బీజేపీది చంద్రబాబు ఎజెండా

బీజేపీది చంద్రబాబు ఎజెండా - Sakshi


* కిషన్‌రెడ్డి ఏపీ నాయకత్వం చేతిలో కీలుబొమ్మ  

* మంత్రి హరీశ్‌రావు చురకలు


 

- కాంగ్రెస్‌కు ముంచుడు మాత్రమే తెలుసు

- తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేయమని సీపీఐ లేఖ రాయలేదా ?

- కాళేశ్వరం కడతామంటే తుమ్మిడిహెట్టిని రద్దు చేసినట్లు కాదు

- దేవాదుల రీ డిజైనింగ్ అంటే కంతనపల్లిని పక్కన పెట్టినట్లు కాదు

- ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కానివ్వం

- ఏ ప్రాజెక్టునూ రద్దు చేయలేదని వెల్లడి

సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఎజెండాను అమలు చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఆయన ఏపీ నాయకత్వం చేతిలో కీలుబొమ్మగా మారి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని, ఇదంతా చంద్రబాబు రహస్య ఎజెండానే అని ధ్వజమెత్తారు. హరీశ్‌రావు గురువారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అప్పుడు సమైక్య రాష్ట్రానికి సీఎంగా ద్రోహం చేసినప్పుడూ, ఇప్పుడు వేరుపడిన ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉండి ఆ ద్రోహాన్నే కొనసాగిస్తున్నప్పుడూ ఆయనకు మిత్రపక్షంగా ఉండి సహకరిస్తోంది బీజేపీనే అని మండిపడ్డారు.



పోలవరం కోసం ఆర్డినెన్స్ తెచ్చిన బీజేపీ తెలంగాణ పక్షం ఎలా వహిస్తుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా నగరానికి తాగునీరిస్తామంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారని, దీనికి కిషన్‌రెడ్డి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీల నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేశారని గోల పెడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, 2008లోనే సీపీఐ శాసనసభా పక్ష నేతగా ఈ రిజర్వాయరును రద్దు చేయాలని లేఖ రాసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. తోటపల్లికి బదులుగా సింగరాయ ప్రాజెక్టు చేపట్టాలని చాడ ప్రత్యామ్నాయం కూడా సూచించారంటూ ఆ లేఖ ప్రతులను చూపించారు. ఈ ప్రాంత రైతులు సైతం అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు తోటపల్లి వద్దంటూ లేఖ రాశారని వివరించారు.

 

కాంగ్రెస్ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు

తోటపల్లిని నిర్మించాల్సిందే అంటున్న కాంగ్రెస్ హయాంలోనే 2007లో ఉత్తర్వులు వచ్చాయని, 2014 దాకా ఆ పార్టీ అధికారంలో ఉన్నా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని దుయ్యబట్టారు. ముంపు సమస్య లేకుండా, ప్రజా ధనం వృధాకాకుండా తాము మోయతుమ్మెద, ఎల్లమ్మగడ్డ వాగులపై అక్విడక్టులు నిర్మించి నిర్దేశిత ఆయకట్టు కన్నా ఎక్కువ విస్తీర్ణానికి సాగు నీరు ఇస్తామంటే కాంగ్రెస్‌కు రుచించడం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కాంగ్రెస్‌కు ప్రజలను ముంచడమే తెలుసని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పనిచేస్తామని చెప్పారు.



కాళేశ్వరం కడతామంటే తుమ్మిడిహెట్టిని రద్దు చేసినట్లు కాదని, దేవాదుల రీ డిజైనింగ్ అంటే కంతనపల్లిని పక్కన పెట్టినట్లు కాదని స్పష్టంచేశారు. ఏ ప్రాజెక్టునూ రద్దు చేయలేదని, విపక్షాలు గందరగోళానికి గురై, ప్రజలను గందరగోళ పరచొద్దని హితవు పలికారు. విపక్ష నాయకులకు అన్ని విషయాలు తెలిసీ ఆందోళనలు చేస్తున్నారని, మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.850కోట్లు బడ్జెట్‌లో కేటాయించిన విషయం కిషన్‌రెడ్డికి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు.



బాసర నుంచి భద్రాచలం వరకు, మహబూబ్‌నగర్ నుంచి నల్లగొండ వరకు గోదావరి, కృష్ణా నదులను సర్వే చేస్తామని 1,280 టీఎంసీల తెలంగాణ వాటాను ఎలా సద్వినియోగం చేయాలో చూపుతామని హరీశ్ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top