తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను చంపి..

తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను చంపి..

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

- ఆత్మహత్య చేసుకున్న ప్రబుద్ధుడు

తండ్రి ప్రవర్తనతో విసిగి వేసారి ఘాతుకం

రిజర్వాయర్‌లోకి నెట్టివేసిన వైనం

 

సాక్షి, ఖమ్మం/కూసుమంచి: తండ్రి ప్రవర్తనతో విసిగి వేసారిన ఓ కొడుకు తల్లిదండ్రులు, భార్యాబిడ్డలను రిజర్వాయర్‌లో తోసి చంపేసి.. తనూ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో బుధవారం జరిగింది. తండ్రి నిత్యం మద్యం మత్తులో తల్లిని వేధించడం.. తన భార్యను లైంగికంగా వేధించడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కూసుమంచి మండలం జీళ్లచెరువుకు చెందిన పెంటుసాహెబ్‌ బ్యాండ్‌ మేళం వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య మహబూబీ, కొడుకులు షేక్‌ సలీం, లాల్‌ సాహెబ్‌ ఉన్నారు. షేక్‌ సలీం జిల్లా కేంద్రంలోని ఓ విత్తనాల కంపెనీలో మార్కెటింగ్‌ అధికారిగా పని చేస్తున్నాడు. 



వీరిలో పెద్ద కొడుకు సలీంకు వివాహం కాగా.. అతడికి భార్య రజియా, ఇద్దరు కుమార్తెలు షహనాజ్, నస్రీనా ఉన్నారు. లాల్‌సాహెబ్‌కు ఇంకా వివాహం కాలేదు. అయితే, పెంటుసాహెబ్‌ తరచూ మద్యం తాగి వచ్చి భార్య మహబూబీని దుర్భాషలాడడంతో పాటు కోడలు రజియాను లైంగికంగా వేధించేవాడని ఆరోపణలున్నాయి. తన భార్య పట్ల తండ్రి ప్రవర్తనపై పలుమార్లు హెచ్చరించినా అతడి పరిస్థితిలో మార్పు రాకపోవడం, తల్లిని దూషిస్తుం డడంతో సలీం మనోవేదనకు గురయ్యాడు. ఇందుకు చావే పరిష్కారంగా ఎంచుకున్నాడు. 

 

ఇంట్లో మంచి జరగాలని చెప్పి.. 

ఇంట్లో మంచి జరగాలంటే పాలేరు కాలువ వద్దకు వెళ్లి స్నానం చేసి.. పూజలు చేయాలని మంగళవారం కుటుంబసభ్యులకు చెప్పాడు. తమ్ముడిను పిలిచి బైక్‌పై తనను, తండ్రిని పాలేరు కాలువ వద్ద దింపమని కోరాడు. తమ్ముడు వారిని పవర్‌ హౌస్‌ కాలువ వద్ద దింపగా.. తల్లితో సహా తన భార్యాపిల్లలను కూడా తీసుకురమ్మని చెప్పాడు. అతను వారిని తీసుకొచ్చేందుకు వెళ్లిన క్రమంలో తండ్రి పెంటూసాహెబ్‌ను కాలువలోకి తోసేశాడు. లాల్‌సాహెబ్‌ తల్లి, వదిన, పిల్లలను తీసుకొని వచ్చాడు. ఈ క్రమంలో సలీం.. తమ్ముడితో ఇంట్లో టీవీపై డబ్బాలో పూజా సామగ్రి లిస్టు ఉందని.. దానిని తీసుకురావాలని చెప్పి సోదరుడిని పంపించాడు. అతను వెళ్లగానే సలీం తన లుంగీని చీల్చి తల్లి మహబూబీ, భార్య రజియా నడుముకు కట్టి కాలువలోకి నెట్టేశాడు. 



ఇద్దరు పిల్లల నడుముకు గుడ్డకట్టి కాలువలో నెట్టేశాడు. తర్వాత తనూ కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వెళ్లిన లాల్‌ సాహెబ్‌ తన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సలీం రాసిన లేఖ చూసి.. వెంటనే వెనక్కి తిరిగి వచ్చాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో స్నేహితులతో కలిసి గాలించాడు. రాత్రంతా వారి కోసం వెతికి.. కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానంతో స్థానిక మత్స్యకారులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రఘు వచ్చి గాలింపు చర్యలను పర్యవేక్షించారు.



ఈ క్రమంలో తొలుత ఇద్దరు పిల్లలు షహనాజ్‌(7), నస్రీనా(5)మృతదేహాలు నీటిలో తేలగా.. అనంతరం రజియా(28), మహబూబీ(45) మృతదేహాలు వెలికి తీశారు. సలీం(30), పెంటుసాహెబ్‌(50) మృతదేహాలను మత్స్యకారులు బయటకు తీశారు. తన సోదరిపై మామ పెంటుసాహెబ్‌ అమర్యాదగా ప్రవర్తించడంతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడేవాడని, వీటిని తట్టుకోలేకే సలీం ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని మృతురాలు రజియా సోదరుడు యాకూబ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

మరణాలపై అనుమానాలెన్నో..

ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటిల్లిపాదికి ఈతరాదని తెలిసినా తల్లి, భార్యను.. పిల్లలను కట్టేసి రిజర్వాయర్‌లోకి తోయడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లి.. భార్యను కట్టేస్తుండగా వారు ఎందుకు ప్రతిఘటించలేదు. కనీసం కేకలు ఎందుకు వేయలేదని.. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టిం చుకోలేదా? అని అనుమానిస్తున్నారు.  సలీం రాసిన సూసైడ్‌ నోట్‌లో పలు అంశాలు అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. తమ్ముడిని జాగ్రత్తగా ఉండమని లేఖలో పేర్కొనడం, పిల్లలతో సహా అమ్మ, నాన్న, భార్య, తాను చనిపోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నాడు. తండ్రిని చంపి తాను చనిపోతే నా పిల్లలు బతకడం కష్టం.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.. అని తమ్ముడిని ఉద్దేశించి రాశాడు. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top