మన్మోహన్‌ సింగ్‌ విమానం ల్యాండవుతుండగా..!

మన్మోహన్‌ సింగ్‌ విమానం ల్యాండవుతుండగా..! - Sakshi


న్యూఢిల్లీ: అది 2007 నవంబర్‌ 11.. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ రష్యాలో అధికారిక పర్యటన కోసం ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. ప్రధాని ప్రయాణిస్తున్న ఈ వీవీఐపీ విమానం సరిగ్గా మాస్కో విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయానికి సాంకేతికలోపం తలెత్తింది. బోయింగ్ 747 విమానం ల్యాండింగ్ గేర్ సరిగ్గా పనిచేయలేదు. మాస్కో ఏటీసీ సిబ్బంది వెంటనే విమాన పైలట్లకు సమాచారమిచ్చారు. కాక్‌పిట్‌లో వార్నింగ్‌ లైట్స్‌ వెలిగాయి. అందరిలో ఉత్కంఠ రేపిన ఈ ఘటనకు సంబంధించిన ఫ్లయింట్‌ డాటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్)ను తాజాగా ఓ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది.



మాస్కో విమానాశ్రయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రయాణిస్తున్న విమానం దాదాపు క్రాష్‌ అయ్యే పరిస్థితి తలెత్తింది. చివరినిమిషంలో సరైన చర్యలు (కరెక్టివ్ యాక్షన్స్) తీసుకోవడం వల్ల ఈ ముప్పు తప్పింది. విమానం ల్యాండింగ్ కావడానికి అవసరమైన లోయర్ గేర్.. ‘ఎలక్ట్రానిక్ గ్లైడ్ స్లోప్‌’కు కొంత ఎత్తులో ఉన్నంతవరకు పనిచేయలేదు. రన్‌వేపై విమానం ల్యాండవుతున్నప్పుడు వాటి టైర్లు సున్నితంగా నేలను తాకేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ గ్లైడ్ స్లోప్ ఉంటుంది.



చివరినిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ వీవీఐపీ విమాన ల్యాండింగ్ ఘటనలో భద్రతా నిబంధనలను ఏమైనా ఉల్లంఘించారా? అనే అంశంపై సదరు జాతీయ పత్రిక ఆరాతీయగా.. విమానం దిగుతున్నప్పుడు రన్‌వేకు తక్కువ ఎత్తులో ఉన్నంతవరకు కరెక్టివ్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చునని, అందువల్లే ఏటీసీ హెచ్చరికలు జారీచేయడం, కాక్‌పిట్‌లో ప్రమాదఘంటికలు మోగించడం వంటివి జరిగి ఉండవచ్చునని ఓ సీనియర్ పైలట్ తెలిపారు. పైలట్లు లోయర్ గేర్‌ను ఆలస్యంగా వినియోగించడం కూడా ఈ ఘటనకు కారణమై ఉండొచ్చునని చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top