ఫేస్బుక్ అమ్మ... ఎందుకమ్మా?

ఫేస్బుక్ అమ్మ... ఎందుకమ్మా? - Sakshi


ఫేస్బుక్ మాయలో పడి యువతీ యువకులు మోసపోతున్న ఉదంతాలు మన తెలుసు. అయితే ఓ యువకుడు ఫేస్బుక్ లో కొత్త అమ్మను వెతుక్కుని కన్న తల్లిని వదిలేసిన విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగింది. బరేలీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విజయ్ మౌర్య అనే 20 ఏళ్ల విద్యార్థి- ఫేస్బుక్ మమ్మీ కోసం కన్నవారిని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.



పొద్దస్తమాను ఫేస్బుక్ కు అతుక్కుపోతే అందరి యువకుల్లాగే తన కొడుకు కూడా అన్ని విషయాలు తమ స్నేహితులతో షేర్ చేసుకుంటున్నాడని విజయ్ మౌర్య అనుకున్నారు. అదేపనిగా 'ముఖ పుస్తకం'కు అంటుకుపోవడాన్ని విజయ్ తండ్రి బ్రిజేష్ అప్పట్లో గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. గత నెల విజయ్ కనిపించకుండా పోయాడు. అతడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది.



విజయ్- 'ఫేస్బుక్ మమ్మీ' సుకన్య(పేరు మార్చారు)ని కలుసుకోవడానికి వెళ్లాడని తెలుసుకుని వారంతా అవాక్కయ్యారు. కేరళకు చెందిన ఆమెనే విజయ్ తన తల్లిగా చెప్పుపోవడంతో కన్నవాళ్లు కన్నీరుమున్నీరయ్యారు. త్రివేండ్రంకు చెందిన సుకన్య బహ్రెయిన్ లో నర్సుగా పనిచేస్తుంది. విజయ్ బ్యాంకు ఖాతాలోకి ఆమె రూ. 22 వేలు బదిలీ కూడా చేసింది. అంతేకాదు 'తన ఫేస్బుక్ కొడుకు' ఈనెల 12న ఏకంగా బరేలీకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి సుకన్య, విజయ్ ఇక్కడి నుంచి వెళ్లిపోకుండా ఆపగలిగారు.



ఇక వివాదంపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. విజయ్ కుటుంబానికి బీజేపీ నాయకులు బాసటగా నిలవడం గమనార్హం. దీన్ని 'ప్రణాళికబద్దమైన కుట్ర'గా వర్ణించారు. హిందూ యువకుడిని క్రిస్టియన్ గా మార్చేందుకు ఈ కుట్ర చేశారని కమలనాథులు ఆరోపించారు. అయితే అసలు తల్లిదండ్రులను వదిలేసి ఫేస్బుక్ మమ్మీ కోసం పాకులాడుతున్న విజయ్ గురించి వింతగా చెప్పుకుంటున్నారు. ఈ కథ మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top