కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి కలకలం

కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి కలకలం - Sakshi


గడ్డాలు, మీసాల వ్యాఖ్యలపై దుమారం

- పార్టీలో తనను దెబ్బతీసే యత్నాలు జరుగుతున్నాయని భావిస్తున్న మాజీ మంత్రి

- ఓడిపోతామని లీకులెలా ఇస్తారంటూ ఉత్తమ్‌పై మండిపాటు

- కఠినంగా వ్యవహరించాల్సిందే అంటున్న ఉత్తమ్‌ వర్గం

- అధిష్టానం ముందుకు నేతల పంచాయితీ!




సాక్షి, హైదరాబాద్‌:
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కార్యాచరణకు దిగాలనుకుంటున్న కాంగ్రెస్‌లో మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి గడ్డాలు, మీసాలు పెంచితే అధికారంలోకి రాలేమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని పార్టీ సీనియర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ వ్యవహారంపై పలువురు నేతలు అధిష్టానానికి నివేదికలను పంపినట్టుగా తెలుస్తోంది. దీంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



ఉత్తమ్‌ టీపీసీసీ చీఫ్‌గా నియమితులైనప్పట్నుంచీ కోమటిరెడ్డి ఆయనకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. బోగస్‌ సర్వేలు చేసుకుంటే ఎలా అధికారంలోకి వస్తామంటూ ఇటీవల ప్రశ్నించిన కోమటిరెడ్డి.. గతంలోనూ ఉత్తమ్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఉత్తమ్‌ను టీపీసీసీ అధ్యక్షుడిగా గుర్తించబోనంటూ నియామకం మరునాడే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కాలంలోనూ ఆయనతో విబేధిస్తూ వస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని, ఉత్తమ్‌ అసమర్థుడు అని విమర్శించడంతో గతంలో టీపీసీసీ క్రమశిక్షణా సంఘం కోమటిరెడ్డికి షోకాజ్‌ నోటీసును జారీ చేసిన సంగతి తెలిసిందే.



అసలేం జరిగింది?

గాంధీభవన్‌లో ఇటీవల జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు తనను రాజకీయంగా దెబ్బ తీయడానికేనని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై టీపీసీసీ రహస్యంగా సర్వే నిర్వహించి, నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాల పరిస్థితిపై వచ్చిన ఫలితాలు అంటూ ఆ సమావేశంలో ఉత్తమ్‌ వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీకి 55 అసెంబ్లీ సీట్లకు తగ్గకుండా వస్తాయని, కొంచెం కష్టపడితే 15–20 స్థానాలు వస్తాయని తేలినట్టుగా వివరించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌ బలహీనంగా ఉందని, వాటిలో కష్టపడాల్సి ఉంటుందని సర్వేలో వెల్లడైనట్టుగా పేర్కొన్నారు. పాత నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, భువనగిరి నియోజకవర్గాలు మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని సర్వేలో వచ్చినట్టుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నిహితులు మీడియాకు లీకు ఇచ్చినట్టుగా కోమటిరెడ్డి భావిస్తున్నారు. నకిరేకల్‌లో కాంగ్రెస్‌ ఓడిపోతుందని చెప్పడం ద్వారా కోమటిరెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టడానికి ఎత్తులు వేస్తున్నారని ఆయన సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు.



ఇలాగైతే టీఆర్‌ఎస్‌ను ఎలా ఎదుర్కొంటాం?

ఏవైనా ఇబ్బందులుంటే అంతర్గత సమావేశాల్లోనే, అధిష్టానం పెద్దల ఎదుటో తేల్చుకోకుండా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే ఎలా అని ఉత్తమ్‌ వర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉత్తమ్‌ నియామకం తర్వాత ఇప్పటికి మూడుమార్లు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఇదే ఆనవాయితీ కొనసాగితే టీఆర్‌ఎస్‌ను ఎలా ఎదుర్కొంటామని వారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో చీలిక తీసుకొచ్చే కుట్రలో భాగంగానే కోమటిరెడ్డి ఇలా మాట్లాడుతున్నారని ఉత్తమ్‌ అనుచరులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. మంత్రి హరీశ్‌ను కలిసిన తర్వాత ఇలా మాట్లాడటం కోమటిరెడ్డికి అలవాటుగా మారిందని మరికొందరు వ్యాఖ్యానించారు.



కోమటిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లకపోవచ్చు: దిగ్విజయ్‌సింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరతారని అనుకోవడం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. నియోజకవర్గస్థాయిలో జరుగుతున్న జన ఆవేదన సదస్సులలో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. టీపీసీసీలోని అంతర్గత సమస్యలన్నీ త్వరలోనే సమసిపోతాయన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల పనితీరు బాగాలేదని విమర్శించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top