సమస్యలన్నింటిపైనా చర్చించాల్సిందే

సమస్యలన్నింటిపైనా చర్చించాల్సిందే - Sakshi


ప్రత్యేక హోదాపై ప్రధాన దృష్టి

 
*  సమావేశాలు 15 రోజులుండాలి

 
*  వైఎస్సార్‌సీఎల్పీ సమావేశంలో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ శాసనసభలో చర్చించేందుకు గట్టిగా పట్టుబట్టాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశం ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించింది.



కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ తన మంత్రులను ఉపసంహరించుకుంటేనే ఢిల్లీలో కదలిక వస్తుందని అందువల్ల ప్రధానంగా ఈ విషయంపైనే దృష్టిని కేంద్రీకరించాలని సమావేశంలో పేర్కొన్నారు. ప్రజా సమస్యలన్నింటినీ చర్చించడానికి కనీసం పదిహేను రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలనీ సమావేశం డిమాండ్ చేసింది.గ్రామీణ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ఉల్లి ధరలు ఆకాశానికి అంటుతూ ఉండటం, ఇసుక మాఫియా దురాగతాలు, ఓటుకు కోట్లు, నీరు-చెట్టు కార్యక్రమంలో అవినీతి, రిషితేశ్వరి మరణంతోపాటుగా ఇంకా అనేక అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ప్రతి సమస్య చర్చకు వచ్చేలా ప్రతిపక్షంగా తాము చూడాలని, అనవసర విషయాలను ప్రస్తావనకు తెచ్చి టీడీపీ ప్రభుత్వం ప్రజావసరమైన చర్చలేవీ జరక్కుండా అడ్డుపడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

 

ప్రభుత్వం చర్చకు సిద్ధపడాలి  

శాసనసభాపక్షం సమావేశం అనంతరం వివరాలను ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, ఆదిమూలపు సురేష్ మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాసమస్యలన్నింటిపైనా చర్చకు సిద్ధపడాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాభీష్టం మేరకు వారి సమస్యలపై చర్చ జరగాలని తాము భావిస్తున్నామని, అయితే ప్రభుత్వం అన్నింటికీ ‘ఆ విధంగా ముందుకు పోతున్నాం’ అంటూనే చర్చకు రాకుండా వెనక్కి పోతుందని విమర్శించారు.



ప్రజాస్వామ్యంలో వివిధ అంశాలపై చర్చకు వచ్చినపుడు ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయని అందుకే అధికారపక్షం చర్చ జరక్కుండా చూసుకుంటుందన్నారు. సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నందున ఐదు రోజుల సమయం చాలదని, అందుకే తాము పదిహేను రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నామన్నారు. సోమవారం నాటి బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహామండలి) సమావేశంలోనూ ఈ విషయాన్ని లేవనెత్తుతామన్నారు.



రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలనే అంశంపై తాము సోమవారం వాయిదా తీర్మానాన్ని ఇచ్చి చర్చ కోరతామన్నారు. ఆ తర్వాత ఇదే అంశంపై కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు వైదొలగాలని కోరతామన్నారు. రాష్ట్రంలో పేదరికం తగ్గాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా కచ్చితంగా ప్రత్యేకహోదా అవసరమని అభిప్రాయపడ్డారు. వైఎస్ ఫొటోను అసెంబ్లీ లాంజ్‌లో తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తామని,  ప్రజాసమస్యలపై చర్చకే ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలని తమ నేత వైఎస్ జగన్ అభిప్రాయపడుతున్నారని వారన్నారు. వైఎస్ ఫొటోనే కాదు, ప్రకాశం పంతులు, అమరజీవి, దామోదరం సంజీవయ్య ఫొటోలను కూడా తొలగించిన చోటే పెట్టాలని కోరుతున్నామన్నారు. ఫొటోల విషయాన్ని ప్రభుత్వ విజ్ఞతకు వదిలి వేస్తామని కూడా వారన్నారు.  

 

చంద్రబాబు ముఖ్యమంత్రేనా!

రాజధాని ప్రాంతంలో భూసేకరణ నోటిఫికేషన్  విషయం ముఖ్యమంత్రికి తెలియదనీ తానే ఆ నిర్ణయం తీసుకున్నానని మంత్రి పి.నారాయణ చెప్పడం హాస్యాస్పదమని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఇంత పెద్ద నిర్ణయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిందంటే అసలు ఆయన ముఖ్యమంత్రేనా లేక ఎవరి ఒత్తిళ్లతోనో బొమ్మలాగా పనిచేస్తున్న వ్యక్తా? అనే అనుమానం కలుగుతుందన్నారు.



రైతులపై ప్రేమతో ఉపసంహరించుకున్నామని, పవన్‌కళ్యాణ్ చెబితే వెనక్కి తగ్గామని ప్రభుత్వం చెబుతోందనీ అయితే నరేంద్రమోదీ ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ ఆర్డినెన్స్ కాలం పూర్తవుతూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని శ్రీకాంత్ అన్నారు. తమ పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేలు అన్ని అంశాలపై అసెంబ్లీలో మాట్లాడ్డానికి సిద్ధంగా ఉన్నారని బూడి ముత్యాలనాయుడు చెప్పారు.



పార్టీ ముఖ్య నేతలు ఎంవీ మైసూరారెడ్డి, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆదిరెడ్డి అప్పారావు, కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్.అమరనాథ్‌రెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, సుజయ్‌కృష్ణ రంగారావు, కలమట వెంకటరమణ, కంబాల జోగులు, పీడిక రాజన్నదొర, పోతల రామారావు, పాలపర్తి డేవిడ్‌రాజు, చిర్ల జగ్గిరెడ్డి, కె.శ్రీనివాసులు, గౌరు చరితారెడ్డి, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, వంతెల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, భూమా అఖిలప్రియ, జంకె వెంకటరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, తిరువీధి జయరామయ్య, గుమ్మనూరు జయరామయ్య, వరుపుల సుబ్బారావు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, అత్తారు చాంద్‌బాషా సమావేశంలో పాల్గొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top