సినిమాను తలపించే క్రైమ్ స్టోరీ

సినిమాను తలపించే క్రైమ్ స్టోరీ


బిజ్నూరు: సినిమా కథను తలపించే ఘటన ఉ‍త్తరప్రదేశ్‌లో జరిగింది. సోదరుడు చేసిన నేరానికి పోలీసుల నిర్వాకం వల్ల ఓ వ్యక్తి పదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. చివరకు నేరం చేసిన నిందితుడు, జైల్లో ఉన్న ఖైదీ ఒకటి కాదు వేర్వేరు అని తెలియడంతో విడుదలయ్యాడు. చెయ్యని నేరానికి జైలుశిక్ష అనుభవించడం వల్ల పదేళ్ల యవ్వనం వృథా అయిందని బాధితుడు వాపోయాడు.



2001లో బిజ్నూరు జిల్లా సబుడలా గ్రామానికి చెందిన ధర్మపాల్‌ అనే వ్యక్తిని నలుగురు హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేయగా, పప్పు అనే నిందితుడు దొరకలేదు. పలు విచారణల అనంతరం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో 2006లో పోలీసులు పప్పు సోదరుడు బాలా సింగ్‌ను అరెస్ట్‌ చేశారు. బాలా సింగ్‌ను పప్పుగా కోర్టులో హాజరుపరిచారు. తాను పప్పు కాదని బాలాసింగ్‌ ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. కోర్టు ఆదేశాలకు మేరకు జైలుకు వెళ్లాడు. పప్పు హత్య చేసిన తర్వాత నేపాల్‌కు పారిపోయాడు. అక్కడ హత్యకు గురయ్యాడు. బాలా సింగ్ తరఫు న్యాయవాది పప్పు డెత్‌ సర్టిఫికెట్‌ను సమర్పించినా పోలీసులు పట్టించుకోలేదు. అతనికి న్యాయం జరగడానికి పదేళ్లు పట్టింది. కూలి పనులు చేసుకునే బాలా సింగ్‌ తల్లి రాజకుమారి కొడుకును విడిపించేందుకు సుదీర్ఘకాలం న్యాయపోరాటం చేసింది.



చివరకు కోర్టు ఆదేశాల మేరకు ఇంతకుముందు కేసులో పప్పు నుంచి తీసుకున్న వేలిముద్రలను, బాలా సింగ్‌ వేలిముద్రలను పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు  పంపారు. పరీక్షల్లో ఇద్దరూ ఒకటి కాదని, వేర్వేరు వ్యక్తులని తేలింది. బాలా సింగ్‌.. పప్పు కాదని రుజువుకావడంతో శుక్రవారం అతన్ని జైలు నుంచి విడుదల చేశారు. నేరం చేసింది పప్పు అయితే అతని సోదరుడు బాలా సింగ్‌ను పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేశారు? ఇద్దరి వేలిముద్రలను పదేళ్ల క్రితమే పరీక్షలకు ఎందుకు పంపలేదు? వంటి ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేదు.



పదేళ్లకు తనకు న్యాయం జరిగిందని, అయితే తన జీవితంలో విలువైన యవ్వన కాలాన్ని జైలు గోడల మధ్య వృథా చేసుకున్నానని 43 ఏళ్ల బాలా సింగ్‌ ఆవేదన వ్యక్తి చేశాడు. జైలుకు వెళ్లే సమయంలో యువకుడినని, ఇప్పుడు వయసు మీరిందని, తన కలలన్నీ ఆవిరయ్యాయని వాపోయాడు. తనను అరెస్ట్‌ చేసిన పోలీసు అధికారిని శిక్షించాలని బాలా సింగ్‌ డిమాండ్‌ చేశాడు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top