చిట్టితల్లి జ్ఞానసాయి కోలుకుంది!

చిట్టితల్లి జ్ఞానసాయి కోలుకుంది!


సాక్షి, చెన్నై: చిట్టితల్లి జ్ఞానసాయి సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. చెన్నై గ్లోబల్ ఆస్పత్రి నుంచి చిన్నారిని మంగళవారం డిశ్చార్జ్ చేశారు.  తల్లిదండ్రులు రమణప్ప, సరస్వతిలతో కలిసి జ్ఞానసాయి బుధవారం స్వస్థలానికి వెళ్లనుంది. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలోని బత్తలాపురం రైల్వేస్టేషన్‌కు చెందిన ఎనిమిది నెలల జ్ఞానసాయి కాలేయవ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. తమ చిట్టితల్లికి మెరుగైన వైద్యం అందించే ఆర్థిక స్థోమత తమకు లేదని, కాబట్టి తనకు కారుణ్య మరణం ప్రసాదించేందుకు అనుమతి ఇవ్వాలని తండ్రి రమణప్ప కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై మీడియాలో వచ్చిన కథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.



చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించేందుకు చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆగస్టు మొదటివారంలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ మహ్మద్ రేల, డాక్టర్ నరేష్ షణ్ముగం నేతృత్వంలోని బృందం చిన్నారికి విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించింది. జ్జానసాయికి ఆమె తండ్రి రమణప్ప తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేశారు. శస్త్ర చికిత్స అనంతరం నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించారు. జ్ఞానసాయి కొంత కోలుకున్న అనంతరం ఆస్పత్రి ఆవరణలోనే బస ఏర్పాటు చేసి, అవుట్ పేషంట్‌గా ఇన్నాళ్లు వైద్య పర్యవేక్షణ అందించారు. ప్రస్తుతం చిట్టితల్లి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావడంతో మంగళవారం డిశ్చార్జ్ చేశారు.



నవంబర్ 18న మరోసారి ఆసుపత్రికి చిన్నారితో రావాలని, ఇన్‌ఫెక్షన్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు. కొంతకాలం పాటు నెలకు రూ.30 వేల వరకు విలువగల మందుల్ని చిన్నారికి వాడాల్సిన అవసరం ఉందని సమాచారం. అయితే, ఇందుకు అయ్యే ఖర్చును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించేనా అన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం జరిగిన శస్త్ర చికిత్సలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ శస్త్రచికిత్సకు యాభై లక్షల వరకు ఖర్చు జరిగినట్టుగా ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో బుధవారం ఉదయం చెన్నై నుంచి స్వస్థలానికి జ్ఞానసాయితో తల్లిదండ్రులు బయలు దేరనున్నారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top