కూలీల కాల్చివేతపై సీబీఐ విచారణ జరపాలి

కూలీల కాల్చివేతపై సీబీఐ విచారణ జరపాలి


లోక్‌సభలో కేంద్రానికి డిప్యూటీ స్పీకర్ తంబిదురై డిమాండ్



సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో శేషాచలం అడవుల్లో పోలీసులు 20 మంది తమిళ కూలీలను దారుణంగా కాల్చి చంపారని.. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిప్యూటీ స్పీకర్, ఏఐఏడీఎంకే ఎంపీ డాక్టర్ ఎం.తంబిదురై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభలో జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.



‘‘చనిపోయినవారంతా గిరిజనులు. నిరాయుధులు. ఇది అంతర్రాష్ట్ర సమస్య. తమిళనాడుకు చెందిన 20 మందిని ఊచకోత కోశారు. కేంద్ర హోంమంత్రి ఇక్కడే ఉన్నారు. వారు దీనిపై సమాధానం చెప్పాలి. ఏం చర్య తీసుకున్నారో చెప్పాలి. సీబీఐ విచారణ జరిపిస్తున్నారో లేదో స్పష్టం చేయాలి...’’ అని ప్రశ్నించారు. తరువాత 377 నిబంధన కింద రామంతపురం ఎంపీ ఎ.అన్వర్ రజా మాట్లాడుతూ శేషాచలం సంఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారంతా నిరుపేదలేనని, కేంద్రం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించాలని కోరారు.



అంతకుముందు.. ఇండియన్ ముస్లిం లీగ్ ఎంపీ (కేరళ) ఇ.అహ్మద్ శేషాచలం ఎన్‌కౌంటర్‌లో 20 మంది కూలీల మరణంతో పాటు, తెలంగాణలో ఐదుగురు అండర్ ట్రయల్ ఖైదీలు పోలీసు కాల్పుల్లో మృతిచెందిన ఘటనను కూడా ప్రస్తావిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.



‘‘దేశంలో కొన్ని వర్గాల ప్రజల ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయి. అభాగ్యుల మొర విన్నవించేందుకు పార్లమెంటు మినహా మరే వేదికా లేకపోవడంతో ఇక్కడ ప్రస్తావిస్తున్నా. జరగిన సంఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.  తెలంగాణలో పోలీసుల చేతిలో మృతిచెందిన వారు కేసుల్లో ఉండి  ఉండొచ్చు. కానీ పోలీసు కస్టడీలో ఉన్నవారిని చంపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం హక్కులేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత, ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇలా అమాయకులను చంపడం సిగ్గుపడాల్సిన చర్య. ప్రజలు జ్యుడిషియల్ విచారణ గానీ, సీబీఐ విచారణ గానీ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్లు నిజంగా నేరం చేసినా ఇలా ఎలా చంపేస్తారు? ఏ పార్టీ పాలిస్తుందన్నది కాదు ఇక్కడ. రాముడు పాలిస్తున్నాడా? రావణుడు పాలిస్తున్నాడా? అన్నది ముఖ్యం కాదు. మైనారిటీల హక్కులకు భంగం వాటిల్లుతోంది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి...’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.



కాంగ్రెస్ సహా పలు ఇతర పార్టీల ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, జాయిస్ జార్జి, డాక్టర్ ఎ.సంపత్, పి.కె.బిజు, ఎం.బి.రాజేశ్, శంకర్‌ప్రసాద్ దత్తలు.. తాము అహ్మద్ డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నట్టు స్పీకర్‌కు తెలిపారు. అయితే.. డిప్యూటీ స్పీకర్ తంబిదురై సభలో నేరుగా ఈ అంశాన్ని లేవనెత్తటం పట్ల స్పీకర్ సుమిత్రామహాజన్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన మాట్లాడాలనుకుంటే తనను అడగవచ్చని, నేరుగా హోంమంత్రితో మాట్లాడరాదని పేర్కొన్నారు. ఆ తర్వాత హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. ‘ఎన్‌కౌంటర్ల’పై ఆయా రాష్ట్రాల నుంచి కేంద్రం నివేదికలు కోరిందని..  సమాధానం వచ్చాక సభ్యులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఆయన సమాధానంపై ప్రతిపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top