మ్యాట్రిమోసాల ముఠా అరెస్టు

మ్యాట్రిమోసాల ముఠా అరెస్టు - Sakshi

  •      నగర సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి కుచ్చుటోపీ పెట్టిన నైజీరియన్లు

  •      ఢిల్లీలోని మెహ్రౌలిలో సైబరాబాద్ పోలీసుల దాడులు

  •      17 మంది పట్టివేత, నలుగురికి కేసుతో సంబంధముందని నిర్ధారణ

  •      ఇతరుల పాత్రపై ఆరా తీస్తున్న సైబర్ పోలీసులు

  •      10.6 కిలోల సూడో ఎఫిడ్రిన్‌స్వాధీనం

  •  సాక్షి, హైదరాబాద్: భారత్ మ్యాట్రిమోనీ, షాదీ.కాం వంటి వివాహ సంబంధ వెబ్‌సైట్ లను కేంద్రాలుగా చేసుకొని పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్న నైజీరియా ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. మెహ్రౌలీలోనే ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని అక్కడి నుంచి వీరు ఈ కార్యకలాపాలు సాగిస్తున్నారన్న సమాచారంతో అక్కడికెళ్లి గురువారం దాడులు చేశారు. మొత్తం 17మంది సభ్యులను పట్టుకోగా, వీరిలో నలుగురికి పెళ్లిళ్ల పేర మోసం కేసుతో సంబంధమున్నట్టు పోలీసులు నిర్ధారించారు. మరో ఏడుగురికి కూడా ఇందులో పాత్ర ఉందని అనుమానిస్తున్న పోలీసులు, వారి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, డాటాకార్డుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. అది నిర్ధారణ అయితే వారిని కూడా స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకురానున్నారు.



     లండన్‌లో డాక్టర్‌గా  పరిచయం చేసుకొని...

     విద్య, వ్యాపారం వీసాతో రెండేళ్ల క్రితం ఢిల్లీకి వచ్చిన జాన్‌డెస్టిన్ కొద్ది రోజుల పాటు చిన్నచిన్న వ్యాపారాలు చేశాడు. నష్టాలు రావడంతో పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. మరికొంత మందితో కలసి బృందంగా ఏర్పడ్డారు. వీరందరూ లండన్, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన వైద్యులు, పారిశ్రామికవేత్తల పేర అందమైన యువకుల ఫొటోలతో భారత్ మ్యాట్రిమోనీ, షాదీడాట్‌కాం వంటి వెబ్‌సైట్లలో వివరాలు ఉంచేవారు. స్పందించిన వారితో మాట్లాడి ఖరీదైన బహుమతుల పేరుతో నమ్మించేందుకు.. కొంత మంది యువకులను ఉద్యోగులుగా నియమించుకున్నారు. ఆ బహుమతులను విడిపించుకునేందుకు వివిధ పన్నుల రూపేణా డబ్బు కట్టాలంటూ చెప్పి రూ.లక్షల్లో దోచుకునేవారు. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో తమ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించుకునేందుకు, ఖాతాలు తెరిపించేందుకు స్థానికుల సహాయం తీసుకునేవారు.



    బాధితులు ఆ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేయగానే వీరు తమ కమిషన్‌ను మినహాయించుకుని మిగిలిన మొత్తం నైజీరియన్లకు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే హైటెక్‌సిటీలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నుంచి రూ.25 లక్షలను నెలరోజుల వ్యవధిలో స్వాహా చేశారు.  తాను లండన్ దేశస్థుణ్ణి అని, అక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్నానని ఒకరు ఇగ్సటుటే అనే పేరుతో పరిచయం చేసుకున్నాడు. ఇతడి పరిచయం అయ్యాక మరో ఇద్దరు నైజీరియన్లు రంగంలోకి దిగారు. నెలరోజుల పాటు మహిళను నమ్మించి డబ్బు వివిధ ఖాతాల్లో వేయించారు. పని పూర్తికాగానే సెల్‌ఫోన్లలోని సిమ్‌కార్డులను తీసేశారు. ఇప్పటివరకు ఈ ముఠా దక్షిణాది రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మహిళలు, యువతులను మోసం చేసిందని సైబర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ తెలిపారు. వీరి డేటా కార్డుల్లో వందలాది మంది మహిళల ఫొటోలు ఉన్నాయని, వీరందరితో మాట్లాడాక ఎంత మందిని మోసం చేశారన్నది తెలుస్తుందని అన్నారు. వీరిని పట్టుకునేందుకు దాదాపు వారం పాటు ఢిల్లీలో నిఘా వేశామన్నారు.



     దక్షిణాఫ్రికా వయా  ముంబై టూ ఢిల్లీ టూ హైదరాబాద్

     పెళ్లిళ్ల నయా వంచన ముఠాను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులకు ఈ అపార్ట్‌మెంట్‌లోనే 10.6 కిలోల సూడో ఎఫిడ్రిన్ దొరకడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి, అక్కడి నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు తెప్పించామని నిందితుడు జాన్ దాబ్రీ ఒప్పుకున్నాడు. పట్టుబడిన సూడో ఎఫిడ్రిన్ విలువ సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మరో ఐదుగురి విషయంలో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు.

     

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top