ఈ ప్లాన్‌లు సరెండర్‌ చేస్తే..

ఈ ప్లాన్‌లు సరెండర్‌ చేస్తే..


నేను మూడు పాలసీలు తీసుకున్నాను. 2014లో మ్యాక్స్‌  లైఫ్‌ గెయిన్‌ ప్రీమియర్‌ను, 2016లో బీఎస్‌ఎల్‌–వెల్త్‌ యాస్పైర్‌ ప్లాన్‌ను, కోటక్‌ ప్రీమియర్‌ ఎండోమెంట్‌ ప్లాన్‌లు తీసుకున్నాను. ఈ ప్లాన్‌లు ఏవీ సరైన రాబడులు ఇవ్వడం లేదు. వీటిలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించమంటారా? వైదొలగమంటారా? ఒకవేళ వైదొలిగితే, వీటికి చెల్లించే ప్రీమియమ్‌లను మ్యూచువల్‌ ఫండ్స్‌లో  ఇన్వెస్ట్‌ చేయమంటారా?తగిన సలహా ఇవ్వగలరు.

– కుమార్, హైదరాబాద్‌



కోటక్‌ ప్రీమియర్, మ్యాక్స్‌  లైఫ్‌ గెయిన్‌ ప్రీమియర్‌.. ఇవి రెండూ ఎండోమెంట్‌ ప్లాన్‌లు. బిర్లా సన్‌లైఫ్‌  వెల్త్‌ యాస్పైర్‌ అనేది యులిప్‌(యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌  ప్లాన్‌) బీమా పరంగా, ఇన్వెస్ట్‌మెంట్‌ పరంగా కూడా ఎండోమెంట్‌ పాలసీలు కానీ, యులిప్‌లు కానీ మంచి రాబడులను ఇవ్వలేవు. వీటిని సరెండర్‌ చేయడమే సరైన నిర్ణయం. వీటిని సరెండర్‌ చేసిన తర్వాత టర్మ్‌  ఇన్సూరెన్స్‌పాలసీ తీసుకోండి. టర్మ్‌ బీమా పాలసీలో ప్రీమియమ్‌ తక్కువగా ఉంటుంది. ప్రయోజనాలు అధికంగా, బీమా కవరేజ్‌ అధికంగా ఉంటుంది. ఇక ఇన్వెస్ట్‌మెంట్‌ అవసరాల కోసం మంచి రేటింగ్‌ ఉన్న ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. కనీసం ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్‌ చేస్తే మీకు మంచి రాబడులు వస్తాయి. ఇక మీ ప్లాన్‌ల సరెండర్‌ వివరాలు చూద్దాం.. బీఎస్‌ఎల్‌ వెల్త్‌ యాస్పైర్‌: ఈ ప్లాన్‌కు  ఐదేళ్ల లాక్‌ ఇన్‌పీరియడ్‌ ఉంది. ఈ ప్లాన్‌ను మీరు సరెండర్‌ చేసినట్లయితే, సరెండర్‌ విలువ డిస్‌కంటిన్యూడ్‌ పాలసీ ఫండ్‌కు బదిలీ చేస్తారు. డిస్‌కంటిన్యూ చార్జీలను మినహాయించుకొని ఐదేళ్లు పూర్తయిన తర్వాత ఈ సొమ్ములను మీకు చెల్లిస్తారు. ఇక ఎండోమెంట్‌ ప్లాన్‌ల విషయానికొస్తే, వీటిని కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత గానీ వీటిని సరెండర్‌ చేయడానికి వీలు కాదు. మూడేళ్ల తర్వాత సరెండర్‌ చేస్తే, మీరు చెల్లించిన ప్రీమియమ్‌ల్లో 30 శాతం మొత్తం గ్యారంటీడ్‌ సరెండర్‌ వేల్యూగా లభిస్తుంది. ఈ పాలసీలను సరెండర్‌ చేయడం వల్ల మిగిలే ప్రీమియమ్‌లను మొత్తాలను మంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయండి. దీర్ఘకాలం పాటు మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే, మీరు పై మూడు ప్లాన్‌ల్లో నష్టపోయిన ప్రీమియమ్‌లను కూడా మీరు భర్తీ చేసుకోగలుగుతారు. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కలగలపకండి.



మీ వెబ్‌సైట్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ ఎన్‌ఏవీ విలువ గత ఏడాది నవంబర్‌ 18న రూ.29.83గా ఉండగా, అదే రోజు నా పోర్ట్‌ఫోలియోలో మాత్రం రూ.27.70గా ఉంది. లావాదేవీల ఫీజు కారణంగా ఎన్‌ఏవీలో ఈ తేడా ఉందా?

– సురేంద్ర, కాకినాడ



హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ అనేది హైబ్రిడ్‌ ఫండ్‌. ఈక్విటీ, డెట్‌ విభాగాలు ఈ ఫండ్‌లో ఉంటాయి. అంటే ఈ ఫండ్స్‌ నిధుల్లో 65–70 శాతం వరకూ ఈక్విటీలోనూ, మిగిలిన మొత్తాలను డెట్‌  ఇన్‌స్ట్రుమెంట్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తారు. ఇక ఎన్‌ఏవీ ధరలో తేడా గురించి... లావాదేవీల ఫీజు కారణంగా ఎన్‌ఏవీలో తేడా ఉండదు. మీరు నవంబర్‌ 18న ఒకే ఫండ్‌కు రెండు విభిన్నమైన ఎన్‌ఏవీలు చూశారు. వీటిల్లో ఒకటి రెగ్యులర్‌  ప్లాన్‌ కాగా, ఇంకొకటి డైరెక్ట్‌ ప్లాన్‌. రెగ్యులర్‌  ప్లాన్‌  ఎన్‌ఏవీ 27.70గా ఉండగా, డైరెక్ట్‌  ప్లాన్‌ ఎన్‌ఏవీ 29.83గా ఉంది. సాధారణంగా ఒకే ఫండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, రెగ్యులర్‌ స్కీమ్‌ ఎన్‌ఏవీ కన్నా, డైరెక్ట్‌  ఫండ్‌ ఎన్‌ఏవీ అధికంగా ఉంటుంది. ఇక మీ అత్యవసర నిధి అవసరాల కోసం లిక్విడ్‌ డెట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. మీరు ఎంచుకోవడానికి కొన్ని మంచి రేటింగ్‌ ఉన్న లిక్విడ్‌ ఫండ్స్‌.. ఎస్కార్ట్స్‌ లిక్విడ్‌ డైరెక్ట్‌ ప్లాన్, ఎస్కార్ట్స్‌ లిక్విడ్‌ ప్లాన్, ఇండియాబుల్స్‌ లిక్విడ్‌ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ ఇన్‌స్టా లిక్విడ్‌ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్, బరోడా పయనీర్‌ లిక్విడ్‌ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్, టారస్‌ లిక్విడ్‌ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్‌.



నా వయస్సు 80 సంవత్సరాలు. అత్యవసర నిధి(ఎమర్జన్సీ ఫండ్‌) నిమిత్తం కొంత సొమ్మును ఏదైనా ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. సరైన ఈక్విటీ ఫండ్‌ను సూచించండి.

– రామకృష్ణ, వరంగల్‌



అత్యవసర నిధి  నిమిత్తం ఇన్వెస్ట్‌ చేయడానికి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదు. కనీసం ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటేనే ఈక్విటీ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. అత్యవసర నిధి కోసం ఇన్వెస్ట్‌  చేసే సొమ్ము– మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకునేలా ఉండాలి. దీని కోసం  లిక్విడ్‌ డెట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. మీరు ఎంచుకోవడానికి కొన్ని మంచి రేటింగ్‌ ఉన్న లిక్విడ్‌ ఫండ్స్‌.. ఎస్కార్ట్స్‌ లిక్విడ్‌ డైరెక్ట్‌ ప్లాన్, ఎస్కార్ట్స్‌ లిక్విడ్‌ ప్లాన్, ఇండియాబుల్స్‌ లిక్విడ్‌ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ ఇన్‌స్టా లిక్విడ్‌ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్, బరోడా పయనీర్‌ లిక్విడ్‌ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్, టారస్‌ లిక్విడ్‌ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్‌



నా బీమా పాలసీ ల్యాప్స్‌  అయిపోయింది. ఇది నా సిబిల్‌ స్కోర్‌పై ఏమైనా ప్రభావం చూపుతుందా?

– రవి, హైదరాబాద్‌



సిబిల్‌ (క్రెడిట్‌  ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌) అనేది ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు, క్రెడిట్‌ కార్డ్‌ల చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, రికార్డ్‌లను నిర్వహిస్తుంది. ఏదైనా రుణం, క్రెడిట్‌ కార్డులు పొందడానికి సిబిల్‌ స్కోర్‌ ముఖ్యమైనది. ఒక వ్యక్తి రుణ చెల్లింపుల చరిత్ర ఎలా ఉంది ? చెల్లింపుల్లో ఎప్పుడైనా విఫలమయ్యాడా తదితర అంశాలు సిబిల్‌ స్కోర్‌లో తెలుస్తాయి. అంటే ఒక వ్యక్తి పరపతి చరిత్ర సిబిల్‌ స్కోర్‌ ఆధారంగానే ఆర్థిక సంస్థలు అంచనా వేస్తాయి. దీని ఆధారంగానే రుణాలను, క్రెడిట్‌ కార్డులను మంజూరు చేస్తాయి.  అయితే బీమా పాలసీ ల్యాప్స్‌ అయిపోతే దాని ప్రభావం సిబిల్‌ స్కోర్‌పై ఏ మాత్రం ఉండదు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top