మరణశిక్షను రద్దు చేయాలి!

మరణశిక్షను రద్దు చేయాలి! - Sakshi


సత్వరమే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి

* లా కమిషన్ సిఫార్సు; ఉగ్ర నేరాలకు మినహాయింపు

* ఉరి శిక్ష రద్దు సరికాదన్న కమిషన్ సభ్యురాలు జస్టిస్ ఉషా మెహ్రా

న్యూఢిల్లీ: మరణ శిక్షను రద్దు చేయాలని లా కమిషన్ సిఫారసు చేసింది. అత్యంత అరుదైన కేసుల్లో సైతం మరణ శిక్ష విధించడం రాజ్యాంగపరంగా సమర్థనీయం కాదని తేల్చిచెప్పింది. ఆ శిక్ష  జీవితఖైదును మించిన ఫలితం ఇవ్వబోదని పేర్కొంది.



అయితే, ఉగ్రవాద కేసులు, దేశంపై యుద్ధం ప్రకటించిన నేరాలకు మాత్రం ఉరిశిక్ష విధించడాన్ని సమర్థించింది. ఉరిశిక్షను రద్దు చేయాలా? కొనసాగించాలా? అనే విషయంపై విస్తృత, సమగ్ర సంప్రదింపుల తర్వాత 20వ లా కమిషన్ సోమవారం తుది నివేదిక విడుదల చేసింది. లా కమిషన్‌లోని మెజారిటీ సభ్యులు ఉరిశిక్ష రద్దుకు మొగ్గు చూపగా, కమిషన్‌లోని శాశ్వత సభ్యుల్లో ఒకరైన రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ ఉషా మెహ్రాతో పాటు ప్రభుత్వ ప్రతినిధులైన ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు పీకే మల్హోత్ర(న్యాయ శాఖ కార్యదర్శి), సంజయ్ సింగ్(లెజిస్లేటివ్ సెక్రటరీ) మాత్రం ఉరిశిక్షను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు.



తమ భిన్నాభిప్రాయాన్ని నివేదికలో పొందుపర్చారు. మరణశిక్షను కొనసాగించడం రాజ్యాంగపరమైన క్లిష్టమైన ప్రశ్నలను సంధిస్తోందని కమిషన్ నివేదికలో పేర్కొన్నారు. న్యాయం జరగకపోవడం, న్యాయప్రక్రియలో పొరపాట్లు దొర్లడం, నేరన్యాయ వ్యవస్థలో న్యాయసేవలు పొందలేని పేదలు, బడుగు వర్గాల దుస్థితి.. మొదలైన ప్రశ్నలను ఉరిశిక్ష కొనసాగింపు లేవనెత్తుతోందని అన్నారు.  



ఉరిశిక్షను రద్దు చేయడం అత్యవసరమేనన్న కమిషన్.. ఆ ప్రక్రియ ఎలా జరగాలనేదానిపై కచ్చితమైన, స్పష్టమైన పద్ధతిని సూచించలేదు. స్వచ్ఛంద నిషేధం (మారటోరియం) విధించడం నుంచి ఉరిశిక్ష రద్దుకు సంబంధించి సమగ్రబిల్లును రూపొందించడం వరకు చాలా మార్గాలున్నాయంది. వీటిలో ప్రత్యేకంగా ఏ మార్గాన్నీ తాము సిఫారసు చేయడం లేదన్న కమిషన్.. సత్వర, పూర్వ స్థితికి తీసుకువచ్చే వీళ్లేని, పూర్తి స్థాయి రద్దును మాత్రం సిఫార్సు చేస్తున్నామని పేర్కొంది. ఏ పద్దతిలో ఉరిని రద్దు చేయాలనే విషయంపై అతి త్వరలో కూలంకష చర్చ జరగాలని సూచించింది.



ఉగ్రవాద నేరాలకు ఉరిశిక్ష సమర్థనీయమన్న కమిషన్.. ఉగ్రవాదాన్ని ఇతర నేరాల నుంచి వేరుపర్చే స్పష్టమైన విభేదాంశం శిక్షాస్మృతిలో లేదని పేర్కొంది. జాతీయ భద్రతకు సంబంధించి దీన్ని మరణ శిక్షకు అర్హమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. ఉరిశిక్షకు సంబంధించి పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యక్తపర్చిన అభిప్రాయాలను నివేదికలో పొందుపర్చారు. మరణశిక్ష విధించిన నేరాలకు.. ప్రత్యామ్నాయ జీవిత ఖైదు పడిన నేరాలకు మధ్య తేడాలను గుర్తించడం కష్టమన్న  సుప్రీం అభిప్రాయాన్ని గుర్తు చేశారు.



క్షమాభిక్ష ప్రకటించే విషయంలో కార్యనిర్వాహక వ్యవస్థ చేసిన పొరపాట్లను, లోపాలను, న్యాయపర తప్పులను పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఎత్తి చూపిన విషయాన్ని ప్రస్తావించారు. నిబంధనల ఉల్లంఘన, విచక్షణను సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల క్షమాభిక్ష ప్రక్రియ బలహీనపడిందని, దాంతో మరణశిక్షను సమర్థించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. క్షమాభిక్ష విషయంలో అర్హులను కాపాడటంలో చట్టంలోని రక్షణ మార్గాలు విఫలమయ్యాయని అన్నారు.

 

ఉరి రద్దు వద్దు.. దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే.. అత్యంత హేయమైన నేరాలకు ఉరిశిక్ష విధించడంపై సంపూర్ణ నిషేధం విధించడం సరైన చర్య కాదన్న అభిప్రాయం కలుగుతోందని జస్టిస్ ఉషా మెహ్రా పేర్కొన్నారు. అత్యంత హేయమైన నేరాల్లో మాత్రమే ఉరిశిక్ష విధించాలని గొప్ప విజ్ఞతతో పార్లమెంటు నిర్ణయించిందని, ఆ శిక్షను కొనసాగించడమే ఉత్తమమని న్యాయశాఖ కార్యదర్శి పీకే మల్హోత్రా అభిప్రాయపడ్డారు.



అత్యంత చైతన్యశీల న్యాయవ్యవస్థ కలిగిన భారతదేశంలో న్యాయమూర్తులు గొప్ప విచక్షణతో, అర్హత కలిగిన నేరాలకు మాత్రమే మరణ శిక్ష విధిస్తున్నారని, వారి విజ్ఞతను గౌరవించాలని, అందువల్ల ఉరి శిక్ష రద్దు అవసరం లేదని లెజిస్లేటివ్ సెక్రటరీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. లా కమిషన్‌లో ఒక చైర్మన్, ముగ్గురు శాశ్వత సభ్యులు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు, ముగ్గురు తాత్కాలిక సభ్యులు.. మొత్తం 9 మంది సభ్యులుంటారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top