మోదీ వల్లే పాక్‌కు అవకాశం

మోదీ వల్లే పాక్‌కు అవకాశం - Sakshi


కశ్మీర్‌లో పరిస్థితులపై రాహుల్‌ గాంధీ మండిపాటు

పొరుగుదేశాలనూ దూరం చేసుకుంటున్నారని వ్యాఖ్య

బెంగళూరులో ఇందిర క్యాంటీన్లకు శ్రీకారం




బెంగళూరు: నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే జమ్మూకశ్మీర్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌కు అవకాశం చిక్కుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. బుల్లెట్లు, విమర్శలు కశ్మీరీల సమస్యలను తీర్చవన్న ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంపై స్పందించిన రాహుల్‌ ‘‘విద్వేషంతో కూడిన వాతావరణాన్ని మోదీ జమ్మూకశ్మీర్‌లో సృష్టించారు. ఇలా మొదలైన హింస.. ద్వేషం వల్ల లాభపడుతున్నది పాకిస్తానే’’అని వ్యాఖ్యానించారు.



 బుధవారం బెంగళూరులో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ అంశంపై పదేళ్ల పాటు మన్మోహన్, చిదంబరం, జైరాంరమేశ్‌తో కలసి పదేళ్ల పాటు తాను శ్రమించి శాంతి నెలకొనేలా చేశానని, కానీ మోదీ ఒక్క నెలలోనే దానిని నాశనం చేశారని ఆరోపించారు. కశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని, మహిళలను బ్యాంకులకు వచ్చేలా చేశామని, కశ్మీర్‌లో శాంతి, సామరస్యం నెలకొనాలనే ఇవన్నీ చేశామని చెప్పారు.



 శాంతియుత కశ్మీర్‌లో పాకిస్తాన్‌కు అవకాశం లేకుండా చేశామన్నారు. అయితే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల కశ్మీర్‌లో పాక్‌కు అవకాశం చిక్కుతోందని తెలిపారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలపైనా రాహుల్‌ విరుచుకుపడ్డారు. పాకిస్తాన్, చైనా మినహా పొరుగు దేశాలన్నీ మనకు అనుకూలంగా ఉండేవని, కానీ ఇప్పుడు ఒక్కో పొరుగుదేశాన్నీ మోదీ దూరం చేస్తున్నారని విమర్శించారు. చరిత్రలో తొలిసారిగా రష్యా.. పాకిస్తాన్‌కు ఆయుధాలను అమ్ముతోందని, దీనికి కారణం మోదీ విధానాలేనని ఆరోపించారు.





ఇందిర క్యాంటీన్లకు శ్రీకారం..

పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఇందిర క్యాంటీన్లను రాహుల్‌ బుధవారం బెంగళూరులో ప్రారంభించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలసి అక్కడే భోజనం కూడా చేశారు. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందిస్తున్న కర్ణాటక ప్రభుత్వాన్ని అభినందించిన రాహుల్‌.. ఈ పథకం వల్ల బెంగళూరులో ఒక్కరు కూడా ఆకలితో అలమటించరని పేర్కొన్నారు. ప్రసంగం సందర్భంగా ఇందిర క్యాంటీన్లకు బదులు.. అమ్మ క్యాంటీన్లు అని తడబడిన రాహుల్‌.. వెంటనే సర్దుకుని ఇందిర క్యాంటీన్లు అని సరిచేసుకున్నారు.



ఇందిర క్యాంటీన్‌ ద్వారా రూ.5కు ఫలహారం, రూ.10కే లంచ్‌ లేదా డిన్నర్‌ను అందించనున్నారు. తొలుత నమ్మ క్యాంటీన్లుగా నామకరణం చేయాలని భావించినా.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీటికి ఇందిరా క్యాంటీన్లని పేరుపెట్టారు. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికలోని 198 వార్డుల్లో వంద కోట్లతో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతగా బుధవారం 101 క్యాంటీన్లను ప్రారంభిం చారు. మరో 97 క్యాంటీన్లను అక్టోబర్‌ 2న ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్లను మిగతా నగరాలకూ విస్తరిస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top