జైలులోని భర్తతో ఏకాంతం కోరి...

జైలులోని భర్తతో ఏకాంతం కోరి...


ముంబయి: గ్యాంగ్‌స్టర్‌ పరారీ ఘటనపై విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. నిందితుడికి గస్తీగా ఉన్న ఇద్దరు పోలీసులు.. అతనికి భార్యతో హోటల్‌ గదిలో ఏకాంతంగా గడిపే అవకాశం ఇవ్వడంతో పాటు లక్ష రూపాయల ముడుపులు అందుకున్నారు. దీంతో జైలు నుంచి హోటల్‌కు చేరుకున్న నిందితుడు..  హోటల్‌ బయట కాపలాగా ఉన్న పోలీసుల కళ్లుగప్పి.. కిటికీలోంచి దూకి పరారయ్యాడు.



ఓ ఆస్తి వివాదంలో సిడ్కో ఉద్యోగిని కిడ్నాప్‌ చేసి హత్య చేసిన కేసులో 2013లో గ్యాంగ్‌స్టర్‌ హనుమాన్‌ పాటిల్‌ను అరెస్ట్‌ చేసి తలోజా జైలుకు తరలించారు. అదే ఏడాది ఫిబ్రవరి 11న వైద్య పరీక్షల నిమిత్తం పాటిల్‌ను జేజే ఆస్పత్రికి తీసుకువచ్చారు. మందులు కొనుగోలు చేయాలనే సాకుతో తన పరారీ ప్లాన్‌ను అమలు చేశాడు. దీనిపై నవీముంబయి ఎస్కార్ట్‌ టీమ్‌ జేజే మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జేజే మార్గ్‌ పోలీసుల దర్యాప్తులోనే దిమ్మతిరిగే విషయాలు వెల్లడయ్యాయి.



పాటిల్‌ను యూపీలో గత నెలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాటిల్‌ను ప్రశ్నించగా ఎస్కార్ట్‌ బృందంలో కొందరు పోలీసులు తన అదృశ్యానికి సహకరించిన తీరు వెల్లడైంది. మందులు కొనుగోలు చేసేందుకు అనుమతించాలని జేజే ఆస్పత్రి వద్ద పోలీస్‌ అధికారిని పాటిల్‌ కోరగా, ఇద్దరు ఎస్కార్ట్‌ సిబ్బందిని పాటిల్‌ వెంట ఇచ్చి పంపారు. అయితే పాటిల్‌, ఆయన భార్య మొనాలిని సిబ్బంది నేరుగా బ్రైట్‌వే హోటల్‌ రూమ్‌కు తీసుకువెళ్లారు. భర్తతో తాను కొద్దిసేపు ఏకాంతంగా గడిపేందుకు అనుమతించాలని మొనాలి కోరడం‍తో దాదాపు మూడు గంటల పాటు వారిని ఒకే రూమ్‌లో ఉండేందుకు కానిస్టేబుల్స్‌ అనుమతించారు. ఆ తర్వాత రూమ్‌ డోర్‌ను ప్రెస్‌ చేసిన కానిస్టేబుల్‌కు రూమ్‌లో మొనాలి ఒక్కరే కనిపించడంతో ఎస్కార్ట్‌ బృందం షాక్‌కు గురైంది. హోటల్‌ రూమ్‌ కిటీకి నుంచి నిందితుడు పాటిల్‌ పరారయ్యాడు. పాటిల్‌ దంపతులను ఏకాంతంగా ఉండేందుకు అనుమతించడంతో పాటు మొనాలి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకున్నందుకు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top