సీఎం రేసులో లేను

సీఎం రేసులో లేను - Sakshi


ఇంకో పదేళ్లు కేసీఆరే: కేటీఆర్‌

- హరీశ్‌ కూడా ఇదే కోరుకుంటున్నారు

- నాన్నకు ఇంకా 64 సంవత్సరాలే..

- రాజకీయాల్లో ఈ వయసంటే.. యంగ్‌ అన్నట్టే

- హరీశ్‌తో గ్యాప్‌ లేదు.. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లరు

- జనహిత ప్రగతి సభలు యాదృచ్ఛికమే.. అందులో వేరే ఉద్దేశం లేదు

- లోకేశ్‌ నన్ను నాన్‌లోకల్‌ అన్నడు.. మరిప్పుడు ఎక్కడున్నడు?

- ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధం

- రాష్ట్రంలో మాకు ప్రత్యామ్నాయమే లేదు

- ముందస్తుకు మోదీ వెళ్లాలనుకుంటారు... మేం కాదు..

- మూడేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్య




సాక్షి, జగిత్యాల


‘‘ప్రస్తుతం ఈ రాష్ట్రానికి మొండిగా వెళ్లే వ్యక్తి అవసరం.. నాకు ఇప్పుడు సీఎం కావాలని లేదు.. మా నాన్నకు ఇంకా 64 ఏళ్ల వయసే.. రాజకీయాల్లో ఈ వయసు అనేది యంగ్‌.. సో కేసీఆర్‌ ఇప్పుడే తప్పుకోవాల్సిన అవసరం లేదు.. మరో పదేళ్లు కేసీఆరే సీఎం. హరీశ్‌రావు, నా మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదు.. హరీశ్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లరు. ఆయనా మరో పదేళ్లు కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారు..’’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తనయుడు, మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. జనహిత ప్రగతి సభలో పాల్గొనేందుకు సోమవారం జగిత్యాలకు వచ్చిన ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.



మూడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో సీఎం కేసీఆర్‌ ఎన్నో అద్భుతాలు చేశారని, ఆయన పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా జనహిత ప్రగతి సభలు పెట్టడం లేదని, యాదృచ్ఛికంగానే వీటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తనను సీఎం చేయడానికే ఈ సభలు పెడుతున్నారనుకోవడం కరెక్ట్‌ కాదని పేర్కొన్నారు. ‘‘పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉన్నప్పుడు జనంలోకి ఎక్కువగా వెళ్లేవాడిని. మున్సిపల్‌ శాఖకు వచ్చాక జనం నుంచి కాస్త దూరమయ్యా.. ప్రజలకు దగ్గరయ్యేందుకే సభలు నిర్వహిస్తున్నాం. మున్సిపాలిటీల్లో అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యేలు తమ వద్దకు రావాలని ఆహ్వానించారు. అందుకే ఒప్పుకున్నా. సబ్సిడీ ఇవ్వమంటే తిరోగమనమనేవారు. ఇప్పుడు మేం దాంట్లో కూడా మార్పులు తెచ్చాం’’అని కేటీఆర్‌ అన్నారు.



ఇక్కడ టీడీపీని క్లోజ్‌ చేసుకున్నట్టే..

‘‘లోకేశ్‌ ఏపీ కేబినెట్‌లో చేరగానే ఇక్కడ టీడీపీని క్లోజ్‌ చేసుకున్నాడని అర్థం. ఒకప్పుడు లోకేశ్‌ నన్ను నాన్‌ లోకల్‌ అన్నాడు.. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నడు’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమను వేలెత్తి చూపేందుకు ప్రతిపక్షాల వద్ద ఎలాంటి ఎజెండా లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరగదని, ఆరు నెలల్లో బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.



ముందస్తు ఎన్నికల కోసం బీజేపీ..

గ్రేటర్‌ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్‌నూ గెలిపించుకోలేని బీజేపీ.. తెలంగాణలో పాగా వేయాలని చూస్తోందంటూ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో కూడా గెలుస్తామని బీజేపీకి పూర్తి నమ్మకం లేదన్నారు. అందుకే ఆదివారం అక్కడ భారీ ర్యాలీ నిర్వహించారని చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగాలని బీజేపీ యోచిస్తోందని పేర్కొన్నారు. ‘‘ముందస్తుకు మోదీ వెళ్లాలనుకుంటున్నారు కానీ మేం కాదు.. ఎన్నికల ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఎవరొచ్చినా మాకు ఎదురు లేదు.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని సవాళ్లను అధిగమించాం. రాష్ట్రంలో మాకు ప్రత్యామ్నాయమే లేదు.. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దిక్కు లేదు. కాంగ్రెస్‌ అంటే జనానికి మొహం కొట్టింది’’అని కేటీఆర్‌ అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top