ముఖ్యమంత్రిని శపించిన మాంత్రికుడు!

ముఖ్యమంత్రిని శపించిన మాంత్రికుడు!


మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంటివద్ద శపించాడు. కాగా, శపించిన వ్యక్తి రాష్ట్రంలో చేతబడులు ఎక్కువగా చేసే కొల్లెగల ప్రాంతానికి చెందినవాడని సమాచారం. ఇంటి వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఇచ్చిన వస్త్రాన్ని సీఎం సిద్దరామయ్య స్వీకరించకపోవడంతో కోపగించుకున్న అతను కారు డ్రైవర్ పక్కన కిటికీ నుంచి ముఖ్యమంత్రిని శపించారని తెలిసింది. ఈ ఘటనను సీఎం పట్టించుకోకుండా వదిలేశారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వల్ల అసలే సీఎం ప్రతిష్ట దిగాజారుతుండగా, గుర్తుతెలియని వ్యక్తి సీఎంను శపించడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై మాట్లాడిన కార్యకర్తలు అసలే కొంతకాలంగా సీఎంను దురదృష్టం వెంటాడుతోందని, ఈ సమయంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం ఆందోళనకరంగా ఉందని అన్నారు. అందుకే శాపాన్ని వెనక్కు తీసుకోవాలని అతన్ని కోరినట్లు వివరించారు.



ఎలా జరిగింది..?

మైసూరులోని ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఉన్న బారికేడ్లలో నుంచి దూసుకుపోయి, సెక్యూరిటీ నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి అప్పుడే కారులోకి ఎక్కబోతున్న సీఎం సిద్ధరామయ్యను కలిసి పూజచేసిన వస్త్రాన్ని తీసుకోవాలని కోరాడు. అయితే, ఇలాంటి వాటిమీద పెద్దగా నమ్మకం లేని సీఎం అందుకు నిరాకరించడంతో.. అతడు తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని, సాయం చేయాలని కోరాడు. దీనిపై స్పందించిన సీఎం ఇలాంటి వాళ్లు చాలా మంది ఉంటారు, అబద్ధాలతో బతకాలని ప్రయత్నిస్తారని కార్యకర్తలతో అన్నారు. దాంతో కోపంతో రెచ్చిపోయిన అతను పోలీసుల నుంచి తప్పించుకుని కారు డ్రైవర్ కు పక్కగా వెళ్లి కిటికీలో నుంచి సీఎంను శపించాడు.



కొల్లెగలకు మాంత్రికవిద్యలకు సంబంధం ఏంటి?

కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో కొల్లెగల పట్టణం ఉంది. ఈ పట్టణానికి రాజకీయనేతలకు కొన్నేళ్లుగా ప్రత్యేక సంబంధం ఉంది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల్లో ఎక్కువమంది ఈ ప్రాంతానికి మకాం మారుస్తారు. మాంత్రిక విద్యలను సాధన చేసే వారు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండటంతో ఎన్నికల్లో ప్రత్యర్ధులను ఎలాగైనా ఓడించేందుకు వీరి సాయం తీసుకుంటుంటారు. కాగా, కర్ణాటక రాజకీయాల్లో మాత్రం ఈ ఊరి పేరు పెద్దగా వినిపించేది ఎవరైనా రాజకీయ నాయకుడు అనారోగ్యం పాలైనప్పుడే. జేడీ(ఎస్) నేతలు మంత్రగాళ్లతో తమవారిని శపింపజేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు తరచూ ఆరోపించడం ఇందుకు నిదర్శనం. 2011లో అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తనకు మాంత్రిక శక్తుల వల్ల ప్రాణహాని ఉందని వ్యాఖ్యనించడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top