మెమన్ ఉరిపై ఉత్కంఠ

మెమన్ ఉరిపై ఉత్కంఠ


నేడు విచారించనున్న సుప్రీం త్రిసభ్య ధర్మాసనం

స్టే అభ్యర్థనపై విభేదించిన ఇద్దరు న్యాయమూర్తులు


 

న్యూఢిల్లీ: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు విధించిన ఉరి శిక్ష అమలుపై ఉత్కంఠ నెలకొంది. ఉరిశిక్షను రేపు(జూలై 30) అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. మరణశిక్ష అమలుపై స్టే విధించాలంటూ మెమన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం ఒక త్రిసభ్య ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు ఏర్పాటు చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ఆ ధర్మాసనం నేడు(బుధవారం) మెమన్ భవితవ్యాన్ని తేల్చనుంది. అంతకుముందు, మెమన్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన ద్విసభ్య బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఉరిశిక్ష అమలుపై స్టే ఇచ్చే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.



తుది నిర్ణయం కోసం విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, బుధవారమే విచారణకు అవకాశం కల్పించాల్సిందిగా చీఫ జస్టిస్‌ను కోరారు.

 ద్విసభ్య బెంచ్ విచారణ సందర్భంగా మెమన్ స్టే పిటిషన్‌ను జస్టిస్ దవే నిర్ద్వంద్వంగా తోసిపుచ్చగా, జస్టిస్ కురియన్ స్టేపై సానుకూలత వ్యక్తం చేశారు. దాంతో వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించడమే సరైనదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, మెమన్ తరఫు న్యాయవాది రాజు రామచంద్రన్ బెంచ్‌కు సూచించారు. మెమన్ తన పిటిషన్‌లో పేర్కొననప్పటికీ.. మెమన్ గతంలో దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టేయడంలో లోపాలున్నాయని జస్టిస్ కురియన్ అభిప్రాయపడ్డారు. రివ్యూ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనంలో తనతో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ దవే సభ్యులని, అందువల్ల క్యూరేటివ్ పిటిషన్‌ను విచారించిన బెంచ్‌లో తామూ  ఉండాలనేది నిబంధన అన్నారు.  కానీ క్యూరేటివ్ పిటిషన్‌ను విచారించిన బెంచ్‌లో తమ ముగ్గురిలో ఒక్క దవేనే ఉన్నందున అది నిబంధనల ఉల్లంఘనే కాక, జీవించే హక్కును కాలరాయడమూ అవుతుందన్నారు. లోపాలను సరిచేసి, మళ్లీ పిటిషన్‌ను విచారించాలన్నారు. ఉరి అమలుపై స్టే విధించడం అవసరమేనన్నారు. 



శిక్ష అమలుపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేయాలన్న మెమన్ లాయర్ అభ్యర్థనను జస్టిస్ కురియన్ తోసిపుచ్చారు. అయితే  జస్టిస్ దవే.. పిటిషన్ కొట్టివేత నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. మెమన్ గత  రివ్యూ పిటిషన్‌ను, క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసి, ఉరిని నిర్ధారించిన విషయాన్ని.. రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ క్షమాభిక్షను తిరస్కరించిన అంశాన్ని గుర్తు చేశారు. అయితే, మెమన్ మరోసారి దాఖలు చేసుకున్న క్షమాభిక్ష అభ్యర్థనపై మహారాష్ట్ర గవర్నర్ ఉరిశిక్ష అమలు జరిగేలోపు నిర్ణయం తీసుకోవచ్చన్నారు.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top