కుటుంబానికో ఉద్యోగం

కుటుంబానికో ఉద్యోగం - Sakshi


వారికి 15 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం: కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద ముంపునకు గురవుతున్న నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నామని... ఒక్కో కుటుంబానికి ఒక్కో ఉద్యోగం చొప్పున నిర్వాసితులకు 15 వేలకుపైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సాధ్యమైనంత వరకు వారిని ప్రాజెక్టుల నిర్వహణ కార్యకలాపాలకు వినియోగించుకుంటామని, ఇంకా మిగిలిన వారికి అర్హతలను బట్టి ఇతర శాఖల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. భూములను, ఇళ్లను, వ్యవసాయాన్ని కోల్పోతున్న వారిపట్ల సానుభూతితో వ్యవహరించాలని అధికారులకు సూచించారు.



శుక్రవారం పాలమూరు ప్రాజెక్టుతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో నిర్మించనున్న పలు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసంలో మంత్రులు, అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలన్నారు.



పాలమూరు ప్రాజెక్టు భూసేకరణకు ప్రభుత్వం ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. భూములు కోల్పోతున్న వారికి మార్కెట్ రేటుకు అనుగుణంగా ధర చెల్లించాలని, ఇళ్లు కోల్పోయే వారికి వెంటనే పరిహారం అందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో చేపట్టే అన్ని నీటి ప్రాజెక్టుల భూసేకరణకు ఇదే విధానం అమలు చేయాలన్నారు. వేలకోట్ల రూపాయలతో ప్రాజెక్టులను కడుతుంటే... కొద్దిపాటి డబ్బులతో పరిష్కారమయ్యే భూసేకరణలోనే జాప్యం చేయటం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను రీడిజైన్ చేయటం వల్ల అంతర్ రాష్ట్ర వివాదాలు, ఇతరత్రా సమస్యలు చాలా వరకు తగ్గాయని సీఎం చెప్పారు. ముంపు పెద్దగా లేనప్పటికీ కొన్ని ఆవాస ప్రాంతాల ప్రజలను తరలించడం అనివార్యమని... విధి లేని పరిస్థితుల్లోనే కొంత మంది ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందని తెలిపారు.



బీహెచ్‌ఈఎల్‌కు ఆర్డర్

పాలమూరు ప్రాజెక్టుకు ఎన్ని మోటార్లు, పైపులైన్లు కావాలో ముందే గుర్తించి ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు ఆర్డర్ ఇవ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు వెంటనే మొదటి దశ టెండర్లు పిలవాలని ఆదేశించారు. పనులు వేగంగా జరిపించాలని, బిల్లులు కూడా వెంటవెంటనే చెల్లించాలని చెప్పారు. మోటార్లు, పైపుల తయారీ కోసం బీహెచ్‌ఈఎల్‌కు అడ్వాన్సు కూడా ఇస్తామని చెప్పారు. మొత్తం ప్రాజెక్టును ఒకే ఏజెన్సీకి అప్పగించకుండా.. ఐదారు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని సూచించారు.



అన్ని ప్యాకేజీల్లో పనులు ఎక్కడికక్కడ సమాంతరంగా జరగాలన్నారు. భూసేకరణ అనే సమస్యే ఉండదు కాబట్టి ప్రాజెక్టులు త్వరితగతిన కట్టడం సాధ్యమేనని కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రు లు, ఎమ్మెల్యేలు ఏ ప్రాంతంలో ఎవరు భూసేకరణ, పనుల పర్యవేక్షణను చేపట్టాలో సీఎం నిర్ణయించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయ్యే వరకు తాను, మంత్రి హరీశ్‌రావు నిరంతరం పర్యవేక్షిస్తామని.. టెండర్లు ఖరారైన తర్వాత కాంట్రాక్టర్లతో తానే స్వయంగా మాట్లాడి పనులు వేగంగా చేయాలని కోరతానని చెప్పారు. పనులు జాప్యమైతే ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతులు నిరాశ చెందుతారని వ్యాఖ్యానించారు.

 

డిండి భూసేకరణకు రూ.75 కోట్లు

డిండి ప్రాజెక్టు ద్వారా నల్లగొండ జిల్లాకు, లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీరివ్వాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. డిండి పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని, ఈ ప్రాజెక్టు భూసేకరణకు రూ.75కోట్లను శనివారమే విడుదల చేయాలని సీఎస్ రాజీవ్‌శర్మను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top