గోదావరి జలాల వినియోగానికి లైడార్ సర్వే

గోదావరి జలాల వినియోగానికి లైడార్ సర్వే


కరీంనగర్ ఎన్టీపీసీ కేంద్రం నుంచి ప్రారంభమైన సర్వే

- తొలిరోజు హెలికాప్టర్‌లో 8 కి.మీ. ప్రయాణం

- గగనతలంలో వ్యూ పాయింట్ల ఎంపిక

- 15 రోజులపాటు సాగనున్న సర్వే

గోదావరిఖని/జ్యోతినగర్:
గోదావరి మిగులు జలాలు సముద్రంలో కలవకుండా పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకోవాలనే ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చింది. ఇందుకోసం ప్రాథమికంగా రాష్ట్రంలో నది ప్రవహించే ప్రాంతంలో ఎక్కడెక్కడ నీటి లభ్యత ఉందనే విషయాలను కనుగొనే పనిలో పడింది. నీటి లభ్యత, ప్రాజెక్టుల నిర్మాణానికి అనువైన ప్రాంతాల వివరాలతో పాటు వివిధ ప్రాంతాలకు గోదావరి నీటిని తాగు, సాగుకు తరలించేందుకు అనుగుణంగా మార్గాలనూ ప్రభుత్వం అన్వేషించనుంది. ఈ నేపథ్యంలో ‘లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (లైడార్)’ విధానం ద్వారా గురువారం జీఎంఆర్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రత్యేక హెలిక్యాప్టర్‌తో సర్వే నిర్వహించారు.



కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ కేంద్రం నుంచి ప్రారంభమైన ఈ సర్వే 8 కి.మీ. దూరం వరకు సాగింది. ఇంజనీర్లు గగనతలంలో వ్యూపాయింట్లను ఎంపిక చేసుకుని వచ్చినట్టు సమాచారం. వాటర్, పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెన్సీ (వ్యాప్కోస్) ప్రతినిధులు వేణుగోపాల్‌రావు, మహేష్, జర్మనీకి చెందిన లైడార్ ఇంజనీర్ ఆలీవర్, నీటిపారుదల శాఖకు చెందిన ఇంజనీర్ ఈ సర్వేను చేపడుతున్నారు. ఈ సర్వేకు రూ.14 కోట్ల విలువైన పరికరాలను ఉపయోగిస్తున్నట్లు జీఎంఆర్ గ్రూప్ ప్రాజెక్టు మేనేజర్ పళణి స్వామి, డీజీఎం బాలకోటేశ్వరబాబులు తెలిపారు.



రాష్ట్ర ప్రభుత్వం లైడార్ సర్వే చేయడానికి రక్షణ శాఖ నుంచి అనుమతులు పొందిందని, ఆరు నెలలు అవసరమయ్యే ఈ సర్వేను 15 రోజుల్లో పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్‌ఈ ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రక్షణ శాఖకు సర్వే లక్ష్యాలకు సంబంధించిన వివరాలను అందజేసి, మిగతా సమాచారాన్ని భద్రపరుస్తారని చెప్పారు. సర్వేకు రూ.5 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

 

సర్వే విధానం ఇలా..

గోదావరి నదిపై హెలికాప్టర్ ద్వారా అత్యాధునికమైన క్యూ680ఐ డిజిటల్ కెమెరా ద్వారా లేజర్ కిరణాల ప్రసారంతో దృశ్యాలను చిత్రీకరిస్తారు. హెలికాప్టర్ వెళ్తున్న మార్గం నుంచి నేలపై 5 కి.మీ. మేర వెడల్పు ఉండే ప్రాంతమంతా ఈ కెమెరాలో నిక్షిప్తమవుతుంది. దీనివల్ల నదిలో నీటి లభ్యత ఎంత లోతులో ఉందో తెలుసుకోవడంతో పాటు నేలపై ఉండే అతి చిన్న పరికరం కూడా స్పష్టంగా కనబడుతుంది. నది పొడవు, వెడల్పు, లోతు స్థాయిలను పరిశీలించి అక్కడున్న వాటిని జీపీఎస్ ద్వారా అనుసంధానం చేస్తారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top