భారీ విధ్వంసానికి స్కెచ్ గీశారు..

భారీ విధ్వంసానికి స్కెచ్ గీశారు.. - Sakshi


హైదరాబాద్ : నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన 11మంది అనుమానిత ఉగ్రవాదుల నుంచి ఎన్ఐఏ అధికారులు పలు వస్తువులను సీజ్‌ చేశారు. ఎన్ఐఏ హైదరాబాద్లోని పలుచోట్ల తనిఖీలు చేపట్టింది. అదుపులోకి తీసుకున్న పదకొండుమంది అనుమానితుల నుంచి రెండు పిస్తోళ్లు, ఒక ఎయిర్‌గన్‌, బుల్లెట్స్‌,15 లక్షల నగదు, యూరియాతోపాటు కొన్ని రసాయనాలు, 23 మొబైల్‌ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, ఒక ట్యాబ్‌, ఒక సీపీయూ, 7 పెన్‌డ్రైవ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక డోంగిల్‌తోపాటు రెండు టార్గెట్‌ బోర్డులు, రెండు గ్యాస్‌ స్టవ్‌లు, కండెన్సర్‌, ప్రెషర్‌ మీటర్‌, మాస్క్‌లు, గ్లౌజులు కూడా వారి వద్ద లభ్యం అయ్యాయి.



వీటన్నింటిని గమనిస్తే పెద్ద విధ్వంసానికే కుట్ర పన్నినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానిత ఉగ్రవాదులకు ఆయుధాలు, డబ్బు ఎక్కడ నుంచి సరఫరా అవుతోంది, షెల్టర్‌ ఎవరిచ్చారు, కుట్రతో ఇంకెవరికి సంబంధం ఉంది... అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసుల అదుపులో మహమద్ ఇలియాస్ యజ్దానీ, మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, హబీబ్ మహ్మద్, మహ్మద్ ఇర్ఫాన్, అబ్దుల్లా బిన్ మహ్మద్, సయ్యద్ నయిమత్ ఉల్లా హుస్సేన్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్, మహ్మద్ అతాహుల్లా రెహ్మాన్, అబ్దుల్ ఆల్ జిలానీ, ఏఎం అజార్, మహ్మద్ అర్భాజ్ అహ్మద్ ఉన్నారు.



మరోవైపు సోషల్ మీడియా ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. తాజాగా హైదరాబాద్‌-ఆపరేషన్‌లో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదులు కూడా సోషల్ మీడియానే వేదికగా చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులు ఫేస్‌బుక్‌లో చేసుకుంటున్న ఛాటింగ్‌పై అనుమానం వ్యక్తం చేసిన ఐబీ వారి కదలికలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉగ్రముఠా గుట్టు బయటపడింది. ప్రముఖ వ్యక్తులు, ప్రసిద్ధి ప్రాంతాలను ముష్కరులు టార్గెట్ చేసిన తీరు కూడా వెలుగు చూసింది. ఐబీ నుంచి అందిన సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అనుమానితులను అరెస్ట్ చేసి మిగతా వివరాలు రాబడుతోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top