పశ్చిమాసియా, లిక్విడిటీలపై దృష్టి..

పశ్చిమాసియా, లిక్విడిటీలపై దృష్టి..


న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నగదు లభ్యత (లిక్విడిటీ), విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సెలవుల కారణంగా మూడురోజులకే ట్రేడింగ్ పరిమితమయ్యే ఈ వారంలో బ్యాంకుల వద్ద లిక్విడిటీ కొరత ఏర్పడవచ్చని వారు అంచనావేశారు. ఏప్రిల్ 2న మహావీర్ జయంతి, 3న గుడ్‌ఫ్రైడేల కారణంగా మార్కెట్‌కు సెలవు. సాధారణంగా మార్చి నెలాఖర్లో పన్ను చెల్లింపులతో నగదు లభ్యత కొరవడుతుందని, మనీ మార్కెట్లో (స్వల్పకాలానికి బ్యాంకులు నగదును ఇచ్చిపుచ్చుకునే మార్కెట్) వడ్డీ రేట్లు బాగా పెరిగిపోతాయని విశ్లేషకులు చెప్పారు. లిక్విడిటీ పరిస్థితిని గమనిస్తున్నామని, అవసరమైతే వ్యవస్థలోకి నగదును ప్రవేశపెడతామని మరోవైపు రిజర్వుబ్యాంక్ హామీ ఇచ్చింది.

 

 బీఎస్‌ఈ సెన్సెక్స్ కీలకమైన 28,000 పాయింట్ల స్థాయిని కోల్పోయినందున ఈ వారం షేర్లపై అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుందని, ట్రేడింగ్ పరిమాణం తక్కువగా వుంటుందని బ్రోకర్లు చెప్పారు. ప్రస్తుత దేశీయ, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా మార్కెట్లో లబ్ధిపొందడం ఇన్వెస్టర్లకు, ప్రత్యేకించి డే ట్రేడర్లకు అంత సులభంకాదని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ అన్నారు. అయితే నిఫ్టీ కీలకమైన 8,300 మద్దతు స్థాయి వద్ద వున్నందున, రానున్న సెషన్లలో చిన్న టెక్నికల్ ర్యాలీ వుండవచ్చనేది ఆయన అంచనా. కానీ పెరుగుదల ఇండెక్స్ ఆధారిత పెద్ద షేర్లు, ప్రధానమైన మిడ్‌క్యాప్ షేర్లకు మాత్రమే పరిమితం కావొచ్చని ఆయన పేర్కొన్నారు.

 

  యెమెన్‌లో సౌదీ మిలటరీ దాడుల్ని ప్రారంభించినందున, మధ్య ఆసియాలో ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుతున్నాయని, ఈ ధరల తీరుపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టవచ్చని నిపుణులు చెప్పారు. దేశీయంగా మార్కెట్‌ను కదిల్చే పెద్ద వార్తలేవీ వెలువడే అవకాశం లేనందున, అంతర్జాతీయ అంశాలే ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నారు. కార్పొరేట్ల మార్చి త్రైమాసిక ఫలితాలు కూడా బలహీనంగా ఉంటాయని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అంచనాల్లో పేర్కొన్నారు. ఇక ఈ వారం ఫిబ్రవరి నెలకు ప్రధాన మౌలిక పరిశ్రమల వృద్ధి గణాంకాలు, ద్రవ్యలోటు డేటా వెలువడనున్నాయి.

 

 రూ. 79,000 కోట్లకువిదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు

 న్యూఢిల్లీ: ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) రూ. 20,000 కోట్ల వరకూ దేశీ మార్కెట్లో పెట్టుబడి చేయడంతో ఈ ఏడాది వారి పెట్టుబడులు రూ. 79,000 కోట్లకు (1275 కోట్ల డాలర్లు) చేరాయి. మార్చి 2-27 మధ్య ఎఫ్‌ఐఐలు ఈక్విటీ మార్కెట్లో రూ. 11,813 కోట్లు పెట్టుబడిచేయగా, రూ. 8,912 కోట్ల విలువైన రుణపత్రాల్ని నికరంగా కొనుగోలుచేశారు. బీమా, మైనింగ్ బిల్లులకు పార్లమెంటు ఆమోదం, గార్ పన్ను విధానాన్ని సమీక్షిస్తామన్న హామీలతో విదేశీ పెట్టుబడుల ప్రవాహం మరింత పెరగవచ్చనేది విశ్లేషకులు అంచనా.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top