మెమన్ ఉరితీతపై జస్టిస్ శ్రీకృష్ణ ఏమన్నారంటే..

మెమన్ ఉరితీతపై జస్టిస్ శ్రీకృష్ణ ఏమన్నారంటే..


ముంబై: '900 మంది  హత్యకు గురైన అల్లర్ల కేసులో కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే దోషులుగా మిగిలారు. అదే 260 మంది చనిపోయిన పేలుళ్ల కేసులోనైతే 100 మందికిపైగా దోషులుగా తేలారు. ఇక్కడ నా ఉద్దేశం మరణాలను బట్టి దోషుల సంఖ్య ఉండాలని కాదు. కేసు విచారణ జరిగిన తీరు అందరికీ అర్థం కావడానికే ఇది చెబుతున్నా' అంటూ 1992 ముంబై మత ఘర్షణలు, 1993 పేలుళ్ల దోషులకు శిక్షల అమలులపై జస్టిస్ శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు.  



1993 ముంబై వరుస పేలుళ్లకు అసలు కారణమైన మత ఘర్షణలపై ఏర్పాటయిన విచారణా కమిషన్కు నేతృత్వం వహించి.. నిజమైన నివేదిక ఇచ్చారని పేరుతెచ్చుకున్న జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ.. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. అల్లర్ల కేసులో దోషులతో పోల్చితే పేలుళ్ల దోషులకు శిక్షలు అమలుచేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. పేలుళ్లకు ముందు జరిగిన మత ఘర్షణల్లో దాదాపు 900 మంది (వీరిలో అత్యధికులు ముస్లింలు) హత్యలకు గురయిన సంగతి తెలిసిందే.



'నా దృష్టిలో ప్రభుత్వం ఏకపక్షం వహించింది. విద్రోహులను కఠినంగా శిక్షించాలనే పట్టుదలను అల్లర్ల దోషుల విషయంలో మాత్రం కనబర్చలేదు. బలమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కేసును ముందుకు తీసుకువెళ్లడంతో ప్రభుత్వాలు అశ్రద్ధ వహించాయి. అది కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి కానివ్వండి లేదా బీజేపీ- శివసేన కూటమి కానివ్వండి. రెండూ ఒకేలా వ్యవహరించాయి.



మెమన్ ఉరితీతను సమర్థిస్తున్నా. తుది నిమిషం వరకూ సుప్రీంకోర్టు దోషికి అనేక అవకాశాలు కల్పించింది. తుది తీర్పును తప్పుబట్టాల్సిన పనిలేదు, ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఉన్నప్పుడు సహజంగానే ఏదోఒక తీర్పు వెలువడకతప్పదు. నిజాకి కోర్టులన్నీ సాక్ష్యాధారాల లభ్యత, వాటి నిరూపణ ఆధారంగానే పనిచేస్తాయనే విషయం మనం గుర్తుంచుకోవాలి.



అయితే అల్లర్ల కేసులో అలాంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ వాటిని కోర్టుకు సమర్పించడంలో ప్రభుత్వాలు సరైన రీతిలో వ్యవహరించలేదు. అల్లర్లకు ప్రతీకారంగానే పేలుళ్లు జరిగాయనడం సమర్థనీయం కాదు కూడా. పేలుళ్ల కేసులో శిక్షలు అమలైనట్లే అల్లర్ల కేసులో నిజమైన దోషులందరికీ శిక్ష పడాలని, ఆ రోజు వస్తుందనుకుంటున్నా' అంటూ ముగించారు జస్టిస్ శ్రీకృష్ణ.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top