వరద జలాల కోసమే ‘అనుసంధానం’

వరద జలాల కోసమే ‘అనుసంధానం’


రాష్ట్రాల నికర జలాల్లో వాటాకు నష్టంలేదు

నదుల అనుసంధాన కమిటీ సభ్యుడు వెదిరె శ్రీరాం

బుధవారం ఢిల్లీలో కమిటీ తొలి సమావేశం




సాక్షి, హైదరాబాద్: వరద, మిగులు జలాల వినియోగం కోసమే నదుల అనుసంధాన ప్రతిపాదన తెరపైకి వచ్చిందని జాతీయ నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు వెదిరె శ్రీరాం పేర్కొన్నారు. నదీజలాల వినియోగం, నికర జలాల్లో రాష్ట్రాలకు ఉన్న హక్కులను, వాటాలను పరిరక్షిస్తూనే వరద జలాలను వినియోగించుకోవడం నదుల అనుసంధానం లక్ష్యమన్నారు. దీనిపై రాష్ట్రాలకు అవగాహన కల్పించి, ఒప్పించి, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడానికి నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని చెప్పారు.



దేశంలోని అన్ని నదులకు కలిపి 30 ప్రాంతాల్లో నదులను కలిపే అవకాశమున్నట్టుగా కేంద్రం గుర్తించిందని, నదుల అనుసంధాన ప్రక్రియ 1980-90 దశకంలోనే చర్చకు వచ్చిందని, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు సాంకేతిక అంచనాలు కూడా తయారయ్యాయని వివరించారు. పార్టీ నేతలు కుమార్‌రావు, దాసరి మల్లేశంతో కలసి హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో నంబర్‌వన్‌గా ఎదగడానికి భారత్ పోటీపడుతున్న క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో వరదలతో తీవ్ర నష్టం జరుగుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో తీవ్ర కరువు, వర్షాభావ పరిస్థితులు నెలకొనడం ప్రతిబంధకంగా మారుతోందని చెప్పారు.



అస్సాం, బిహార్ వంటి రాష్ట్రాలు ప్రతి ఏటా ముంపునకు గురవుతున్నాయన్నారు. తెలంగాణతోపాటు విదర్భ, రాజస్థాన్, రాయలసీమ కరువుతో సాగునీటికే కాక తాగునీటికి కూడా అల్లాడిపోయే పరిస్థితి ఉందని శ్రీరాం వివరించారు. బ్రహ్మపుత్ర, గంగా నదుల్లో నీటి లభ్యత ఎక్కువ ఉన్నా కరువు ఉన్న రాష్ట్రాల్లో వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వరదలకు, కరువు కాటకాలకు ఏకైక పరిష్కార మార్గం నదుల అనుసంధానమని శ్రీరాం పేర్కొన్నారు.



గతంలో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం 10 కోట్ల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరందించడానికి, 30 వేల మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి 30 లింకులను ప్రతిపాదించినట్టుగా వివరించారు. దీనికి రూ. 4.5 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అప్పడు అంచనాలు తయారయ్యాయని, యూపీఏ ప్రభుత్వం దీనిని పదేళ్లపాటు పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం తెరపైకి వచ్చిందన్నారు.



2004లో రూపొందించిన లింకుల్లో అవసరమైన మార్పుచేర్పులు ఉంటాయన్నారు. నదుల అనుసంధాన ప్రక్రియకు నిధుల సమీకరణ ఎలా, పెట్టిన పెట్టుబడుల ప్రయోజనం ఎంత మేరకు ఉంటుంది, ఖర్చుకు తగిన ప్రతిఫలం ఉంటుందా అనేదానిపై కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. వీటితో పాటు పర్యావరణ, సామాజిక ప్రభావం, సహాయ పునరావాస కార్యక్రమాల వంటివాటిపైనా అధ్యయనం చేస్తామన్నారు. సుప్రీంకోర్టు కూడా నదుల అనుసంధానం చేయాలని సూచనలు చేసిందని, ప్రతీ రెండు వారాలకు ఒకసారి దీనిపై నివేదికను కూడా కోరుతోందని చెప్పారు.



ఒక రాష్ట్రంలోనే నదుల పరీవాహక ప్రాంతాల మధ్య అనుసంధానం, రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానం వంటి వాటిపై ఇంకా చర్చించాల్సి ఉందన్నారు. నికర జలాల్లో రాష్ట్ర వాటాలో ఒకచుక్క కూడా తగ్గించకుండా ముంపు బారిన పడకుండా వరద నీటిని తీసుకుపోతామంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చునని శ్రీరాం ఆశాభావం వ్యక్తం చేశారు. టాస్క్‌ఫోర్సు కమిటీ తొలి సమావేశం ఢిల్లీలో బుధవారం జరుగుతుందన్నారు. వీలైనంత తొందరలోనే నదుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభమవుతుందని శ్రీరాం వెల్లడించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top