తెగేదాకా లాగుతారా!

తెగేదాకా లాగుతారా! - Sakshi

– మహారాష్ట్రలో ఉత్కంఠ

– తారస్థాయికి చేరిన సంకీర్ణ లుకలుకలు

– ఫడ్నవీస్‌ ప్రభుత్వం నుంచి వైదొలుగుతామంటున్న శివసేన

– మద్దతివ్వబోమన్న ఎన్సీపీ

– మధ్యంతరం వస్తుందా?

– స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ముడిపడ్డ రాజకీయం

 

 

మహారాష్ట్ర రాజకీయాలు రంజుగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాముల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. శివసేన ప్రభుత్వం నుంచి వైదొలగడం దాదాపు ఖాయమనే పరిస్థితి నెలకొంది. అదే జరిగితే దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం పుట్టి మునుగుతుందా? ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఫడ్నవీస్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారా? మద్దతిచ్చేది లేదంటున్న ఎన్సీపీ మనసు మార్చుకొని... కమలానికి అండగా ఉంటుందా? ఫడ్నవీస్‌ భవితవ్యాన్ని తేల్చగలిగే బలమున్న శివసేన, ఎన్సీపీలు మాట మీద నిలబడి అధికారానికి దూరం జరిగితే... మధ్యంతర ఎన్నికలు తప్పవా? మహారాష్ట్రలో అసలేం జరుగుతోంది... తాజా పరిణామాలకు దారితీసిన పరిస్థితులేమిటో చూద్దాం..

 

మారిన పాత్ర

పాతమిత్రులైన బీజేపీ, శివసేన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేశాయి. బీజేపీ 122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, శివసేన 63 సీట్లు మాత్రమే సాధించింది. ఎన్సీపీ (41 సీట్లు) అధినేత శరద్‌ పవార్‌ వేగంగా స్పందించి బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటించారు. దాంతో ఫడ్నవీస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీతో బేరసారాలకు దిగొచ్చని ఆశించిన శివసేన ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. తర్వాత ప్రభుత్వంలో చేరినా ఎన్సీపీ కారణంగా శివసేన బేరమాడే శక్తి తగ్గింది. మొదట్లో ఐదు మంత్రి పదవులు ఇచ్చిన బీజేపీ... బిహార్‌ ఎన్నికల ఓటమి తర్వాత శివసేన నుంచి మరో ఇద్దరికి అవకాశం ఇచ్చింది. వాస్తవానికి మహారాష్ట్రలో ఎప్పుడూ శివసేనదే పెద్దన్న పాత్ర. వీరి సంకీర్ణం అధికారంలో ఉన్నపుడు కూడా శివసేనకు చెందిన మనోహర్‌ జోషి, నారాయణ్‌ రాణేలను సీఎంలుగా చేశారు. అలాంటిది శివసేనకు తమ ప్రాధాన్యం తగ్గడం మింగుడు పడటం లేదు. పైగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇద్దరూ బెదిరింపులకు లొంగేరకం కాదు. ప్రభుత్వంలో చేరినా, బీజేపీ నిర్లక్ష్య ధోరణితో శివసైనికులు లోలోపల కుతకుతలాడిపోతున్నారు. 

 

పెరిగిన దూరం

ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే శివసేన... బీజేపీతో చాలా అంశాల్లో విభేదించింది. ప్రధాని మోదీ నిర్ణయాలపై బహిరంగంగానే విరుచుకుపడింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, సర్జికల్‌ స్ట్రైక్స్.. ఇలా పలు అంశాల్లో మోదీ నిర్ణయాన్ని తమ పత్రిక ‘సామ్నా’లో శివసేన తూర్పారబట్టింది. ఎన్డీయే భాగస్వామిగా కేంద్రంలో అధికారం పంచుకుంటున్నా ఏనాడూ మిత్రధర్మం పాటించలేదు. నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించిన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో శివసేన గొంతు కలిపింది. పాటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌తో గుజరాత్‌లో కలిసి వెళ్తామనే సంకేతాలు ఇవ్వడం, గోవాలో బీజేపీకి వ్యతిరేకంగా మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీతో జట్టుకట్టి పోటీ చేయడం... ఇరుపార్టీల మధ్య పెరుగుతున్న దూరాన్ని సూచించేవే. బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లో (మంగళవారం పోలింగ్‌ జరుగుతుంది) సీట్ల పంపకం కుదరక ఇరుపార్టీలు వేరువేరుగా పోటీచేస్తున్నాయి. గడిచిన 20 ఏళ్లుగా బీఎంసీలో శివసేనదే అధికారం. తమకు పెట్టని కోటగా ఉన్న ముంబై మీద బీజేపీ కన్నేయడం శివసేనకు రుచించలేదు. దీంతో ఒకరిపై మరొకరు ఆరోపణలకు దిగారు. దూషణల పర్వం మొదలైంది. ఫడ్నవీస్‌ను మిడిమిడి జ్ఞానం కలిగిన మూర్ఖుడిగా ఉద్ధవ్ ఠాక్రే అభివర్ణించగా... శివసేన మామూళ్లు వసూలు చేసే పార్టీ అని మహారాష్ట్ర బీజేపీ ధ్వజమెత్తింది. ఫడ్నవీస్‌ ప్రభుత్వం నుంచి ఏ క్షణాన్నైనా వైదొలుగుతామని ఉద్ధవ్‌ ప్రకటించారు. అయినా బీజేపీ దూకుడు తగ్గలేదు. శివసేనపై ముప్పేటదాడికి దిగింది. అవినీతిలో కూరుకుపోయిన బీఎంసీలో అభివృద్ధి చేసి చూపెడతామని ఫడ్నవీస్‌ ఓటర్లకు హామీ ఇచ్చారు.

 

శివసేన... చెప్పింది చేస్తుందా?

2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీచేస్తామని శివసేన ప్రకటించింది. కాబట్టి సందర్భం చూసి ప్రభుత్వం నుంచి వైదొలిగి సొంతబలం పెంచుకోవడంపై దృష్టి సారిస్తే పూర్వ వైభవాన్ని సాధించగలమని విశ్వసిస్తోంది. అయితే ప్రస్తుతం ముంబైతో పాటు మరో తొమ్మిది కార్పొరేషన్లు, 26 జిల్లా పరిషత్‌లకు జరిగే ఎన్నికల ఫలితాలు ఈనెల 23న రానున్నాయి. పట్టణ, గ్రామీణ ఓటర్ల నాడి వీటిద్వారా తెలుస్తుంది కాబట్టి, వీటిలో మంచి ఫలితాలు సాధిస్తే శివసేన వెంటనే ప్రభుత్వం నుంచి వైదొలుగుతుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఒకవేళ ముంబై కార్పొరేషన్‌లో (మొత్తం 227 స్థానాలు) సొంత మెజారిటీ రాక... బీజేపీ మీద ఆధారపడాల్సి వస్తే మాత్రం బలవంతపు కాపురం తప్పదు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతే కూడా శివసేన స్వరం పెరుగుతుంది,  మరిన్ని డిమాండ్లు ముందుకు తేవొచ్చు.

 

ఎన్సీపీ మాటపై నిలబడుతుందా?

శివసేన వైదొలిగితే... ఫడ్నవీస్‌ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని, మధ్యంతర ఎన్నికలకే మొగ్గుతామని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ ఈనెల 18న నొక్కిచెప్పారు. ప్రజల మద్దతు కోల్పోయిన ఫడ్నవీస్‌ ప్రభుత్వం కూలిపోవడమే తమకు కావాలన్నారు. అయితే అవకాశవాద రాజకీయాలకు పేరుపడ్డ ఈ రాజకీయ దురంధరుడు ఎంతవరకు మాటపై నిలబడతారనేది ప్రశ్నార్థకం. గతంలో ఎన్డీయేతో అధికారం పంచుకున్న పవార్‌... తర్వాత యూపీఏ పంచన చేరారు. 2014లో ఫడ్నవీస్‌ ప్రభుత్వానికి బయటినుంచి బేషరతు మద్దతు ఇచ్చారు. పైగా ప్రధాని మోదీతో పవార్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. పవార్‌ కూతురు సుప్రియా సూలే నియోజకవర్గం బారామతికి ప్రధాని వచ్చివెళ్లారు. ఇటీవలే కేంద్రం ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే పవార్‌ చెప్పింది ఎంతవరకు చేతల్లో చూపుతారనేది రాజకీయ పండితుల సందేహం.

 

ఫడ్నవీస్‌ ధీమా ఏంటి?

వైదొలుగుతామని శివసేన, మద్దతు ఇవ్వబోమని ఎన్సీపీ ప్రకటించినా... సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మాత్రం ధీమాగానే ఉన్నారు. ఈ రెండు పార్టీలు దూరంగా ఉండే పరిస్థితి వస్తే ఫడ్నవీస్‌కు మరో 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం 145. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని కూడగట్టడం ఏమంత పెద్ద పని కాదని శనివారం ఫడ్నవీస్‌ స్వయంగా అన్నారు. చిన్నాచితకా పార్టీలకు 13 మంది, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. అలాకాకుండా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ఎమ్మెల్యేలకు అవసరమైన పక్షంలో వల వేసే స్థితిలో ఫడ్నవీస్‌ ఉన్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కేంద్రం అండ ఎటూ ఉంటుంది. ఎన్నికలకు మరో రెండేళ్లు ఉన్నందువల్ల ఇప్పుడే శివసేన ప్రభుత్వం నుంచి వైదొలగదనేది ఫడ్నవీస్‌ అంచనా. ఒకవేళ వైదొలిగితే ... శివసేన ఎమ్మెల్యేలకే మంత్రి పదవుల ఎరవేసి చీలిక తెచ్చే యోచనలో కమలం శిబిరం ఉంది. చీటికి మాటికి బెదిరింపులకు దిగే శివసేనను దెబ్బకొట్టి మహారాష్ట్రలో బీజేపీ ఆధిపత్య రాజకీయాలను నడపాలనే దీర్ఘకాలిక వ్యూహంతో ఉంది కాబట్టే మిత్రపక్షంతో అమీతుమీకి సిద్ధమైందనే వాదన కూడా ఉంది. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయనేది... ఈ నెల 23న వెలువడే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంది. 

 

మహారాష్ట్ర అసెంబ్లీలో బలాబలాలు












పార్టీ                         

స్థానాలు

బీజేపీ                        

122

శివసేన                        

63

కాంగ్రెస్‌                       

42

ఎన్సీపీ                         

41

చిన్న పార్టీలు 

13

స్వతంత్రులు  

7

మొత్తం                      

288


– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top