ఆ విమానం కోసం 'గుప్పెడు మనస్సు' ఆరాటం

ఆ విమానం కోసం 'గుప్పెడు మనస్సు' ఆరాటం


ఇంటి నుంచి గడప దాటి బయటకు వెళ్లిన వారు... గమ్యస్థానానికి చేరినట్లు వారి నుంచి 'ఐ యామ్ సేఫ్' అంటూ ఒక్క ఫోన్ కాల్ లేదా చిన్న ఎస్ఎంఎస్ లేక ఈ మెయిల్ వస్తే చాలు మనిషి గుప్పెడు మనసు హమ్మయ్య అంటూ రిలాక్స్ అవుతుంది.  ఎందుకు టెన్షన్ ... నాలుగైదు గంటలలో గమ్యస్థానం చేరుకుంటాం...  క్షేమంగా వెళ్లి లాభంగా కాదు... క్షేమంగా వెళ్లి ఇంటి్కి క్షేమంగా తిరిగి వస్తాం...  ఏ మాత్రం ఆందోళన వద్దంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి... వారిలో కొండంత ధైర్యం నింపి... బై బై అంటూ విమానం ఎక్కారు. ఎయిర్ పోర్ట్లో వారికి సెండాఫ్ ఇచ్చి... వారి కుటుంబ సభ్యులు ఆనందంతో ఇంటి ముఖం పట్టారు. వాళ్లు విమానం ఎక్కి నాలుగు గంటలు దాటిందంటూ గడియారం వంక చూశారు.



ఓ వైపు గంటల ముల్లు చక్రంలా తిరుగుతుంది. దాని వెంటనే నిముషాల ముల్లు నీ వెంటే నేను అంటూ పోటీ పడి మరీ పరుగులు పడుతోంది. అయితే వెళ్లిన వారు నుంచి చిన్నపాటి సందేశం కూడా రాలేదు... బిజీగా ఉండి ఉంటారని వారికివారు తమ మనసుకు సమాధానం చెప్పుకున్నారు. సెల్ ఫోన్కు ఫోన్ చేస్తే .. స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది.. మనసులో ఏదో మూల కీడు శంకిస్తుంది. టెన్షన్ తట్టుకోలే... టీవీ పెట్టారు.   మలేసియా నుంచి బీజింగ్ బయలుదేరిన ఎమ్హెచ్ 370 విమానం అదృశ్యం అంటూ ప్లాష్ న్యూస్ టీవీ స్క్రీన్పై కనిపించడం బంధువులకు 'షాక్'. ఇంతకీ విమానం ఏమైంది... తమ వారి ఆచూకీ ఎక్కడ అంటూ కుటుంబీకులు మలేసియా ఎయిర్పోర్ట్కు పరుగులు పెట్టారు. ఆచూకీ తెలిసిందన్న వార్త కోసం ఒకటి రెండు కాదు దాదాపు నెల రోజులు విమానాశ్రయంలో పడిగాపులు కాశారు.



కళ్లు కాయాలు కాసేలా ఎదురు చూశారు. అయినా ఫలితం రాలేదు. విమానం కూలిపోయింది. తీవ్రవాదులు హైజాక్ చేశారంటూ పూకార్లు షికార్లు చేశాయి.  దీంతో వారి గుప్పెడంత గుండెలు అవిసిపోయేలా రోదించాయి.  విమానం కోసం ప్రపంచదేశాలు ఏకమై గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా ఫలితం శూన్యం. రేపైనా ఆ విమానం ఆచూకీ తెలుస్తుందని ఓ చిన్న ఆశ పెట్టుకుని కళ్లలో వత్తులు వేసుకుని ఏడాదిగా ఎదురు చూస్తునే ఉన్నారు....చూస్తున్నారు కూడా.



కాగా 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం సరిగ్గా గత ఏడాది 08-03-2014 మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది.  బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. కుటుంబసభ్యులు,  బంధువులతోనే కాదు ఈ ప్రపంచంతోనే ఆ విమానంలోని ప్రయాణికులు డిస్కనెక్ట్ అయ్యారు. ప్రపంచ చరిత్రలోనే ఇంతమంది ప్రయాణికులతో వెళ్తూ గల్లంతైన విమానంగా ఎమ్హెచ్ 370 ఓ మిస్టరీగా మిగిలిపోయింది.  ఈ విమానంలో మలేసియా వాసులు,  154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top