ఆపిల్ కంపెనీపై వెయ్యి కోట్ల డాలర్ల దావా!

ఆపిల్ కంపెనీపై వెయ్యి కోట్ల డాలర్ల దావా! - Sakshi


కాలిఫోర్నియా: ఐఫోన్లు, ఐప్యాడ్లు ఉత్పత్తుల్లో అసమాన లాభాలు గడిస్తూ ఎలక్ట్రానిక్ రంగంలో ప్రపంచ మేటి సంస్థగా దూసుకుపోతున్న ఆపిల్ కంపెనీ కూడా టెక్నాలజీ చౌర్యానికి పాల్పడిందట. తాను 1992లోనే రూపొందించిన ‘ఎలక్ట్రానిక్ రీడింగ్ డివైస్ (ఈఆర్‌డీ)’ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొల్లగొట్టి ఆపిల్ కంపెనీ ఐఫోన్లు, ఐపాడ్లు, ఐప్యాడ్లు రూపొందించిందని ఆరోపిస్తూ ఫ్లోరిడాకు చెందిన  థామస్ రాస్ అనే వ్యక్తి కంపెనీపై వెయ్యి కోట్ల డాలర్లకు దావా వేశారట. ఈ కేసులో కనుక థామస్ రాస్ నిజంగా గెలిస్తే వెయ్యి కోట్ల డాలర్లతోపాటు ఏడాదికి 350 కోట్ల డాలర్లను ఆపిల్ కంపెనీ చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.



నవలలు, వ్యాసాలు చదువుకోవడానికి, వీడియోలు చూడడానికి, ఫొటోలు బ్రౌజ్ చేయడానికి థామస్ రాస్ ఎలక్ట్రానిక్ రీడింగ్ డివైస్‌కు రూపకల్పన చేశారట. తన డివైస్‌ను ఫోన్‌లాగాగానీ, ఇంటర్నెట్ మోడమ్ ద్వారా కమ్యూనికేషన్ల కోసం కూడా ఉపయోగించవచ్చని థామస్ ఆనాడే అభిప్రాయపడ్డారట. ఆయన తన డిజైన్ పేటెంట్ కోసం 1992లో అమెరికా పేటెంట్, ట్రేడ్ మార్క్ కార్యాలయానికి దరఖాస్తు కూడా చేసుకున్నారట. అప్పటికి ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ తొలి మోడల్ కూడా విడుదల కాలేదు. పేటెంట్‌కు నిర్దేశించిన ఫీజును థామస్ చెల్లించకపోవడంతో 1995లో అమెరికా పేటెంట్ కార్యాలయం ఆయన దరఖాస్తును తిరస్కరించిందట.



ఆపిల్ కంపెనీపై థామస్ రాస్ వెయ్యి కోట్ల డాలర్లకు దావా వేసిన విషయాన్ని ‘మ్యాక్ రూమర్స్ డాట్ కామ్’ తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది. 2000 సంవత్సరం, ఫిబ్రవరి నెలలో వర్జీనియాలో ఏర్పాటైన ఈ వెబ్‌సైట్ ఎక్కువగా ఆపిల్ ఉత్పత్తులకు సంబంధించిన వార్తలను ఇస్తుంది. వాటితోపాటు వాటికి సంబంధించిన ఉహాగానాలను, వదంతులను కూడా ఇస్తుంది. ఇప్పుడు థామస్ దావా వేసిన విషయం నిజమైన వార్తేనంటూ ఆయన రూపొందించిన డ్రాయింగ్ ప్రతిని చూపుతోంది.


‘గొప్ప ఆలోచనలను దొంగలించడానికి మేము ఎప్పుడూ సిగ్గుపడం’ అని ఆపిల్ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ ఏదో సందర్భంగా చేసిన వ్యాఖ్యలను థామస్ తన దావాలో ఉదహరించినట్లుగా ‘మ్యాక్ రూమర్స్’ పేర్కొంది. ఈ విషయంలో థామస్‌కు జరిగిన అన్యాయాన్ని డబ్బుతో కొలవలేమని, అయితే ఆయన డిమాండ్ చేసినట్లుగా వెయ్యి కోట్ల డాలర్ల నష్టపరిహారంతోపాటు ప్రతి ఏటా లాభాల్లో 1.5 శాతాన్ని రాయల్టీగా చెల్లిస్తే న్యాయం చేసినట్లవుతుందని మ్యాక్ రూమర్స్ వ్యాఖ్యానించింది. తన మోడళ్లను కాపీ కొట్టిందంటూ అందుకు భారీ పరిహారాన్ని డిమాండ్ చేస్తూ పోటీ సంస్థ శ్యామ్‌సంగ్‌పై ఆపిల్ కేసు నడుస్తున్న నేపథ్యంలోనే ఆపిల్ కంపెనీపై కూడా ఇలాంటి ఆరోపణలు రావడం గమనార్హం.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top