భోజనం లేటైందని.. కొట్టిన ఎమ్మెల్యే

భోజనం లేటైందని.. కొట్టిన ఎమ్మెల్యే

తనకు భోజనం వడ్డించడం 20 నిమిషాలు ఆలస్యమైందని.. క్యాంటీన్‌లో పనిచేసే పార్ట్ టైం సర్వర్‌ను ఓ ఎమ్మెల్యే చెంపమీద కొట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పీసీ జార్జ్ తనను కొట్టారని ఆ కార్మికుడు స్థానిక మీడియా వద్ద వాపోయాడు. అయితే దీనిపై అతడు ఎవరికీ ఫిర్యాదు మాత్రం చేయలేదు. తాను ఎవరినీ కొట్టలేదని, అనవసరంగా తన పేరు ఇందులో ఇరికించినందుకు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే జార్జ్ అంటున్నారు. 

 

తాను ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లేసరికి ఆయన ఓ మహిళను తిడుతున్నారని, తనను చూసేసరికి తనను కూడా తిట్టారని మను అనే ఆ కార్మికుడు చెప్పాడు. తిట్టాల్సిన అవసరం ఏమీ లేదని తాను చెప్పగా చెంపమీద కొట్టారని ఆరోపించాడు. కొట్టాయం జిల్లాలోని పూంజర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జార్జ్ (65) ఈ ఆరోపణలను ఖండించారు. తాను మధ్యాహ్నం 1.30కి భోజనం కావాలని చెప్పానని, 2.05 అయినా అది రాలేదని జార్జ్ అన్నారు. మరీ ఆలస్యం అవుతుండటంతో క్యాంటీన్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మహిళను పిలిచి అడగ్గా, అప్పటికే పంపానని ఆమె చెప్పారన్నారు. ఇలాంటి పనికిమాలిన వాళ్లను తీసుకోకూడదని ఆమెకు చెబుతుండగా ఈ కుర్రాడు వచ్చాడని, సూపర్‌వైజర్‌ను తిట్టడంతో అతడు కోపగించుకున్నాడని, తాను అతడిని తిట్టి బయటకు పంపేశాను తప్ప కొట్టలేదని జార్జ్ వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై తాను స్పీకర్ శ్రీరామకృష్ణన్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top