ఆయన గుర్తుగా....

ఆయన గుర్తుగా.... - Sakshi


సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం:


మొదటిసారి ప్రత్యక్షంగా చూసింది గాంధీ భవన్లో.. ఎం.సత్యనారాయణరావు నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భం.. మడత నలగని ప్రత్యేకమైన పంచకట్టు.. తెల్లచొక్కా.. గంభీరమైన ఆహార్యం.. ట్రేడ్ మార్క్ నవ్వు.. అప్పటివరకు వైఎస్ఆర్ అంటే ఉన్న అభిప్రాయం ఎందుకో తెలియదు.. తొలగిపోయింది. కమ్యూనికేట్ చేయొచ్చు అనిపించే చనువు కనిపించింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఉద్యోగరీత్యా ఇంటర్వ్యూలు, మాటలు, చర్చలు.. వీడేంటి బచ్చా జర్నలిస్టు.. వీడితో ఏంటి మాటలు అనే ధోరణి ఎప్పుడూ కనిపించలేదు. నీట్గా కనిపించకపోతే మాత్రం ఏంటయ్యా ఆ గడ్డం.. అంటూ చిరు కోపం, రెండు చేతులూ విచిత్రంగా తాటించి 'వాట్ సార్' అనే పలకరింపు చాలా జ్ఞాపకం.



1999 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. ఫలితాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ నాయకులందరూ మాయం. రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్లోని వైఎస్ఆర్ ఇంట్లో సాయంత్రం కొంతమంది జర్నలిస్టులం కలిశాం. ఒపినీయన్ తీసుకోవాలి కదా! అదే చెరగని చిరునవ్వు. ప్రజల తీర్పును అంగీకరిస్తాం. మళ్లీ పోరాడతాం అంటూ మొదలు పెట్టి ఓటమి కారణాలను సునిశితంగా విశ్లేషించారు.



ఆ తర్వాత అసెంబ్లీలో ఐదు సంవత్సరాలపాటు అలుపెరగని పోరాటం. అసెంబ్లీ సమావేశాలకు టీఆర్పీ రేటింగ్స్ గణనీయంగా పెరిగింది ఆ ఐదు సంవత్సరాల్లోనే. వామపక్ష తీవ్రవాద సానుభూతిపరుల నుంచి రైట్ వింగ్ నాయకుల వరకు అభిమానుల్ని సంపాదించుకుంది ఆ ఐదు సంవత్సరాల్లోనే. ఆ ఐదు సంవత్సరాల్లో ప్రతి శాసన సభ సమావేశాన్ని కవర్ చేశాను. పోరాట పటిమ, వాక్చాతుర్యం, సూటిగా మాట్లాడేతత్వం, మడమ తిప్పని పోరాట పటిమ.. దగ్గరగా చూసే అవకాశం లభించింది.



ఇక్కడొక విషయం చెప్పకపోతే అన్యాయం అవుతుంది. ఆగస్టు 2000 వర్షాకాల సమావేశాలు. చంద్రబాబు ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచేసింది. రాష్ట్రమంతా రైతుల ఆందోళన. మొండిగా వ్యవహరించిన చంద్రబాబు ప్రభుత్వం సభలో ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు తరలించింది. వైఎస్ఆర్ నేరుగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి చేరుకొని తన శాసనసభ్యులతో నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. రోజుకు కొంతమంది ఎమ్మెల్యేలు అనారోగ్యంతో విరమిస్తున్నా పట్టుదల వదల్లేదు. ఒక రోజు భారీ వర్షం. హైదరాబాద్ అతలాకుతలం. మూసీ పొంగింది. హుస్సేన్ సాగర్ పొంగి పొర్లింది. హైదరాబాద్ వరదల్ని చూసింది. నిరాహార దీక్ష మాత్రం కొనసాగింది. ఆ తర్వాత బషీర్ బాగ్లో ప్రభుత్వ దమన నీతి కాల్పులు.. ప్రభుత్వం కనువిప్పు అసాధ్యం.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని నిరాహార దీక్ష విరమించి భవిష్యత్తు ప్రణాళిలు..



అలా మొదలైందే ప్రజాప్రస్థానం..ఆ గొప్ప ఈవెంట్ కవర్ చేయలేకపోయినందుకు ఇప్పటికీ వెలితిగానే ఉంది. అప్పటికే తిరుపతి బదిలీ అయింది. పాదయాత్ర వైఎస్ఆర్లో మరింత పరిణితిని తీసుకొచ్చింది. సమస్యలను అర్ధం చేసుకునే తీరు సమస్యలపట్ల స్పందించే పద్ధతిలో పూర్తి మార్పు..పాదయాత్ర ముగిసిన తర్వాత నేరుగా తిరుపతి పయనం. ప్రెస్ కాన్ఫరెన్స్.. మలివిడత పాదయాత్ర ఎప్పుడు.. ఎక్కడో వెనుక కూర్చున్న నా నుంచి ప్రశ్న.. పేరు పెట్టి పిలిచి .. ఇక్కడున్నావా.. అప్పుడే కాదులే 'లెట్ మీ రికవర్'..



చంద్రబాబు ప్రభుత్వం చేసిన పొరపాట్లకి తోడు వైఎస్ఆర్ అంటే ప్రజల్లో ఉన్న ఒక అభిప్రాయం పోయి 'ప్రో..పూర్' ఇమేజ్కి కారణమైన పాదయాత్ర ఆయన్ని 2004 ఎన్నికల్లో తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది.  ముఖ్యమంత్రిగా ఎన్నికైన రెండు నెలల తర్వాత తిరుపతి నుంచి వచ్చి కలవడానికి 'లేక్ వ్యూ గెస్ట్హౌస్'కి వెళ్లాను. ముఖ్యమంత్రిగారు కదా. అప్పటికే వలయాలు ఏర్పడ్డాయి. సహజంగానే పదవి ఉన్నచోట మూగే నాయకులకు, వ్యక్తులకు కొదవ ఉండదు.. ఏదో దూరం అనిపించింది. పీఏల దగ్గరకు వెళ్లడమే గగనమైంది. విసుగు, చిరాకు కోపం.. ఇంతలో హడావుడి.. బయటకు వస్తూ .. ఒక్క క్షణం ఆగి దగ్గరికి పిలిచి తిరుపతిలో ఇంకెంత కాలం ఉంటావు.. వచ్చేయి.. నా ప్రభుత్వం తప్పుల్ని నీ వార్తల్లో ఎత్తి చూపాలి కదా  మళ్లీ కలువు పర్సనల్గా..



ఎందుకో వ్యక్తిగతంగా కలవాలని అనిపించలేదు. కలిసే ప్రయత్నం చేయలేదు. కనీసం మూడు సందర్భాల్లో ప్రభుత్వ తీరును ఎండగడుతూ కథనాలు కూడా రాశాను నేనప్పుడు పని చేస్తున్న జాతీయ ఆంగ్ల దినపత్రికలో. ఎప్పుడు కూడా ఇలా ఎందుకు రాశావు అనే ప్రశ్న ఆయన దగ్గర నుంచి రాలేదు. ఒక మిత్రుడి కుమారుడికి ప్రాణాంతకమైన జబ్బు ... కలిసి సహాయం కోసం రిక్వెస్ట్ చేస్తే లక్షల్లో సీఎంఆర్ఎఫ్ నుంచి రిలీజ్ చేశారు. ఇలా రాసుకుంటూ వెళితే ఎన్నో సంఘటనలు.



భారతదేశ రాజకీయ చిత్రపటంపై తనదైన ముద్రవేసిన పెద్దాయన సెప్టెంబర్ 2, 2009న పావురాల గుట్టలో కలిసిపోయారు. ప్రమాదమా.. విద్రోహమా.. ఇంకా అస్పష్టతే.. జవాబు లేని ప్రశ్నలెన్నో.. బహుశా జవాబురాని ప్రశ్నలేమో.. పక్కా వామపక్ష భావజాలమున్న మా ఇంట్లో ఆ భావజాలం లేని మెయిన్ స్ట్రీమ్ పొలిటిషియన్ వైఎస్ఆర్కి ప్రత్యేక స్థానం. అప్పుడప్పుడు చర్చల్లో చోటు.. అసెంబ్లీ సమావేశాలు లైవ్ చూస్తున్నప్పుడు ఆయన లేని లోటు.. బొమ్మా బొరుసు, మంచి చెడూ.. ఎవరూ అతీతం కాదు. తను పోతే తనతోపాటు చాలామంది వెళ్లిపోయారు. ఎంతమంది తనకోసం కన్నీరు పెట్టారనేది ప్రధానం. ఎన్నిగుండెలు ఇంకా బాధపడుతున్నాయనేది ముఖ్యం. మనిషిపోగానే ముఖాలకు వేరే రంగు పులుముకున్న వ్యక్తుల ప్రస్తావన అవసరం లేదు. వారు చరిత్ర హీనులే. చరిత్రలో నాలుగు పేజీల స్థానం సంపాదించుకున్న వారు అరుదు. అందుకే వైఎస్ఆర్  వైఎస్సారే..





కొసరు: పావురాల గుట్టల్లో చెల్లాచెదురుగా పడిఉన్న హెలికాప్టర్ శకలాల్లోంచి రెండు మూడు గాజు పెంకులు, ఫైబర్ బ్లేడ్ ముక్కలు, కొన్ని కాగితాలు, మరికొన్ని వస్తువులు అమూల్యంగా ఏరుకొన్నవి....ఇంకా నా బీరువాలో పదిలంగా....ఆయన గుర్తుగా...



ఎస్.గోపినాథ్రెడ్డి

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top