నీలి చిత్రాలను అడ్డుకోవడం సాధ్యమా?

నీలి చిత్రాలను అడ్డుకోవడం సాధ్యమా? - Sakshi


న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్‌ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించి అట్టహాసంగా ఆరంభశూరత్వాన్ని ప్రదర్శించిన మోదీ ప్రభుత్వం ఆ లక్ష్య సాధనలో ఏమాత్రం ప్రగతి సాధించిందో మనకందరికి తెల్సిందే. ఇప్పుడు ఆన్‌లైన్‌లో నీలి చిత్రాలను నిషేధించడం ద్వారా స్వచ్ఛ ఇంటర్నెట్‌ను సాధించాలనేది మరో తాపత్రయం. దీనిపై మంచి చెడులు, మన సంస్కృతి...సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ లాంటి అంశాలను పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఇంటర్నెట్‌లో నీలి చిత్రాలను అడ్డుకోవడం సాంకేతికంగా సాధ్యమయ్యే విషయమేనా?



యూట్యూబ్‌ను పాకిస్తాన్‌లో, ఫేస్‌బుక్‌ను చైనాలో నిషేధించారు. మరి అక్కడి ప్రజలు వీటిని ఉపయోగించడం లేదా అంటే ఉపయోగిస్తున్నారు. అది ఎలా అంటే...వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) సర్వీసెస్ ద్వారా... ఇప్పుడు ఈ సర్వీస్ ప్రొఫైడర్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. దాదాపు 80 దేశాలకు వారి సర్వీసులు విస్తరించాయి. ఈ సర్వీసును ఉపయోగించడం వల్ల మన ఐపీ నెంబరు ఎవరికి తెలియదు. పూర్తి స్థాయిలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. ఈ వీపీఎన్‌ను ఉపయోగించడం ద్వారానే పాకిస్తాన్ నెటిజన్లు యూట్యూబ్‌ను, చైనా ప్రజలు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు. వెబ్‌సైట్లపై నిషేధం ఇలాంటి కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తుంది.



శనివారం నాడు మహానగర్ టెలిఫోన్ లిమిటెడ్, భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్, వొడాఫోన్, యాక్ట్ సర్వీసు ప్రొవైడర్ల వినియోగదారులు మాత్రమే పోర్న్ వెబ్‌సైట్లను వీక్షించలేక పోయారు. ‘డెరైక్టరి డిఎగ్జిస్ట్’, వెబ్‌సైట్ ఈజ్ బ్లాక్డ్ బై కాంపిటెంట్ అథారటీ’ అనే సందేశాలు వారికి కనిపించాయి. ఏర్‌టెల్, టికోనా తదితర కేబుల్ నెట్‌వర్క్ వినియోగదారులకు ఎలాంటి నిషేధం అడ్డురాలేదు. దాదాపు 900 పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేశామని భారత ప్రభుత్వం ప్రకటించుకుంది. కానీ ఆన్‌లైన్ ఇలాంటి సైట్లు లక్షకుపైగా ఉందన్నది సాంకేతిక నిపుణుల అంచనా. వీపీఎన్ సర్వీసు కంపెనీలు ఉన్నప్పుడు ఇలాంటి సైట్లను అడ్డుకోవడం అసాధ్యం



ఒకవేళ ప్రభుత్వ సర్వీసు ప్రొవైడర్ల మేరకైనా అడ్డుకోవాలంటే పోర్న్ వెబ్‌సైట్లతోపాటు వైద్య, విజ్ఞాన రంగాలకు సంబంధించిన కీలక సమాచారం గల్లంతవుతుంది. వెబ్ ఫిల్టర్లు కేవలం ‘కీ పదాల’ ఆధారంగా పని చేస్తాయిగనుక ఎయిడ్స్‌కు సంబంధించిన సమాచారం గల్లంతుకావచ్చు. సెక్స్ సమస్యలకు సంబంధించిన వైద్య విజ్ఞానానికి సంబంధించిన సమాచారమూ గల్లంతుకావచ్చు. ‘సెక్స్’ అనే కీ పదాన్ని వెబ్ ఫిల్టర్లు అడ్డుకున్నా వినియోగదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండకపోవు. సన్నీ లియోన్ లాంటి స్టార్ల పేర్ల ద్వారా కూడా ఇలాంటి సైట్లకు వెళ్లే మార్గాలు ఉంటాయి.



పోర్న్ వెబ్‌సైట్లను చూసే దేశాల్లో భారత్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందని 2013 సెప్టెంబర్ నెల నుంచి 2014 సెప్టెంబర్ వరకు జరిపిన సర్వేలో తేలిందని అలెగ్జా తెలియజేసింది. ఈ సైట్లను చూసే ప్రపంచ ప్రజల సరాసరి సగటు 7.6 శాతం ఉండగా, భారత్ ప్రజల సగటు 7.32 శాతం ఉంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top