ధనార్జనకే పట్టిసీమ

ధనార్జనకే పట్టిసీమ - Sakshi


వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ ధ్వజం

సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ధనార్జన కోసం చేపట్టారే తప్ప ప్రజల కోసం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టిసీమతో వచ్చే రూ.1300 కోట్ల ముడుపులపైనే తప్ప నీటిపైన ఆసక్తి లేదని విమర్శించారు. నదుల అనుసంధానికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదని, అందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపైనే అభ్యంతరమని స్పష్టంచేశారు.



గతంలోనే తమ పార్టీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని చెప్పారని, తాము అదే వైఖరికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.పట్టిసీమ ప్రాజెక్టుపై బుధవారం అసెంబ్లీలో స్వల్ప వ్యవధి చర్చను ప్రారంభిస్తూ జ్యోతుల నెహ్రూ అధికార పార్టీ వైఖరిపై విరుచుకుపడ్డారు. వృధాగా పోతున్న గోదావరి జలాలను వినియోగంలోకి తేవడానికి ఎవ్వరికీ అభ్యంతరం లేదని, దాన్ని ఉపయోగించే విధానంపైనే అభ్యంతరమని చెప్పారు. 13 జిల్లాల నీటి సమగ్రత కాపాడుకోవాలనుకున్నప్పుడు గోదావరి, కృష్ణ, నాగావళి, వంశధార, గాలేరు-నగరి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.



కానీ అధికారపక్షం పట్టిసీమలో వచ్చే రూ.1300 కోట్లపై ఆసక్తితో దానికే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.ఓ వైపు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందంటూ ఈ వ్యయం ఎందుకని ప్రశ్నించారు. ఈ ఖర్చును పోలవరం ప్రాజెక్టుపై పెడితే ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేస్తానని కేంద్రం చెబుతున్నా ఏం ఆశించి పట్టిసీమకు ప్లాన్ చేశారని నిలదీశారు. కృష్ణా నదిని కర్ణాటకకు, గోదావరి నదిని మహారాష్ట్రకు అప్పగించిన ఫలితమే నీటి కొరత కాదా? అని ప్రశ్నించారు.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాం ఎవరి పాలనలో కట్టారో చెప్పాలని నిలదీశారు.



‘‘పులిచింతల ప్రాజెక్టుకు రూ.200 కోట్లు ఖర్చు పెడితే 40 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం వస్తుంది. కానీ తాత్కాలిక ప్రాజెక్టు పట్టిసీమపై అధిక  ఆసక్తి చూపిస్తూ వైఎస్సార్ హయాంలో చేపట్టిన పులిచింతలకు రూ.200 కోట్లు ఖర్చు పెట్టకుండా నిర్వీర్యం చేస్తున్నారు. పట్టిసీమవల్ల గోదావరి జిల్లాలకు నష్టం ఉండదని, గోదావరి డెల్టా రైతులు త్యాగధనులనీ అంటున్నారు.వందేళ్ల సైక్లింగ్‌ను చూడండి వాస్తవం మీకే బోధ పడుతుంది. ఈసారి తొలకరికే నీళ్లు ఇవ్వలేని స్థితి ఏర్పడింది’’ అని నెహ్రూ వివరించారు. నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టిందే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని చెప్పారు.



(ఈదశలో ముఖ్యమంత్రికి, నెహ్రూకి మధ్య సంవాదం నడిచింది). ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయవద్దని, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేస్తే రాయలసీమకు నీళ్లు వస్తాయనే ఆలోచన చేసిందే వైఎస్సార్ అని, జలయజ్ఞాన్ని చేపట్టిందే అందుకని వివరించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేస్తే సీమకు నీళ్లు ఇవ్వొచ్చన్నారు. రాయలసీమకు కేటాయించిన నిధులెన్నని ప్రశ్నించారు.



పోలవరం ప్రాజెక్టుపై రూ.200 కోట్లే ఖర్చు పెట్టడాన్ని తప్పుబట్టారు. నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తున్నామన్నారు. (మళ్లీ సీఎం అడ్డుతగిలి రాయలసీమ నీటి ప్రాజెక్టులకు వ్యయం చేసిన మొత్తాలను వివరించారు. హంద్రీ నీవాకు రూ.665.66 కోట్లు, గాలేరు-నగరికి రూ.267.70 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు)

 

పూర్తికాని ప్రాజెక్టు జాతికి అంకితమా?

పట్టిసీమ ప్రాజెక్టును దశల వారీగా పూర్తి చేస్తామని ఓ వైపు చెప్తూనే... పూర్తి కాని ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కిందని నెహ్రూ విమర్శించారు. ‘‘ఎక్కడయినా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 20 శాతమో, 30 శాతమో, 50 శాతమో నీళ్లు వదిలిన తర్వాత జాతికి అంకితం చేస్తారు. కానీ అసంపూర్తి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారా?’’ అంటూ ఫోటోలను సభకు చూపారు. ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ఇక్కడే బయటపడుతోందని, ఇది రాయలసీమను, రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమేనని ధ్వజమెత్తారు.



కుడికాల్వ సామర్థాన్ని కూడా బాగా కుదించి తవ్వుతున్నారని, దీనివల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని తెలిపారు. పూర్తి స్థాయిలో కాలువల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక బక్కెట్ నీళ్లను కృష్ణా నదిలో పోసి అదే నదుల అనుసంధానం అనుకోమంటారా? అని నిలదీశారు. ‘‘పోలవరం నాలుగేళ్లలో పూర్తయితే.. ఈలోపు తాత్కాలిక పద్ధతిలో నీటిని తరలించలేమా? అలాచేస్తే నిధుల దుర్వినియోగం జరిగేది కాదు.



శాశ్వత ప్రయోజనాన్ని కలిగించే పులిచింతలను, పోతిరెడ్డిపాడును పక్కనబెట్టి, తాత్కాలిక ప్రాజెక్టు పట్టిసీమకు ప్రాధాన్యం ఇస్తారా? ఇదేనా మీ చిత్తశుద్ధి? సీమకు నీళ్లు ఇచ్చే పద్ధతి ఇదేనా? సమగ్రంగా నీళ్లు ఇవ్వాలన్నదే మా పార్టీ విధానం’’ అని చెప్పారు. ప్రాజెక్టుల కోసం బస్సు యాత్ర చేసింది కూడా తమ పార్టీయేనన్నారు.

 

టీడీపీకి తోకపార్టీ : నెహ్రూ ఓ దశలో బీజేపీని టీడీపీకి తోకపార్టీ అన్నందుకు ఆ పార్టీ శాసనసభ్యులు ఏ.సత్యనారాయణ, విష్ణుకుమార్ రాజు అభ్యంతరం తెలిపారు. నెహ్రూ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సైతం ఈ వ్యాఖ్యపై అభ్యంతరం తెలిపారు. పట్టిసీమ విధాన ప్రకటనపై జరిగిన చర్చలో మంత్రులు అచ్చన్నాయుడు, దేవినేని ఉమ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. నెహ్రూ మాట్లాడుతున్నంతసేపూ అధికార పక్ష సభ్యులు అడ్డుతగులుతూనే వచ్చారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top