ప్రేమ సమాజం ఎన్నికలకు బ్రేక్

ప్రేమ సమాజం ఎన్నికలకు బ్రేక్


డాబాగార్డెన్స్(విశాఖ) : ప్రేమసమాజం ఎన్నికలకు బ్రేక్ పడింది. ఓటర్ల జాబితాలో అవకతవకల వల్లే ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి 2848 మంది ఓటర్లు(జీవితకాల సభ్యులు) ఉండగా... ప్రేమసమాజం పాలకవర్గం వద్ద ఉన్న జాబితా ప్రకారమైతే.. సీరియల్ నంబర్ 1236 నుంచి 2848 వరకే ఓటర్ల వివరాలు ఉన్నాయి. ఒకటి నుంచి 1235వ నంబరు వరకు ఓటర్ల సంగతేంటని ఓ జీవితకాల సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోవడం... ప్రస్తుత పాలకవర్గం దిక్కున్న చోట చెప్పుకోమనడంతో సదరు సభ్యుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఎన్నికలు నిర్వహించరాదంటూ స్టే ఇచ్చింది.



వివరాల్లోకి వెళ్తే...

విశాఖపట్నంలో ప్రేమ సమాజాన్ని 1930 లో స్థాపించారు. ఇది ఎందరో అభాగ్యులకు జీవితాలను ఇచ్చింది. ఎందరో అనాధలను పెంచి పెద్ద చేసి, చదువు చెప్పించి,వివాహాలు చేసి, వారు కోల్పోయిన కుటుంబాలను వారికి కల్పించింది. దివి సీమ ఉప్పెన సమయంలో వీరి సేవలు మరువలేనివి. ఇప్పటికే ఎన్నో సేవాకార్యక్రమాలు చేసే ప్రేమ సమాజంలో విశాఖ పుర ప్రముఖులు ఎందరో సభ్యులుగా ఉన్నారు. ప్రేమసమాజం కార్యవర్గ ఎన్నిక ప్రతీ రెండేళ్లకోసారి, సర్వసభ్య సమావేశం ఏడాదికోసారి జరగాల్సి ఉంది. కానీ నిబంధనల మేరకు జరగడం లేదు. ప్రస్తుతం ఉన్న పాలకవర్గమే అజమాయిషీ చెలాయిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 26(ఆదివారం)న సాయంత్రం 4 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించి 2016-18 ఏడాదికి నూతన కమిటీ ఎన్నిక జరిపేందుకు కమిటీ సిద్ధమైంది.



ఎన్నికకు సంబంధించి 49 మంది పోటీపడనున్నారు. వీరిలో 10 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో చివరకు 39 మంది పోటీలో నిలిచారు. పోటీలో నిలిచిన వారిలో పి.వి.మోహన్‌రెడ్డి(జీవిత కాల సభ్యుడు + పోటీలో ఉన్న వ్యక్తి) ఓటర్ల జాబితాను అడిగారు. సీరియల్ నెంబరు 1235 నుంచి 2848 వరకు ఉన్న లిస్ట్ మాత్రమే ప్రస్తుత పాలకవర్గ సభ్యులు ఇచ్చారు. ఒకటి నుంచి 2848వ నంబరు వరకు ఉన్న ఓటర్ల జాబితా మొత్తం కావాలంటూ మోహన్‌రెడ్డి కోరారు. ‘‘ఆ జాబితా లేదు.



నీ దిక్కున్న చోట చెప్పుకో. ప్రేమసమాజాన్ని బజారుకు ఈడ్చవద్దు.’’ అని పాలకవర్గ సభ్యులు చెప్పడంతో మోహన్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు వచ్చే నెల నాలుగో తేదీ వరకు స్టే (ఐఏ 501/2016, ఏఓపీ 647/2016)ఇచ్చింది. దీంతో ఎన్నిక వాయిదా పడింది.

 

నేడు ప్రేమసమాజం సర్వసభ్య సమావేశం

ప్రేమసమాజం సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించనున్నట్టు ప్రేమసమాజం కార్యదర్శి ఎం.వి.రమణ ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సంస్థ సభ్యులు మాత్రమే హాజరు కావాలని కోరారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top