ఆమె దుర్గమ్మకు గుడి కట్టించింది

ఆమె దుర్గమ్మకు గుడి కట్టించింది - Sakshi


మంద్సౌర్: శిధిలావస్థలో ఉన్న దుర్గామాత ఆలయాన్ని పునర్నిర్మించి.. ఎల్లమతాల సారం ఒకటేనని చాటుతున్నది ఓ ముస్లిం మహిళ. ఆలయాన్ని పునరుద్ధరించడమే కాకుండా అక్కడ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ అరుదైన ఘటన వివరాలివి..

 

ముస్లిం మహిళ అయిన సుఘ్రా బీ (45)  రోజుకూలి. గత పదేండ్లుగా మధ్యప్రదేశ్ మంద్సౌర్ జిల్లాలోని ఇంద్ర కాలనీలో తన కుటుంబంతో పాటు నివాసంముంటున్నది. మూడేండ్ల కిందట ఆమె తన ఇంటి పక్కనున్న ఓ ఆలయాన్ని గుర్తించింది. దుర్గామాత శీత్లామాతగా కొలువైన ఆ ఆలయం శిథిలావస్థలో ఉండటంతో తానే ఆలయ పునరుద్ధరణకు నడుం బిగించింది. ' ఆలయం శిథిలావస్థలో ఉండటంతో దానిని పునరుద్ధరించాలని నేను నిర్ణయించుకున్నాను. అందుభాగంలో కాలనీ వాసులందరినీ పిలిచి..వారి నుంచి తలో రెండు రూపాయలు సేకరించారు. ఆ డబ్బుతో ఆలయాన్ని పునర్నిర్మించాం' అని ఆమె తెలిపారు.



'ఇప్పుడు హిందూ, ముస్లింలు కలిసి ఆలయాన్ని భద్రంగా చూసుకుంటున్నారు. అందరూ కలిసి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తాము. మతమన్నది మాకు పెద్ద పట్టింపు కాదు. అయినా దుర్గామాత ప్రపంచానికి తల్లి. అందుకే ఆమె ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించాము' అని సుఘ్రా బీ వివరిస్తారు. ఈ ఆలయం, ఇక్కడ స్థానికులు చేపడుతున్న చర్యలు స్థానికంగా గ్రామంలో మతసామరస్యాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ ఆలయ కమిటీలో హిందూ, ముస్లింలు సభ్యులుగా ఉన్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం జరిగి అమ్మవారి హారతి కార్యక్రమానికి హిందూ, ముస్లింలు విధిగా హాజరవుతారు. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top