రిసెప్షన్ ఇస్తానని పిలిచి.. కూతుర్ని కాల్చేసింది

రిసెప్షన్ ఇస్తానని పిలిచి.. కూతుర్ని కాల్చేసింది - Sakshi

ఆమె పేరు జీనత్ రఫీక్. అప్పటికి ఒక్క వారం క్రితమే పెళ్లయింది. వాళ్లిద్దరికీ మంచి రిసెప్షన్ ఏర్పాటుచేస్తానని చెప్పి ఆమె తల్లి ఇంటికి పిలిచింది. వాస్తవానికి తన క్లాస్‌మేట్ హసన్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న జీనత్‌కు అమ్మ పిలవడం పెద్ద షాక్. ఎందుకంటే, వాళ్ల ప్రేమను ఆమె ఎప్పుడూ అంగీకరించలేదు. కుటుంబంలోని మిగిలిన సభ్యులదీ అదే మాట. ఎన్నిసార్లు తాము పెళ్లి చేసుకుంటామని చెప్పినా వాళ్లెవరూ ఒప్పుకోలేదు. దాంతో ఆ జంట ప్రేమను కాదనుకోలేక వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. 

 

ఎటూ పెళ్లయిపోయింది కాబట్టి, లేచిపోయిన జంట అని పేరు రాకుండా ఉండటానికి రిసెప్షన్ ఇస్తానని తల్లి పెర్వీన్ బీబీ పిలిచేసరికి కూతురు కాస్త తటపటాయించింది. అలాగే భయంతోనే సరేనని ఒప్పుకొంది. తీరా లాహోర్‌లోని తమ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పండుగ వాతావరణం ఏమీ కనిపించలేదు. అంతేకాదు.. కన్నతల్లి, తోడబుట్టిన సోదరుడు కలిసి ఆమెను విపరీతంగా కొట్టి, పీక పిసికేశారు. తర్వాత మంచానికి కట్టేసి, ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 

 

కుటుంబానికి చెడ్డపేరు తెచ్చినందుకు, అసభ్యంగా ప్రవర్తించినందుకు తన కూతుర్ని చంపేశానని పెర్వీన్ బీబీ ఆ తర్వాత చెప్పినట్లు ఆమె సోదరి తెలిపింది. జీనత్ తల్లితో పాటు సోదరుడు అనీస్ రఫీక్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తాను చేసిన నేరాన్ని ఆమె వెంటనే అంగీకరించింది. అలా చేసినందుకు ఏమాత్రం బాధ పడట్లేదని కూడా తెలిపింది. ఈ కేసులో పెర్వీన్ బీబీకి మరణశిక్ష విధించగా, అనీస్ రఫీక్‌కు జీవితఖైదు శిక్ష పడింది. పాకిస్థాన్‌లో ఇలాంటి పరువు హత్యలు తరచు జరుగుతుంటాయి. ప్రతియేటా దాదాపు వెయ్యిమంది అమ్మాయిలు తమ బంధువుల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. 2015 సంవత్సరంలో దాదాపు 1100 మంది మరణించగా, మరో 900 మంది లైంగిక హింసకు గురయ్యారు,800 మంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top