'ఆ మంత్రిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించండి'


న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి నిహాల్ చంద్ మేఘవాల్ పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని రాజస్థాన్ కు చెందిన మహిళ డిమాండ్ చేసింది. గతంలో మంత్రితో సహా ఏడుగురు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు నమోదైన కేసును పోలీసులు పక్కదోవ పట్టించారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత మూడు సంవత్సరాల క్రితం తనపై అత్యాచారం పాల్పడిన ఘటనలో తన భర్త వారికి సహకరించాడని ఆమె తెలిపింది.  దీనిపై పోలీసులు చార్జీషీటు నమోదు చేసి.. నామమాత్రంగా ముగించారని ఆ మహిళ పేర్కొంది.


 


రాజస్థాన్ లోని శ్రీనగర్ జిల్లాలో ఉంటున్న ఆమె ఈ రోజు మీడియాకు ముందుకు వచ్చింది.' నేను ప్రభుత్వాన్ని ఒక్కటే అభ్యర్థిస్తున్నాను. ఈ కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి. అందుకు సీబీఐ దర్యాప్తును ఆదేశించండి. ఈ కేసులో విచారణను పోలీసులు ముగింపు పలికారు.  అందుకు ప్రస్తుతం మంత్రి మేఘవాలానే కారణం కావచ్చు ' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  'నేను శాంతియుతంగా బ్రతకాలనుకుంటున్నాను. ఈ ప్రభుత్వం నాకు  తొందర్లోనే న్యాయం చేస్తుందని భావిస్తున్నాను' అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.  తనకు న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాప్తు ఒక్కటే మార్గమని ఆమె తెలిపింది.


 


దీనిపై జాతీయ మహిళా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అన్నె రాజా మండిపడ్డారు. ఆ మహిళ 2011 లో తన భర్తపై, మంత్రిపై ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ కేసులో ఆధారాలు లేవంటూ 2012 లో  దర్యాప్తును ముగించడం ఎంతవరకూ సమంజసమని విమర్శించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top