ఇంధన ఆదాపై మాగ్మా దృష్టి


 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాలను నడిపే డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంధన పొదుపుపై దృష్టిసారించినట్లు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ మాగ్మా ఫిన్‌కార్ప్ ప్రకటించింది. వచ్చే మూడేళ్ళ కాలంలో డ్రైవింగ్‌లో నైపుణ్యం పెంచడం ద్వారా  35 లక్షల లీటర్ల ఇంధనాన్ని ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు  మాగ్మా ఫిన్‌కార్ప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సందీప్ వలున్జ్ తెలిపారు. దేశంలో 50 లక్షల మంది ట్రక్ డ్రైవర్లు ఉన్నారని, వీరిలో ఏడాదికి లక్ష మంది డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్‌తో ఒప్పందం చేసుకున్నామని, ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ట్రాఫిక్ ట్రాన్స్‌పోర్ట్ నగర్లు పేరుతో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సందీప్ తెలిపారు.

 

  వచ్చే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్నామని, తొలి కేంద్రాన్ని కరీంనగర్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే విజయవాడతో పాటు మరో 12 చోట్ల ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ వివరాలను తెలియచేయడానికి సోమవారం హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సందీప్ మాట్లాడారు. ఈ ఏడాది లక్ష మంది డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా సుమారు 7.65 లక్షల లీటర్ల ఇంధనాన్ని ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కంపెనీ సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, డ్రైవర్లకు శిక్షణసహా, ఆరోగ్యంపై అవగాహనపైనా దృష్టి పెడుతున్నామన్నారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top