'ప్రపంచానికి ఆమె స్ఫూర్తిగా నిలిచారు'

'ప్రపంచానికి ఆమె స్ఫూర్తిగా నిలిచారు' - Sakshi


న్యూఢిల్లీ: భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడును అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీయిచ్చారు. పండుగ సమయంలో తమిళనాడును వర్షాలు ముంచెత్తడం బాధాకరమని అన్నారు. మృతులకు ఆయన సంతాపం తెలిపారు. 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా రేడియాలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అవయవదానంతో విలువైన ప్రాణాలు కాపాడొచ్చని చెప్పారు. అవయవదానం చేసిన వారికి మరణం లేదని, వారు అమరజీవులుగా మిగులుతారని అన్నారు.



గత ప్రసంగంలో తాను అవయవదానం గురించి మాట్లాడడంతో నొటో(ఎన్ఓటీటీఏ) హెల్ప్‌ లైన్ కు కాల్స్ పెరిగాయని వెల్లడించారు. నొటో వెబ్ సైట్ కు హిట్స్ 2.5 రెట్లు పెరిగాయన్నారు. నవంబర్ 27న మనదేశంలో అవయవదాన దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చారు. నొటో లోగో, డోనర్ కార్డ్, స్లొగన్ కోసం దేశవ్యాప్తంగా పోటీ నిర్వహిస్తున్నామని తెలిపారు.



మన రైతులు సైంటిస్టులకు ఏమాత్రం తీసిపోరని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే పంటలు కోసిన తర్వాత పొలాల్లో మిలిగిన వాటిని తగులబెట్టడం వల్ల కాలుష్యం పెరుగుతోందని, ఇలా చేయొద్దని రైతులకు సూచించారు. నేపాల్ లో భూకంపం సంభవించిన తర్వాత విపత్తు సన్నద్ధతకు కలిసి రావాలని సార్క్ దేశాలను కోరినట్టు తెలిపారు.


వికలాంగులు ఎవరికీ తీసిపోరని, వారు సూర్ఫిప్రదాతలని అన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇంధనాలను పొదుపుగా వాడడమే ఇందుకు మార్గమని  మోదీ పేర్కొన్నారు. కాన్పూర్ కు చెందిన నూర్జహాన్ సౌరశక్తితో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top