Alexa
YSR
‘తెలుగువారి గుండెచప్పుడు వినగలిగే ఆత్మీయుడిగా ఉంటే చాలు... నా జన్మ ధన్యమైనట్టే’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుకథ

మన పోలీస్‌ గ్రేట్‌

Sakshi | Updated: May 20, 2017 01:17 (IST)
మన పోలీస్‌ గ్రేట్‌

శాంతిభద్రతలు బ్రహ్మాండం: పోలీసుల సదస్సులో సీఎం కేసీఆర్‌
పోలీస్‌ శాఖను మరింత బలోపేతం చేస్తాం.. త్వరలోనే 15 వేల పోస్టుల భర్తీ
15 రోజుల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి.. కొత్త వాహనాల కోసం 500 కోట్లు
గుడుంబా, పేకాట, మట్కా, గుట్కా.. దందాలు నడవొద్దు.. కల్తీలపై ఉక్కుపాదం
మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌పై పొగడ్తల వర్షం.. ఇకపై ఏటా రెండుసార్లు భేటీలు


సాక్షి, హైదరాబాద్‌:
‘‘రాష్ట్ర శాంతి భద్రతలే కాకుండా దేశ భద్రతా వ్యవస్థకు దోహదపడేలా తెలంగాణ పోలీస్‌ పనిచేస్తోంది. యంగెస్ట్‌ స్టేట్‌ ఇన్‌ ఇండియా.. గ్రేటెస్ట్‌ పోలీస్‌ ఇన్‌ ఇండియాగా మారింది. రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం మరింత ముందుకెళ్లాలి.. మరిన్ని విజయాలు సాధించాలి’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అనేకసార్లు తెలంగాణ పోలీస్‌ అద్భుతంగా పనిచేస్తోందని మెచ్చుకున్నట్లు గుర్తుచేశారు. శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నందునే రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు. పోలీసులు పనితీరును మరింత మెరుగుపర్చుకుంటూ ఇంకా అనేక విజయాలు అందుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశచరిత్రలోనే తొలిసారిగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి డీజీపీ వరకు పోలీసు అధికారులతో శుక్రవారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం ప్రసంగించారు.

వాహనాలకు రూ.500 కోట్లు
పోలీస్‌ శాఖకు గతంలో కేటాయించిన నిధులతో నాలుగు వేల వాహనాలు, ఇతరత్రా అత్యాధునిక సౌకర్యాలు కల్పించామని, ఇంకా అవసరమైన వాహనాలు, పరికరాలు కొనుగోలు చేసేందుకు తక్షణమే మరో రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకు మంజూరు ఆదేశాలివ్వాలని సమావేశంలోనే ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను ఆదేశించారు. 806 పోలీస్‌స్టేషన్లు, 716 సర్కిల్స్, 162 సబ్‌ డివిజన్లు, 9 కమిషనరేట్లు ఉన్నాయని, వీటికి ఇంకా సౌకర్యాలు కావాలంటే ప్రతిపాదనలు స్వీకరించి ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భవిష్యత్తులో మరో 15 వేల మంది ఉద్యోగులను నియమించడంతోపాటు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు గ్రేడ్‌ను బట్టి నెలవారి ఖర్చుల కింద రూ.25 వేలు, రూ.50 వేలు, రూ.75 వేలు చెల్లిస్తున్నామన్నారు. కొత్త కమిషనరేట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు హైదరాబాద్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి లాగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఇందుకు అధికారులకు అవగాహన కల్పించాలని మహేందర్‌రెడ్డికి సూచించారు.

15 రోజుల్లో పదోన్నతులు
పోలీస్‌ శాఖలో అధికారులను మానసికంగా వేధించే సమస్య పదోన్నతుల విషయమేనని సీఎం అన్నారు. కానిస్టేబుల్‌ నుంచి నాన్‌ క్యాడర్‌ ఎస్పీ వరకు పదిహేను రోజుల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావాలని, ప్రస్తుతం మంజూరైన సూపర్‌న్యూమరీ పోస్టులతో పాటు ఇంకా కావాలంటే మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. హోంమంత్రి, హోం సెక్రటరీ, డీజీపీ, కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

మహిళ సిబ్బందికి మంచి ఏర్పాట్లు
‘‘నేను భూపాలపల్లి, ఖమ్మం ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో అక్కడి మహిళా పోలీస్‌ సిబ్బందిని సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నా. సౌకర్యాలపై కొంత అసంతృప్తిగానే ఉన్నట్లు వారు చెప్పారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో మహిళా సిబ్బందికి డైనింగ్‌ రూమ్, డ్రెస్సింగ్‌ రూమ్, రెస్ట్‌ రూమ్‌ ఉండాలి’’అని సీఎం ఆదేశించారు. ఇందుకు ఎంత ఖర్చవుతుందో ప్రతిపాదించి, ఆ కార్యక్రమాలను పర్యవేక్షించాలని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ మల్లారెడ్డిని ఆదేశించారు. హోంమంత్రి, డీజీపీ జిల్లాలు, కమిషరేట్ల పరిశీలన చేసి సిబ్బంది, అధికారులను కలసి వారి సమస్యలపై చర్చించాలన్నారు.

పదవీ విరమణ రోజే ప్యాకేజీ
35 ఏళ్ల పాటు పోలీస్‌ విభాగంలో పనిచేసి రిటైర్డ్‌ అయిన అధికారులు పెన్షన్‌ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి రానివ్వద్దని సీఎం స్పష్టంచేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పంచాయితీరాజ్‌ శాఖలో సీఈగా పనిచేసిన అధికారి రిటైర్మెంట్‌ తర్వాత పెన్షన్‌ కోసం తిరిగిన రోజులను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘ఏ జిల్లాల్లో అయినా, ఏ యూనిట్‌ అయినా పదవీ విరమణ పొందే రోజు నాటికి సంబంధిత అధికారికి రావాల్సిన పెన్షన్‌ వివరాలు, నగదు, ఇతరాత్ర సౌకర్యాలన్నింటిని ప్యాకేజీ కిందకు తేవాలి. గౌరవంగా శాలువా కప్పి, కుటుంబంతో ఆయన ఇంటి వద్ద ప్రభుత్వ వాహనంలో దింపేలా చర్యలు తీసుకోవాలి..’’అని డీజీపీని సీఎం ఆదేశించారు.

షీటీమ్‌ బ్యానర్‌తో 99 సీట్లు గెలిచాం
‘‘రాజకీయ పార్టీలు పోలీసులను ఉపయోగించుకోవడమే తప్ప వారి గురించి గొప్పగా మాట్లాడవు. కానీ టీఆర్‌ఎస్‌ అధికారుల పనితీరును ప్రశంసించి, దాన్నో ప్రచారాస్త్రంగా ఎన్నికల్లో వాడుకుంది. నగరంలో అదనపు కమిషనర్‌ స్వాతిలక్రా నేతృత్వంలో ఏర్పాటైన షీటీమ్‌ బ్యానర్‌ను ముందుపెట్టుకొని జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు పోయాం. 99 çసీట్లు గెలిచాం. ఇది దేశంలోనే ఎక్కడా జరగలేదు..’’అని సీఎం అన్నారు. పోలీస్‌ పేరు చెప్తే కూడా ఓట్లు వేశారంటే రాష్ట్ర పోలీస్‌ పనితీరుకు ప్రజలే మంచి మార్కులు వేస్తున్నారని కొనియాడారు.

వారిద్దరి సేవలు ప్రశంసనీయం
హైదరాబాద్‌ కమిషనరేట్, సైబరాబాద్‌ కమిషనరేట్‌.. పోటాపోటీగా పనిచేశాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘‘నకిలీ సర్టిఫికెట్ల కారణంగా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు ఆపేస్తామని ఓ సంస్థ నాకు చెబితే.. ఆ బాధను కమిషనర్‌ మహేందర్‌రెడ్డితో పంచుకున్నా. దీన్ని నియంత్రించాలని చెప్పా. ఆరు నెలల్లో నకిలీ సర్టిఫికెట్ల ముఠాలపై ఉక్కుపాదం మోపి శభాష్‌ అనిపించారు..’’అని కొనియాడారు. ఏ నేరం జరిగినా 24 గంటల్లో ఛేదించేలా సీసీటీవీలు, కమాండ్‌ సెంటర్, పెట్రోలింగ్‌.. ఇలా ప్రతీక్షణం పోలీస్‌ యంత్రాగాన్ని నడిపించడంలో మహేందర్‌రెడ్డి సక్సెస్‌ అయ్యారన్నారు. సైబరాబాద్‌ కమిషనర్‌గా పనిచేసిన సీవీ ఆనంద్‌ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తానంటే తానే ఆపానని సీఎం పేర్కొన్నారు. ఆయన ఏడాదిన్నర పాటు సివిల్‌ సప్లయ్‌ విభాగాన్ని పర్యవేక్షించి, ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వానికి రూ.850 కోట్లు ఆదా చేశారని ప్రశంసించారు.

కల్తీలపై ఉక్కుపాదం మోపండి..
కల్తీ పాలు, కల్తీ అల్లం, కల్తీ ఆయిల్‌.. ఇలా ప్రతీ దాన్ని కల్తీ చేస్తున్నారని, ఇలాంటి నేరాలపై ఉక్కుపాదం మోపాలని, ప్రత్యేక కార్యచరణ రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతీ మండలంలో పనిచేసే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌.. ఆ మండలం మొత్తం తన కుటుంబంగా భావించాలని సూచించారు. గుట్కా, మట్కా, గుడుంబా, పేకాట.. ఈ నాలుగు సమాజాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రెండోరోజే కమిషనర్‌ మహేందర్‌రెడ్డితో చర్చించిన మొదటి విషయమం ఇదేనని గుర్తుచేశారు. అటు సైబరాబాద్‌లోనూ ఆనంద్‌తో ఇదే విషయం చెప్పానన్నారు. దీంతో వారంరోజుల్లో ఒక్క పేకాట క్లబ్బు కూడా నడవకుండా అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పారు. గుడుంబా నియంత్రణలో కీలకంగా పనిచేసిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిషనర్, డీఐజీ అకున్‌ సబర్వాల్‌ను సీఎం ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఆయన కృషి వల్ల నేడు 99 శాతం గుడుంబా నియంత్రించగలిగామన్నారు. నకిలీ సర్టిఫికెట్ల విషయంలోనూ ఉక్కుపాదం మోపాలని సూచించారు. ప్రతీ జిల్లాలో ఎస్పీ నేతృత్వంలో జరిగే ‘క్రైమ్‌ మీటింగ్‌’పేరు మార్చాలని సీఎం సూచించారు. ‘‘పోలీసులంతా కూర్చొని క్రైమ్‌ మీటింగ్‌ పెట్టుకుంటరా? దొంగలు క్రైమ్‌ మీటింగ్‌ పెట్టుకుంటరు.. అందుకే పోలీసులు మరో పేరు పెట్టి సమీక్ష చేసుకోవాలి..’’అని అనడంతో సభలో నవ్వులు విరిశాయి.

సమావేశంలో సలహాల పెట్టె
ఎస్సైల నుంచి ఐపీఎస్‌ అధికారుల వరకు సలహాలు, సూచనలు, సమస్య లుంటే తెలపాలని సీఎం కేసీఆర్‌ పోలీ సుల సదస్సులో సూచించారు. ఎవరు ఎవరికీ భయపడనక్కర్లేదని, పేపర్‌పై రాసి సమావేశంలో ఏర్పాటు చేసిన సల హాల బాక్సులో వేయాలని సూచించారు. ఏ అధికారి పేరు రాయకుండా సమస్య లను మాత్రమే రాసి పలువురు ఈ బాక్స్‌ లో వేసినట్టు తెలిసింది. పదోన్నతులు, పోస్టింగులు, ఉన్నతాధికారుల వేధిం పులు, జీతాలు, అలవెన్సుల సమస్యలు, వాహనాల కేటాయింపులో జాప్యం.. తది తర అంశాలపై అధికారులు తమ సమస్య లను పేర్కొన్నట్టు తెలిసింది. అలాగే పోలీ స్‌ శాఖలో తీసుకురావాల్సిన మార్పులు, అంకితభావ సేవలకు చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాల కోసం గ్రూప్‌ డిస్కషన్‌ ఉం డాలని సీఎం సూచించారు. సమావేశానికి వచ్చిన ప్రతీ 25 మంది ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లు ఒక సీనియర్‌ అధికారి నేతృత్వంలో గ్రూప్‌గా ఏర్పడి, సూచనలు, సలహాలు, మార్గదర్శకాలు రాసి సలహాల పెట్టెలో వేశారు.  

ఇకపై ఏడాదికి రెండుసార్లు భేటీ..
ఇక నుంచి ఇలాంటి పోలీస్‌ కాన్ఫరెన్సులు ఏడాదికి రెండుసార్లు పెట్టాలని డీజీపీ అనురాగ్‌ శర్మను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అలాగే రెండు జోన్లలో ఇద్దరు ఐజీలు ప్రతీ మూడు నెలలకోసారి జోన్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల పోలీస్‌ సిబ్బంది, అధికారులు కలవడం, ఆలోచనలు, కార్యాచరణ పంచుకోవడం మంచిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్‌ పతకం, ప్రాసిక్యూషన్‌ విభాగం లోగోను సీఎం ఆవిష్కరించారు. పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన ఫొటో, ఆయుధ ఎగ్జిబిషన్‌ సందర్శించారు. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ జాగిలాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్‌ ఎస్పీ సింగ్, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మ, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, రోడ్‌ సేఫ్టీ డీజీపీ కృష్ణప్రసాద్, అదనపు డీజీపీ అంజనీకుమార్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అత్యున్నత విద్యావేదికగా రెడ్డి హాస్టల్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC