కవితా... హాట్సాఫ్!

కవితా... హాట్సాఫ్!


ముష్కర మూకలను మట్టుబెట్టే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను ఒకరయితే, తాను చనిపోతూ ముగ్గురికి జీవితాన్నిచ్చిన చిరంజీవి మరొకరు. వీరెవరో కాదు హేమంత్ కర్కరే, ఆయన సతీమణి కవితా కర్కరే. దేశం కోసం హేమంత్ ప్రాణాలు తృణప్రాయంగా ఆర్పించగా, ఆయన భార్య అనారోగ్యంతో చనిపోతూ ముగ్గురు ప్రాణాలు నిలబెట్టారు.



మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్గా వ్యవహరించిన హేమంత్ కర్కరే దేశ ఆర్థిక రాజధాని ముంబైపై దండెత్తిన దుర్మార్గులను తుదముట్టించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. 26/11 దాడిలో ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కర్కరే కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. హేమంత్ మరణించిన ఆరేళ్లకు ఆయన సతీమణి కవితను కానరాని దూరాలకు తీసుకుపోయింది, అవయవ దానం చేసి కవిత చిరంజీవిగా నిలిచారు.



కవితా కర్కరే- బ్రెయిన్ హెమరేజితో సెప్టెంబర్ 29న ముంబైలో కన్నుమూశారు. అయితే కవిత ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఆమె అవయవాలను దానం చేయడానికి అంగీకరించి పెద్ద మనసు చాటుకున్నారు. త్యాగనిరతిలో తమ తల్లిదండ్రులకు తగినవారమని నిరూపించుకున్నారు. కవిత రెండు మూత్రపిండాలను ఇద్దరికి అమర్చారు. కాలేయాన్ని 49 ఏళ్ల రోగికి అమర్చారు. ఆమె కళ్లను ఐబ్యాంకుకు దానం చేశారు.



కర్కరే కుటుంబం త్యాగనిరతిని అందరూ ప్రశంసిస్తున్నారు. అవయవదానంపై అవహగాన లేకపోవడంతో మనదేశంలో దాతలు ముందుకురాని పరిస్థితి నెలకొంది. అవయవాలు పాడైపోయి ఏటా దేశంలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవదాతులు ముందుకు వస్తే ఈ పరిస్థితిని చాలావరకు నివారించవచ్చు. మరణానికి సార్థకత కావాలంటే అవయవదానమొక్కటే దారి. చనిపోయిన తర్వాత కూడా జీవించాలనుకుంటే అవయవదానం చేయండి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top