మాయా రాజీనామా.. భారీ వ్యూహం!

మాయా రాజీనామా.. భారీ వ్యూహం! - Sakshi


బీఎస్పీ అధినేత్రి మాయావతి అనూహ్యంగా తన రాజ్యసభ స్వభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక భారీ రాజకీయ వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో వరుస ఎదురుదెబ్బలతో కాస్తా వెనుకబడినట్టు కనిపించిన ఆమె.. మళ్లీ రాజకీయంగా తన సత్తా ఏమిటో చాటాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఉన్నట్టుండి మాయావతి ఈ ఉగ్రరూపం దాల్చారని లక్నో రాజకీయ వర్గాలు అంటున్నాయి. అలహాబాద్‌కు సమీపంలోని ఫూల్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆమె పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కేశవప్రసాద్‌ మౌర్య రాజీనామా చేస్తే ఈ స్థానంలో ఉప ఎన్నికలు రానున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్‌, డిప్యూటీ సీఎం మౌర్య తమ లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేయాల్సి ఉంది. కానీ రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారు ఆగిపోయారు. ఆరు నెలల్లో ఈ ఇద్దరూ ఎంపీ స్థానాలకు రాజీనామా చేసి.. ఎమ్మెల్యేగా గెలుపొందడం లేదా ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టడం చేయాల్సి ఉంటుంది.



మంగళవారం రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసిన అనంతరం ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమంటూ మాయావతి సంకేతాలు ఇచ్చారు. 'నేను నాలుగుసార్లు సీఎంగా ఉన్నాను. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందాను. ఎమ్మెల్యె ఎన్నికల్లో సైతం గెలుపొందాను. అవసరమైనప్పుడే రాజ్యసభకు వచ్చాను' అని ఆమె వివరించారు. నిజానికి ఇటీవల మాయావతి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నది లేదు. 2007లో బీఎస్పీకి సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ ఆమె మండలి సభ్యురాలిగా సీఎం పదవిలో కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2012లో రాజ్యసభకు వచ్చారు.



కానీ, ఇప్పుడు మాయావతి ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయిస్తే అది పెద్ద రాజకీయ నిర్ణయమే అవుతుంది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థిగా ఆమె పోటీచేసే అవకాశముంది. ఇదే జరిగితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో మహాకూటమికి బీజం పడుతుంది. దేశవ్యాప్తంగా కూడా బీజేపీయేతర ప్రతిపక్షాల ఐక్యతకు ఇది దారితీయొచ్చు. ఇక ఫూల్‌పూర్‌ నియోజకవర్గానికి కూడా రాజకీయంగా ప్రాధాన్యముంది. ఇక్కడి నుంచే దేశ ప్రథమ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ సహా అనేకమంది ప్రముఖ నేతలు పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఈ నియోజకవర్గంలో విజయమంటే జాతీయంగా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ దళిత, మైనారిటీ, వెనుకబడిన తరగతుల ఓటర్లు అధికం. కాబట్టి ఇక్కడి నుంచే బీఎస్పీ పునర్‌వైభవానికి మాయావతి పునాది వేయాలని భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top