నో హారన్ ప్లీజ్....

నో హారన్ ప్లీజ్.... - Sakshi


మంచి, చెడుల గురించి పెద్దగా ఆలోచించకుండా దేన్నైనా నిషేధించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా సరకుల రవాణా ట్రక్కుల వెనుక రాసి ఉండే 'హారన్ ఓకే ప్లీజ్'ను నిషేధిస్తూ మహారాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్న ఆవు మాంసాన్ని (బీఫ్), అంతకుముందు... పతంగులు ఎగరేసేందుకు ఉపయోగించే 'మాంజా'ను, దానికి ముందు రక్త సంబంధీకులు కానివారిని 'అంకుల్' అని పిలవద్దంటూ వరుసగా ఉత్తర్వులు జారీచేస్తూ వచ్చింది. ట్రక్కుల వెనుక 'హారన్ ఓకే ప్లీజ్' అని రాయడం వల్ల వాహనదారులను హారన్ కొట్టాల్సిందిగా ప్రోత్సహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అలా రాయడాన్ని నిషేధించడం ద్వారా శబ్ద కాలుష్యాన్ని అరికట్టడంలో ముందున్నామంటూ తనకు తాను జబ్బలు చరచుకుంది. అర్థమయ్యే ట్రాఫిక్ బోర్డులనే మన వాహన చోదకులు పట్టించుకోరు. అలాంటిది స్పష్టంగా అర్థం కాని 'హారన్ ఓకే ప్లీజ్'ను ఎంతమంది పట్టించుకుంటారు?



ఇంతకూ అసలు 'హారన్ ఓకే ప్లీజ్' అనే నానుడి ఎలా వచ్చిందనే విషయంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

సాధారణంగా హారన్ ప్లీజ్ అని ఉండాలి. ఒకప్పుడు అలాగే ఉండేది. మరి 'ఓకే' అనే పదం మధ్యలో ఎందుకు చేరింది? అన్న ప్రశ్నకు సమాధానాలు వెతుకుదాం. ఇంగ్లీషురాని పెయింటరెవరో అలా రాయడం వల్ల, దాన్ని ఇతరులు గుడ్డిగా అనుసరించడం వల్ల అది ఓ ప్రేజ్‌గా స్థిరపడిపోయిందనే వాళ్లు ఉన్నారు.



ఈ వాదన వాస్తవానికి దగ్గరగా లేదు. ఓ దశలో టాటా కంపెనీ పెద్ద ఎత్తున ట్రక్కులను ఉత్పత్తి చేసిన విషయం తెల్సిందే. అప్పుడు ఎక్కడా చూసినా టాటా కంపెనీ ట్రక్కులే కనిపించేవి. అదే సమయంలో టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ 'ఓకే' బ్రాండ్ నేమ్‌తో వాషింగ్ సబ్బులను తయారుచేసింది. వాటి మార్కెట్ ప్రచారం కోసం తన కంపెనీయే తయారు చేసిన ట్రక్కులపై 'ఓకే' అని రాయించినట్టు వాదించేవారూ ఉన్నారు. కానీ 'ఓకే....టాటా...బై..బై'నే టాటా  సబ్బు ప్రచార నినాదం ప్రజల్లో అప్పటికే ఎంతో చొచ్చుకుపోయింది. అలాంటి సమయంలో ఇలా అర్థంకాని రీతిలో సబ్బును టాటా కంపెనీ ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న ట్రక్కు డ్రైవర్ల కథనం ప్రకారం: 'హారన్ ప్లీజ్' అనే పదం విడివిడిగా ఉండి, మధ్యలో పెద్దాక్షరాల్లో 'ఓకే' అనే  పదం ఉండేది. (ఇప్పటికీ చాలా ట్రక్కులపై అలాగే ఉంటుంది). ఆ పదం పైనా ఓ ఆకుపచ్చ లైటు ఉండేది. వెనక వచ్చే వాహనం ఓవర్ టేక్‌కు ప్రయత్నించినప్పుడు, ఆ వాహన డ్రైవరుకు అర్థమయ్యేలా ట్రక్కు డ్రైవర్ ఈ 'ఓకే' లైట్‌ను వెలిగించేవాడు. ఈ కథనం వాస్తవానికి దగ్గరగా ఉంది. 'హారన్ ప్లీజ్' పదంలో 'ఓకే' అనే పదం ఎందుకొచ్చిందో మనలాగా ఆలోచించని వారు చాలా మందే ఉంటారు. అందుకనే 2009 'హారన్ ఓకే ప్లీజ్' టైటిల్‌తో బాలీవుడ్ సినిమా కూడా వచ్చింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top