నా హీరో నన్ను వీడిపోయారు...’

నా హీరో నన్ను వీడిపోయారు... - Sakshi


‘‘ఏంటోయ్ నువ్వు బాగానే ఉన్నావా?’ ఆయన నాతో అన్న చివరి మాటలు.. అంతలోనే ఆయన నన్ను విడిచి వెళ్లిపోతారని అనుకోలేదు. నా జీవితంలో ఇంతకంటే దుర్దినం మరొకటి రాదేమో.. నా గురువు, మార్గదర్శకుడు, మిత్రుడు, తండ్రిలాంటి వాడు ఒక్క మాటలో చెప్పాలంటే నా హీరో నన్ను వీడిపోయారు..’ కలాం సలహాదారు.. చివరి క్షణాల్లో ఆయన వెంటే ఉన్న సృజన్‌పాల్ సింగ్ ఆవేదన ఇది. కలాంతో తన చివరి ప్రయాణ జ్ఞాపకాలను సృజన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.... ‘‘అప్పుడే 8 గంటలైపోయింది ఆయనతో చివరగా మాట్లాడి.. నిద్ర రావటం లేదు.. జ్ఞాపకాలు ముప్పిరిగొంటున్నాయి. కన్నీళ్లు ఆగడం లేదు. గువాహటి విమానంలో మాకు కేటాయించిన సీట్లలో కూర్చోవటంతో జూలై 27 మధ్యాహ్నం 12 గంటలకు మా ప్రయాణం ప్రారంభమైంది. కలాం 1ఏ సీట్లో కూర్చున్నారు.



నేను 1సీ నంబర్ సీట్‌లో కూర్చున్నాను. సర్ ముదురు రంగు ‘కలాం సూట్’ను ధరించారు. సూట్ కలర్ చాలా బాగుందని ప్రశంసించాను. కానీ అదే ఆయన ధరించే చివరి సూట్ అవుతుందనుకోలేదు. చల్లని వాతావరణంలో రెండున్నర గంటల ప్రయాణం. నాకు ఏదైనా సమస్యలంటే పడదు. వాటిని ఎదుర్కోవటంలో ఆయన మాస్టర్. విమానంలో నేను చలితో వణికిపోతే.. ఆయన విమానం కిటికీ తీసి ఇప్పుడు నీకెలాంటి భయం ఉండదు అనేవారు. గువాహటిలో ల్యాండ్ అయ్యాక షిల్లాంగ్ ఐఐఎంకు కారులో వెళ్లటానికి మరో రెండున్నర గంటల ప్రయాణం. ఈ దీర్ఘమైన ప్రయాణాలలోఅయిదు గంటలు ఆయనతో మాట్లాడాను.. చర్చించాను. ఆయనతో ప్రతి ప్రయాణం.. ప్రతి చర్చా ఒక ప్రత్యేకమైందే. ఈ ప్రయాణంలో జరిగిన చర్చ మరీ ప్రత్యేకమైంది.



 పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడిపై కలాం ఆందోళన వ్యక్తం చేశారు. షిల్లాంగ్ ఐఐఎంలో మాట్లాడాల్సిన ‘జీవించటానికి అనుకూల గ్రహంగా భూమి’ అన్న విషయంపై చర్చించాం. హింస, కాలుష్యం, నిర్లక్ష్యం మరో 30 ఏళ్లు ఇలాగే కొనసాగితే.. మనం భూమిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. ‘‘పార్లమెంట్ సమావేశాలు తరచూ ప్రతిష్టంభనకు గురవుతున్నాయి.. ఇది సరికాదు.


 


అభివృద్ధి రాజకీయాల కోసం పార్లమెంటు సజావుగా సాగేలా క్రియాశీలక మార్గాలు కనుక్కోవాలి. షిల్లాంగ్ ఐఐఎం విద్యార్థులకు ఈ అసైన్‌మెంట్ ఇస్తా’’నని కలాం అన్నారు. ఉపన్యాస మందిరానికి చేరుకున్న తరువాత విద్యార్థులను వేచి చూడనివ్వవద్దు అనటంతోనే నేను వెంటనే ఆయనకు మైక్ సెట్ చేశాను. మైక్ పిన్ చేయటంతోనే ‘‘ఏంటోయ్ నువ్వు బాగానే ఉన్నావా?(ఫన్నీ గయ్! ఆర్ యూ డూయింగ్ వెల్?) అన్నారు. ఈ మాట కలాం అన్నారంటే ఆయన స్వరం తీరును బట్టి చాలా ఆర్థాలు ఉంటాయి. నువ్వు బాగా చేశావని కావచ్చు.. ఏదో మిస్సయ్యావనీ కావచ్చు.. ఈ మాట అనగానే నేను నవ్వుతూ ‘యస్’ అన్నాను.. ఆయన ప్రసంగం రెండు నిమిషాలు సాగింది. నేను ఆయన వెనుకే కూర్చున్నా.. ఒక వాక్యం తరువాత ఆయన నుంచి ఒక సుదీర్ఘమైన నిట్టూర్పును విన్నాను. నేను ఆయన్ను చూస్తూనే ఉన్నా.. ఆయన ఒక్కసారిగా పడిపోయారు. వెంటనే ఆయన్ను పట్టుకుని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాం. ఒక చేతిలో ఆయన తల పట్టుకున్నాను. ఆయన చేతులు నా చేతి వేళ్లను గట్టిగా పట్టుకుని ఉన్నాయి.



ఆయన ఒక్కమాట మాట్లాడలేదు. నొప్పి ఉన్నట్లు కనిపించలేదు. మూడు వంతులు మూసుకుని.. నన్నే చూసిన ఆ కళ్లను నేనెప్పటికీ మరచిపోలేను. అయిదు నిమిషాలలో ఆసుపత్రికి తరలించాం.. మరి కొన్ని నిమిషాల్లో భారత క్షిపణి పితామహుడు వెళ్లిపోయినట్లు తెలిపారు. నేను ఆయన పాదాలకు చివరి నమస్కారం చేశాను. కలాం ఒకసారి నన్నోమాట అడిగారు. నిన్ను ప్రజలు ఎలా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటావు..అని.. అదే ప్రశ్నను నేనాయన్ను అడిగాను.. ‘రాష్ట్రపతిగానా, శాస్త్రవేత్తగానా, రచయితగానా, క్షిపణి పితామహుడిగానా, ఇండియా 2020గానా, టార్గెట్ 3బిలియన్‌గానా..? అని ఆయన ఒకే మాట చెప్పారు. ‘టీచర్‌గా’ అని. ఆయన అనుకున్నట్లుగానే ఆయన తుది ప్రయాణం టీచర్‌గానే విద్యార్థులకు బోధన చేస్తుండగానే సాగిపోయింది. మనిషి వెళ్లిపోయాడు. కానీ ఆయన మిషన్ కొనసాగుతుంది. లాంగ్‌లివ్ కలాం.    మీకు రుణపడిన విద్యార్థి

 సృజన్‌పాల్‌సింగ్

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top