మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా?

మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? - Sakshi


మనది అమెరికానేనా.. మనం అమెరికాకు చెందిన వాళ్లమా? ఇక్కడ మనకు భద్రత ఉందా?.. ఇవి కన్సాస్‌లో శ్వేతజాతి ఉన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్‌ కూచిభోట్ల భార్య సునయన దుమల అడిగిన ప్రశ్నలు. అమెరికాలో చోటుచేసుకున్న విద్వేష కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్‌ కూచిభోట్ల ఉద్యోగం చేసే గార్మిన్‌ కంపెనీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన భార్య సునయన మాట్లాడారు.



అమెరికాలో జరుగుతున్న కాల్పుల ఘటనలు తనను ఆందోళనకు గురిచేశాని, ఒకదశలో ఈ దేశంలో మనం ఉండగలమా? అని తన భర్తని అడిగితే.. ఏం కాదు అమెరికాలో మంచి రోజులు వస్తాయని ఆయన చెప్పేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. అమెరికాలో మైనారిటీలు, విదేశీయులపట్ల వివక్ష చూపుతున్న ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయని, మేం ఇక్కడి వాళ్లమేనా? అన్న సందేహాలు కలిగిస్తున్నాయని ఆమె అన్నారు.



ఇప్పటికైనా ఈ విద్వేష నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని ఆమె ప్రశ్నించారు. విద్వేష దారుణాలపై అమెరికా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన భర్తకు ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాకు వెళ్లిపోదామని తాను గతంలో ఎన్నోసార్లు చెప్పినా తన భర్త ఒప్పుకోలేదని ఆమె అన్నారు. ఇంత జరిగాక, ఇంకా అమెరికాలో ఉండటం అవసరమా? అని ఆమె వ్యాఖ్యానించారు. తమకు పిల్లలు కూడా లేరని, తన భర్త జ్ఞాపకాలే ఇప్పుడు తమకు మిగిలాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.



మరోవైపు మృతుడు శ్రీనివాస్‌ కుటుంబానికి ఆదుకునేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. హుస్టన్‌లోని భారత కౌన్సెల్‌ జనరల్‌ అనుపమ రాయ్‌ ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. శ్రీనివాస్‌ కుటుంబానికి అన్ని విధాల సాయం చేసేందుకు కృషి చేస్తున్నారు.



తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్‌ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్‌ బార్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది\


 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top