కొత్త ఉద్యోగులను నియమించండి: సీఎం కేసీఆర్

కొత్త ఉద్యోగులను నియమించండి: సీఎం కేసీఆర్ - Sakshi


హైదరాబాద్: కొత్త జిల్లాలకు అవసరమైనంత మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి శాఖలవారీగా, జిల్లాల వారీగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా విభాగాలు ఎలా ఉండాలనే విషయంపై అన్ని ప్రభుత్వ శాఖలు రెండు రోజుల్లో తమ ప్రతిపాదనలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించాలని సూచించారు. కొత్త జిల్లాల్లో పని విభజన, కొత్త ఉద్యోగుల నియామకం, పరిపాలనా విభాగాల ఏర్పాటు తదితర అంశాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన టాస్క్ ఫోర్సు్ను కూడా సీఎం ఏర్పాటు చేశారు. దసరా నుంచే కొత్త జిల్లాలను మనుగడలోకి తేవాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆలోపు లేదా కొద్దిగా అటుఇటుగా ఉద్యోగుల నియామకాలను కూడా ప్రకటిస్తే అది తెలంగాణలోని నిరుద్యోగులకు మంచి అవకాశంలానే భావించాలి.



సోమవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాపై, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాపై మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజలు నుంచి వస్తున్న సూచనలు, అభ్యంతరాలు, సలహాలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. దసరా నుంచే కొత్త జిల్లాలతో పాటూ, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు కూడా ప్రారంభం కావాలన్నారు. దీనికి సంబంధించి పాలనా విభాగాల కూర్పు వేగవంతం కావాలని సీఎం ఆదేశించారు.



తెలంగాణలో జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాడర్ మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నందున, ప్రస్తుతం జోనల్ అధికారులకు అన్యాయం జరగకుండా వారిని పోస్టుల్లో సర్దుబాటు చేయాలని కోరారు. వ్యవసాయం, వైద్యం, విద్య తదితర విభాగాల విషయాల్లో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాల ప్రాధాన్యతతో ఉద్యోగుల సర్దుబాటు జరగాలన్నారు. సూపర్ వైజరీ పోస్టుల కన్నా క్షేత్రస్థాయిలో పని చేసే ఉద్యోగులే ఎక్కువ అవసరం కాబట్టి, మండల స్థాయి అధికారులు, సిబ్బంది నియామకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఒకే రకమైన పనితీరు కలిగిన విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే అధికారిని నియమించడం సబబుగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.



సీఎస్ నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ

జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పరిపాలన విభాగాల కూర్పును పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శార్మ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ వేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సి.సి.ఎల్.ఎ. రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, వరంగల్, మెదక్ కలెక్టర్లు కరుణ, రోనాల్డ్ రాస్, సీఎంఓ అధికారులు శాంతికుమారి, స్మితా సభర్వాల్లు కమిటీ సభ్యులుగా ఉంటారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top