశ్యాలు..

- అధికారిణి వ్యవహారశైలిపై సర్కారు సీరియస్.. సస్పెన్షన్ వేటు




హైదరాబాద్‌:
ఓ లారీ ఓనర్‌పై దాడిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువ అధికారిణి వ్యవహారం సంచలనంగా మారింది. రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎంవీఐ)గా పనిచేస్తోన్న స్వాతి గౌడ్‌ కొందరు గుండాలతో కలిసి తనపై దాడి చేశారని శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి ఎల్బీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. అదే సమయంలో ‘విధులకు ఆటంకం కల్గించాడ’ని లారీ ఓనర్‌పై స్వాతి గౌడ్‌ రివర్స్‌ కేసు పెట్టారు.



అయితే, లారీ ఓనర్‌ శ్రీకాంత్‌రెడ్డిని బౌన్సర్లు కొడుతున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో సీన్‌ రివర్స్‌ అయింది. దీంతో స్వాతి గౌడ్‌ వ్యవహారశైలిపై రహస్యంగా విచారించారణ జరిపిన ఉన్నతాధికులు చివరికి ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశారు.



అసలేం జరిగింది? సికింద్రాబాద్ ఏఎంవీఐ స్వాతి గౌడ్‌.. శనివారం రాత్రి నగరంలోని సాగర్‌ రింగ్‌ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఓ ప్రైవేటు లారీకి ఆమె చలాన రాశారు. సదరు చాలన విషయంలో లారీ ఓనర్‌కు,ఇన్‌స్పెక్టర్‌ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఒక దశలో ఆవేశంతో ఊగిపోయిన స్వాతి గౌడ్‌.. లారీ ఓనర్‌ శ్రీకాంత్‌రెడ్డిపై చేయిచేసుకున్నట్లు తెలిసింది. అంతటితో ఆగకుండా బౌన్సర్లను పిలిపించి వారితోనూ శ్రీకాంత్‌రెడ్డిని కొట్టించారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. దాడి అనంతరం నేరుగా ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన శ్రీకాంత్‌రెడ్డి.. స్వాతిగౌడ్‌పై ఫిర్యాదుచేశాడు. అటు ఆమె కూడా లారీ ఓనర్‌పై కేసు పెట్టారు.



పోలీసులు ఏం చేశారు? బాధితుడి ఫర్యాదును తీసుకున్న పోలీసులు.. ఏఎంవీఐ స్వాతి గౌడ్‌పై కేసు మాత్రం నమోదుచేయలేదు. ‘ఆమె ప్రభుత్వ అధికారిణి కనుక, ఉన్నతాధికులను, కోర్టును సంప్రదించిన తర్వాతే కేసు నమోదుచేస్తాం..’అని బాధితుడికి బదులిచ్చారు. అయితే స్వాతి గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసిన పోలీసులు లారీ ఓనర్‌ శ్రీకాంత్‌రెడ్డిని రాత్రంతా స్టేషన్‌లోనే ఉంచారు. ఈ విషయం మీడియాకు తెలియడం, దాడి దృశ్యాలు బహిర్గతం కావడంతో వ్యవహారం ఇంకాస్త జఠిలమైంది.



స్వాతిపై సస్పెన్షన్ వేటు: అక్రమ వసూళ్ల నేపథ్యంలో సికింద్రాబాద్‌ ఏఎంవీఐను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఏఎంవీఐ స్వాతిగౌడ్‌ గత రాత్రి తన పరిధిలోకి రాని ఎల్బీనగర్‌లో వాహన తనిఖీలు చేపట్టి లారీ డ్రైవర్ల నుంచి వసూళ్లు చేశారు. మాట వినని వారిని తన మనుషుల చేత కొట్టించారు. దీనిపై బాధిత డ్రైవర్లు ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉన్నతాధికారులకు వివరాలు అందజేశారు. ఈ మేరకు స్పందించిన ఉన్నతాధికారులు స్వాతిగౌడ్‌ను సస్పెండ్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.



ఓవర్‌గా మాట్లాడుతున్నావ్‌..: బౌన్సర్ల దాడిలో గాయపడ్డ లారీ ఓనర్‌ శ్రీకాంత్‌రెడ్డి.. జరిగిన వ్యవహారంపై బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఇన్స్‌పెక్టర్‌ పట్ల మర్యాదగానే ప్రవర్తించానని, ఆమె మాత్రం ఇష్టారీతిగా దూషించి, కొట్టారని బాధితుడు చెప్పాడు. ‘నేనూ గ్రాడ్యుయేట్‌నే. ఓ ఆఫీసర్‌తో ఎలా మాట్లాడాలో తెలుసు. పొరపాటు లేకున్నా నా నుంచి డబ్బులు లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె నన్ను తిట్టారు. అప్పటికప్పుడు బౌన్సర్లను పిలిపించి దాడి చేయించారు’అని బాధితుడు శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top