'జల్లికట్టు'.. 'హిందుత్వ'కు చెంపపెట్టు: అసదుద్దీన్‌

'జల్లికట్టు'.. 'హిందుత్వ'కు చెంపపెట్టు: అసదుద్దీన్‌


హైదరాబాద్‌: జల్లికట్టు ఆందోళనల నేపథ్యంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సంప్రదాయ క్రీడపై నిషేధాన్ని ఎత్తేయాలని తమిళులు చేస్తోన్న ఆందోళన హిందూత్వ శక్తులకు చెంపపెట్టు లాంటిదని ఒవైసీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని, రకరకాల జాతులు, మతాలకు చెందినవారు తమతమ సంప్రదాయాలు పాటిస్తారని, అయితే ఈ స్ఫూర్తికి భిన్నంగా హిందుత్వ శక్తులు ఉమ్మడి పౌరస్మృతిని తేవాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.



జల్లికట్టు కోసం తమిళ ప్రజలు చేస్తోన్న ఆందోళన.. ఈ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఎన్నటికీ సాధ్యం కాదనే వాదనకు బలం చేకూర్చుతుందని అసదుద్దీన్‌ ఒవైసీ శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జల్లికట్టును, దానిని పాటించే తమిళ ప్రజలను పరిగణలోకి తీసుకోకుండా చట్టాలు అమలుచేసినట్లే.. ముస్లింల జీవనవిధానంపైనా బలవంతపు చట్టాలు రుద్దుతున్నారని, ఇలాంటి చర్యలు దేశానికి మంచివి కావని ఒవైసీ వ్యాఖ్యానించారు. జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేయాలని తమిళనాడు వ్యాప్తంగా చేస్తోన్న ఆందోళనలు శుక్రవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. పలు రాజకీయ, సినీ ప్రముఖులు ఆందోళనకు మద్దతు పలుకుతున్నారు.

చెరఖాను ఎలా తిప్పుతారు?
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతోన్న అసదుద్దీన్‌.. గురువారం షహరాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఖాదీ క్యాలెండర్‌పై మోదీ ఫొటోను గురించి మాట్లాడుతూ.. 'సాధారణంగా చెరఖాను రెండు చేతులు ఉపయోగించి తిప్పుతారు. కానీ మన మోదీ మాత్రం ఒక్కచేత్తో చెరఖాను తిప్పేస్తున్నారు. ఇదీ.. చెరఖా వాడకంపట్ల అతనికున్న జ్ఞానం! మన అదృష్టం ఏంటంటే.. ఎర్రకోట, తాజ్‌మహల్‌లు శతాబ్దాల కిందటే నిర్మాణమయ్యాయి. అవిగానీ నిన్నో, మొన్నో నిర్మించనవైతే, వాటిని కూడా నేనే కట్టానని మోదీ గప్పాలు చెప్పుకునేవారు'అని విమర్శించారు. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు ఒక నాణేనికి రెండు వైపుల లాంటివని, ఇద్దరివీ పేదలు, ముస్లిం వ్యతిరేక విధానాలేనని అన్నారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top